దేవుళ్ళు
"పారాడే కృష్ణుడి బొమ్మ పూజలో ఉంటే
చక్కగా ఇల్లంతా పిల్లలు పారాడుతారు."అని అమ్మ ఇంకా ఏమో చెప్పబోతూ ఉంటే
"ఇంకేం పారాడే పిల్లలమ్మా , నా పిల్లలను, మనవళ్ళను అందరినీ పెంచాను.ఇంక నాకు ఓపికలేదు మునిమనవళ్ళను కూడా పెంచేందుకు
అని అమ్మ ఇస్తున్న కృష్ణుడి బొమ్మ తీసుకోలేదు నేను."నేను చెప్పే మాట వినే
ఓపిక నీకెప్పుడూ లేదు.నేను ఇవ్వనులే "అని అలిగింది అమ్మ. "ఇది మరీ
చిటికెనవేలు గోరంత ఉంది.ఎక్కడ పెట్టి పూజ చేస్తాను"అన్నాను.మాట్లాడకుండా ఓ
చిన్న వెండిపళ్ళెం లో ,ఆ బుజ్జి పారాడే కృష్ణుని పెట్టి
ఇచ్చింది." ఇంత
చిన్న పళ్ళెం లోనా?ఎక్కడన్నా పడిపోతాడేమో పోనీ
చిన్న వెండి గిన్నెలో పెట్టుకోనా?" అంటే
"వద్దు.ఇట్లా పళ్ళెం లోనే ఉండనీయి .గిన్నెలో ఐతే బంధించినట్లుంటాడు
పాపం." అంది.ఇంకా నయం డ్రాయింగ్ రూంలో పెట్టు ఇల్లంతా దొగాడుతాడు అనలేదు అని
సంతోషించి తెచ్చి పూజలో పెట్టాను.ప్రతిరోజూ పూజ చేసుకునే ముందు ,పారాడుతూ పారాడుతూ ఎటో పారిపోయిన ఆ బుజ్జిగాడిని వెతుకుంటూ ఈ సంభాషణ అంతా
తూచా తప్ప కుండా గుర్తుతెచ్చుకుంటాను.నా మొహం మర్చిపోతేగా గుర్తు తెచ్చుకోవటానికి.నేను
ముందు రోజు పెట్టిన పూలు తీసి,శుభ్రం చేసుకొని పూజ మొదలు
పెట్టే సమయానికి కనిపించడు.ఈ మాయదారి కృష్ణుడు ఎక్కడా అని వెతుకుతే వంటింటి
గట్టుమీదో, బాల్కనీ లోనో తీసేసిన పూల మధ్య చిద్విలాసంగా
ఉంటాడు.అదీ ఓ పట్టాన దొరుకుతాడా? ఒక్కోపూవే తీస్తూ ఎన్ని
తిప్పలు పడాలో!"అమ్మ కొంచం పూలు తక్కువ పెట్టు.లేదా పూలు తీసేటప్పుడు
జాగ్రత్తగా తీయి."అని సలహా ఇస్తూ ఉంటుంది మా మణి.అదేమిటో ఊరంతా పూసేపూలు ఆ
సమయం లో మాఇంట్లో పూయవు.అన్ని చోట్లా పూయటం ఐపోయాక తీరికగా ఈ నెల నిద్ర లేచి అన్ని
చెట్లూ కలిసిమెలిసి ఒకేసారి పూస్తాయి.పొద్దున్నే కింద నుంచి వచ్చటప్పుడు పూల బుట్ట నిండా మందారాలు,
నంది వర్ధనాలు, గన్నేరులూ తెస్తుంది మణి.మరి
మల్లెలూ ఇప్పుడే వస్తాయి.వీటన్నిటితో పూజ చేయాలా వద్దా? సందట్లో
సడేమియాలా , చాన్స్ దొరికిందే చాలని ఆ పూలన్నిటితో కలిసి
బయటపడితే ఎట్లా చావను ఈ కిష్టిగాడితో!అక్కడితో ఐందా పళ్ళెం లో ఓ పట్టాన నిలవడు.అంటే
తల కిందులుగా పెట్టి ఉంటాను.తీసి కళ్ళ దగ్గరగా పెట్టుకొని చూసి , కాళ్ళు పళ్ళెం లోకి తల పైకి
వచ్చేట్టుగా పెట్టాలి.అంత చింటూగాడి తల కాళ్ళు వెతకాలని ఈ మధ్య కళ్ళజోడు కూడా పూజా
గదిలోకి ప్రవేశించింది.ఇంత చిన్ని కృష్ణుడేమిటమ్మా అంటే ఎంత ముద్దుగా ఉన్నాడో చూడు
,నెమలిపించము, కౌస్తుభము కూడా ఎంత బాగా
కనిపిస్తున్నాయో! అని సెంటిమెంట్తో,ఎమోషన్ తో పడేసింది
మాయమ్మ.అలనాడు ఆ యశోదమ్మ కిష్టయ్యతో ఎట్లా
వేగిందో!
