గజరాజులు విచ్చేసెన్ :)
నాకు ఏనుగు కొనుక్కోవాలనే కోరిక
ఇప్పటిది కాదు.అదో అల్లప్పుడెప్పుడో సిలిగురి లో ఉన్నప్పుడు, ఓరొజు అడవి గుండా వెళుతుండగా ,సడన్ గా మా డ్రైవర్ జీప్ ఆపేసాడు.ఎందుకా అని అనుకుంటుండగా ఓ పెద్ద ఏనుగు, దానిని ఆనుకొని ఓ బుజ్జి ఏనుగు
రోడ్ మీద మందగమనం తో తాఫీగా వెళుతూ కనిపించాయి.అవి రోడ్ దాటి,అడవిలోకి వెళ్ళేదాకా డ్రైవర్ జీప్ ఇంజన్ కూడా శబ్దం కాకుండా
ఆపేసాడు.అవి లోపలి కి వెళ్ళిపోయాక అమ్మయ్య అని బయిలుదేరాడు.ఆ బుజ్జి ఏనుగు ఎంత
ముద్దొచ్చేసిందో!అదో అప్పటి నుంచి నాకు ఏనుగుల మీద ప్రేమ పుట్టేసింది.దానికి
తగ్గట్టు మా ఏమండీ ఆర్డర్లీ వెంకటేశం పొద్దున్నే వచ్చి,మా ఏమండీ ఆఫీస్ కు వెళ్ళాక,నేనిచ్చిన కాఫీ
తాగుతూ,అతను ఆంధ్రాసైడ్ నుంచి వచ్చాడు.కుటుంబం అక్కడే
ఉంది.ఇక్కడ లంగర్ లో ఇచ్చే టీ నచ్చేది కాదు అందుకని నేను కాఫీ ఇస్తే మహా ఎంజాయ్
చేస్తూ, తాగుతూ అంతకు ముందు రోజు యూనిట్ దగ్గర
ఏనుగులు చేసిన అల్లరి కథలు కథలుగా చెప్పేవాడు.ఓ సారి సెంట్రీ
వళ్ళో అరటిపండ్లు పెట్టుకొని ఒకటొకటే తిందామని ఒకటి వలిచి నోట్లో పెట్టుకోబోతే
వెనక నుంచి ఎవరో గుంజేసుకున్నారట.ఎవరోలే అనుకొని ఇంకోటి వలుస్తే అదీ
గుంజేసుకున్నారట.ఇలా మూడు అయ్యేసరికి కౌన్ బే అని కోపంగా వెనక్కి తిరుగుతే ఓ ఏనుగు
పిల్ల ఉందిట. అంతే అతను అరటిపళ్ళు అక్కడేపడేసి పరుగోపరుగు.ఏనుగు పిల్లకే భయమా అంటే
పిల్లను చూస్తే భయం కాదుట అది అరిస్తే ఏనుగుల మంద వచ్చిపడతాయట.అలా రోజొక కథ
చెప్పేవాడు.దానితో ఏనుగుల మీద ప్రేమ ఇంతై వటుడింతై అన్నట్లు పెరిగిపోయి ఓ ఏనుగు
కొనుక్కుందామండీ అని రోజూ మా ఏమండీని పోరేదానిని.మా ఏమండీ ఏమో నన్ను ఎగాదిగా చూసి
ఏనుగంటే ఏమనుకుంటున్నావు?అందులోనూ అడవి ఏనుగు నిన్నూ నన్నూ
ఎత్తి అవతలపారేస్తుంది అని కోపం చేసేవారు.ఏమిటో పెళ్ళాం కోరిక కొంచమైనా
అర్ధం చేసుకోరు :( ఐనా నా పోరు పడలేక రెండు కుందేళ్ళు తెచ్చి ఇవి
పెంచుకో అన్నారు.ఆ తరువాత అరణ్యవాసం నుంచి జనావాసం లోకి వచ్చాక ఏనుగుల కోరిక
మరుగున పడిపోయింది.
మళ్ళీ ఈ మధ్య యోగా నేర్చుకుందామని ఓ
యోగా టీచర్ ఇంటికి వెళితే అక్కడ గేట్ దగ్గరే , ఎర్రకోట ఏనుగు ఠీవీ గా కనిపించేసరికి ఏనుగు కోరిక పురి
విప్పింది.దానికి తగ్గట్టు రోజూ క్లబ్ కు వెళ్ళేటప్పుడు ఏఓసీ సెంటర్ దగ్గర ఓ పెద్ద
నల్ల ఏనుగు బొమ్మ నన్ను చూడు నా అందం చూడు అన్నట్లు తొండమెత్తి దర్జాగా
ఊరిస్తోంది.మళ్ళీ ఏమండీ ఏనుగు కావాలీ అంటే వినిపించుకోరే! ఇట్లా కాదని డిసెంబర్ లో
మా కోడలు వచ్చినప్పుడు నా ఏనుగు కోరిక చెప్పాను."ఏనుగు ను పెంచుకుంటారా ఆంటీ?అసలు దానిని ఎక్కడ పెడుతారు?" అని గాభరా పడిపోయింది."నిజం ఏనుగు కాదులే అనూ,ఎర్ర కోట ఏనుగు.మన మెట్ల దగ్గర పెడితే ఎంత ఠీవిగా
బాగుంటుందో"అని ఊహల్లోకి వెళ్ళిపోయాను."ఓ ఎర్రకోట ఏనుగా ఐతే కొందాము
లెండి."అని ఊపిరి పీల్చుకుంది.ఆ తరువాత ఇద్దరమూ కలిసి రోడ్ పక్కన
మట్టిబొమ్మలు అమ్మేవాళ్ళ దగ్గర వెతికాము కాని దొరకలే.ఈ సారి వచ్చినప్పుడు ఇంకా
వెతికి కొనిస్తానులెండి ఆంటీ అని ప్రామిస్ చేసి వెళ్ళిపోయింది.ఇంతలో సందట్లో
సడేమియాలా మా డ్రైవర్ మేడం మీ ఏనుగుల మీద నా పిల్లలు ఎక్కి ఆడుకుంటారు."అని
సంబరపడిపోయాడు."అని బాంబ్ పేల్చాడు.బాగుంది సంబడం :(
ఇదిలా ఉండగా మా పిన్ని నీ అమ్మవారి
పక్కన పెట్టేందుకు రెండు ఏనుగు బొమ్మలు కొన్నాను అని మా తమ్ముడితో పంపింది.ఎంత
ముద్దుగా ఉన్నాయో బుజ్జి బుజ్జి ఏనుగులు . "మీ పిన్ని ని అడిగావా ఏనుగులు కావాలని ?" అన్నారు ఏమండీ."అయ్యో లేదు అమ్మవారు
తెప్పించుకుంది."అన్నాను. ఐనా ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ
ఎర్రకోట ఏనుగు సంపాదించుకోవాలి.వేటి అందం వాటిదే మరి .
"జయ జయ దుర్గతి నాశిని కామిని
సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాది సమావృత పరిజన మండిత
లోకనుతే;
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాపనివారిత
పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని గజలక్ష్మీ
జయపాలయమాం!!"
No comments:
Post a Comment