ఆ మధ్య మా పిన్ని ఫోన్ చేసినప్పుడు"నువ్వు
ఇక్కడ నుంచి అమ్మవారి బొమ్మ కొనుక్కెళ్ళావు కదా , ఉందా?
పూజ చేస్తున్నావా?"అని అడిగింది.
"ఉంది పిన్ని.నువ్వు అమ్మవారికి మంగళసూత్రాలు కూడా కొనిచ్చావు కదా,పూజ చేసుకుంటూనే ఉన్నాను "అన్నాను."ఐతే హైద్రాబాద్ వచ్చేటప్పుడు
నీకు రెండు ఏనుగులు తెచ్చిస్తాను.అవి అమ్మవారి కి అటూ ఇటూ పెట్టు."అంది."ఏనుగులు
తెచ్చిస్తావా?నీకు ఏనుగులు కొనే తాహత్తు ఉందేమో కాని పిన్నీ
వాటిని పెంచే తాహత్తు నాకులేదు."అని జోకాను.పిన్ని దగ్గరకు మొన్న
వెళ్ళినప్పుడు గుర్తొచ్చి"నా ఏనుగులేవి పిన్నీ?"అని
అడిగాను."నీకు వాటిని పెంచే తాహత్తు లేదన్నావుగా అందుకే తేలేదు."అని అలక
చూపించింది."అబ్బా జోక్ చేసాను పిన్ని.నేను అప్పుడే వాటికోసం జాగా కూడా
చేసాను." అన్నాను.అలక మర్చిపోయి "అమ్మవారి పక్కన ఏనుగులు ఉంటే ఇల్లు
ధనధాన్యాల తో సౌభాగ్యంగా ఉంచుతుంది గజలక్ష్మి రూపం లో."అంది. "ఇప్పుడు
ఇక నాకు ధనం తో పనేముంది.ఉన్న ధనం చాలు .ఐనా నువ్వు చెప్పావుగా ఇవ్వు.ఏమిటో నువ్వూ
అమ్మ ఇట్లా నన్ను ఫిక్స్ చేస్తున్నారు."అన్నాను."గోవిందరాజస్వామి గుడి
పక్కన కొట్లల్లో ఇలా దేవుళ్ళ వాహనాలన్నీ అమ్ముతారు.నేను వెళ్ళినప్పుడల్లా ఆ
వాహనాలు బయటకు తీయించి బాగున్నవి కొని ఇట్లా ఇస్తుంటాను.వచ్చేవారం మీ చిన్న
తమ్ముడితో పంపిస్తాలే.నువ్వు చెప్పిన మాట విని శ్రద్దగా చేసుకుంటావని నీకు
చెపుతున్నాను."అంది పిన్ని.
"అదక్కా సంగతి. ఆమ్మ , అమ్మ మాట వినేదానివి నువ్వొక్కదానివే.అందుకని, ఇక
నుంచి తిరుపతి నుంచి ఎవరొస్తూన్నా గరుడవాహనం ఎక్కి లక్ష్మీ నారాయణులు,సింహవాహనం ఎక్కి అమ్మవారు,నెమలి వాహనం ఎక్కి
కుమారస్వామి ఒక్కొక్కరుగా నీ ఇంటికి విచ్చేస్తారు. వారి
వాహనాల కి పార్కింగ్ ప్లేస్ కూడా ఎలాట్ చేయాలి. పూజ గది కాస్త పెద్దగా చేయించమని
బావగారికి చెప్పు."అన్నాడు మా తమ్ముడు.
అన్నట్లు మా బుజ్జి కృష్ణయ్య ఈ సారి వెరైటీగా
దేవుడి పీట కింది కి పాక్కుంటూ వెళ్ళిపోయాడు.నేను వంగలేక మణి ని వంగించి బయటకు రప్పించాను.ఇంతలో
మా జయ వస్తే"ఈ కృష్ణుడిని తెచ్చి నువ్వేనా ?అని
అడిగాను ఎందుకంటే అమ్మ షాపింగ్ అంతా తనే."అవును "అంది."ఇంతకంటే
చిన్నది దొరకలేదా?"అడిగాను."లేదక్కా.వెతికాను.”
సిన్సియర్ గా అని ,”ఇదే చిన్నది.ముందు కొంచం
పెద్దది తెస్తే ,వద్దు చిన్నది తెమ్మంది అమ్మ. అదేమి చేసిందో
ఇది నీకిచ్చిందా?ముద్దుగా ఉన్నాడు కదూ" అంది."ఏమి
ముద్దో తల్లీ నానా తిప్పలు పడుతున్నాను ఈ బుజ్జిగాడి తో."
No comments:
Post a Comment