Wednesday, January 31, 2018

సమ్మక్క-సారలమ్మ





















మాకు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మా ఎల్లమ్మ ప్రతి సంవత్సరం  సమ్మక్క ప్రసాదం బంగారం ( బెల్లం) తెచ్చి ఇస్తోంది.దానితో , నా చిన్నప్పటి విషయం గుర్తొచ్చింది :) నా చిన్నప్పుడు ఒక్ గూడెం లో ఉన్నట్లుగా గుర్తు.అక్కడ వెదురు గుడిశెలో ఉండేవాళ్ళం.అమ్మ బయట నులక మంచం మీద కూర్చొని ఉంటే, కింద ఒక లంబాడీ ఆమె కూర్చొని అద్దాలు కుడుతూ ఉండేది.అప్పుడు నాకు అన్నీ అద్దాల లంగాలు జాకిట్లు,గౌన్లు ఉండేవి.సాయంకాలం నాన్నగారు రాగానే ఎవరో ఒకళ్ళు జొన్న రొట్టెలు , ఎర్రటి పచ్చడి తెచ్చి, దొర తింటడు పెట్టమ్మా అని ఇచ్చేవాళ్ళు. గూడెం అంతా నేను తిరుగుతూ ఆడుకుంటూ ఉండేదానిని.ఇది నాకు ఈ మధ్య అప్పుడప్పుడు గుర్తొస్తూవుంటే అమ్మను అడిగాను.అవును అప్పుడు ములుగు దగ్గర దుంపలగూడెం లో ఉండేవాళ్ళం.అక్కడి గిరిజనులకు ఇళ్ళు కట్టించటం అది మీ నాన్నగారు చేసేవారు అన్నది.నిన్న మా వాళ్ళందరు మేడారం జాతరకు వెళుతుంటే అమ్మా నేనూ ఆ విషయాలు గుర్తు తెచ్చుకున్నాము.ఈ జాతరకు నాన్నగారు కూడా వెళ్ళేవారట.అమ్మ మమ్మలిని కూడా తీసుకుపొమ్మంటే అక్కడ అడవి జంతువులు, పాములు ఉంటాయి , మేము వస్తుంటేనే మా జీపు కు అడ్డంగా పులి వచ్చింది అని తీసుకుపోలేదుట.మనకే ప్రమాదం కాని ఆయనకు కాదా ఏమొ మరి అంది!మణి తో అమ్మ అప్పుడు మా సారు తీసుకుపోలేదు ఇప్పుడు నువ్వు తీసుకుపోతావా అంటే అక్కడ మీరేమి ఉండగలరమ్మా అని నవ్వి వెళ్ళిపోయింది.
అప్పట్లో అక్కడ అంతా దట్టంగా అడవి ఉండేదిట.నాన్నగారు సర్వే కి వెళ్ళి సాయంకాలానికి వచ్చేసేవారుట.జాతర అయ్యాక మళ్ళీ ఆ అడవిలోకి ఎవరూ వెళ్ళేవారు కాదని మా డ్రైవర్ చెప్పాడు.ఇప్పుడు గుడి లాగా కట్టించారు .అందరూ వస్తూ పోతున్నారు.మేము పోయిన నెల వెళ్ళినప్పుడు జాతర దగ్గరకొస్తుండటము తో రోడ్ లు బాగుచేయటము, కరెంట్ పనులు మొదలైనవి జరుగుతున్నాయి.కొద్ది దూరం వెళ్ళగానే రోడ్ మీదుగా వాగు కనిపించింది.అప్పుడప్పుడు వాగులు ఇలా పొంగుతూ ఉంటాయని వెనకకు తీసుకెళ్ళి , పక్క రోడ్ మీదుగా తిప్పి తీసుకెళ్ళాడు. అలా అడవి మధ్య నుంచి వెళ్ళటం కూడా ఒక మంచి అనుభూతి :) కొంచం అడవి మధ్యలోకి వెళుదామని ఉత్సాహ పడ్డాను కాని, చీకటి పడుతోందని మా ఫ్రెండ్ రాజేశ్వరి, మా డ్రైవర్ మహేష్ ఒప్పుకోలేదు .
మొత్తం వెదురుతో కట్టిన గుడి అది. మాములు  గుడికి భిన్నం గా వుంది.అది గుడి అనరట.గద్దె అంటారట. గుడి మొదట్లోనే బంగారం తూచే తరాజు ఉంది. గుడి ముందు అడవి పూలతో కట్టిన దండలు, బెల్లము అమ్మవారలకు సమర్పించేందుకు అమ్ముతున్నారు.విశాలమైన ప్రాంగణం లో ఆ గద్దెలు ఉన్నాయి. అక్కడ అప్పుడు చరిత్ర చెప్పేందుకు ఎవరు లేరు. ఒక పూజారిణి మాత్రం ఉంది. ఆమెకు ఏమీ తెలీదుట.పూజారయ్య ఊళ్ళోకి పోయాడు అంది. అక్కడ మాకు తోచినట్లుగా పూజ చేసుకొని వచ్చాము.అసలు అమ్మవారు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ నుంచి ఈ గద్దె మీద కు తీసుకొస్తారు? అని అడుగుతే ఆమెకాని మహేష్ కాని చెప్పలేకపోయారు!
మా మహేష్ పెళ్ళి అక్కడే అయ్యిందని ఆ స్థలం చూపించాడు.లోపలికి వ్వెళ్ళేటప్పుడు జాతకం చెపుతానన్న కోయ దొరను తప్పించుకొని వెళ్ళాము కాని,తిరిగి వచ్చేటప్పుడు తప్పించుకోలేకపోయాము.పైగా రాజేశ్వరి ఇంట్రెస్ట్ చూపించింది.తను చెప్పించుకొని వచ్చి మీరూ చెప్పించుకోండి సరదాగా అంది.సరే నని కూర్చున్నాను.ముందుగానే నీ యింట ఇప్పటి వరకు పుంజు మాట నడిచింది.ఇక ముందు పెట్ట మాట పుంజు వింటుంది అనగానే అది ఎప్పుడు ఏ జన్మలో జరగాలి అని పక్కున నవ్వాను.అతను చాలా సీరియస్ గా చూసి మీ నాయన చాలా ధర్మాత్ముడు.ఇక్కడ కోయల కోసం చాలా సేవ చేసాడు అన్నాడు.నేను నివ్వెర పోయాను!ఆ తరువాత మా నాన్నగారి గురించే ఎక్కువగా చెప్పాడు!
సమ్మక్క సారలమ్మల గురించి వివిధ కథలు ప్రచారం లో ఉన్నాయి.అందులో ఎక్కువగా వినిపించేది కాకతీయులు వారి రాజ్యం మీద దండెత్తుతే విరోచితముగా పోరాడారు అని.రుద్రమదేవి కన్న ముందే ఆ యువతులు యుద్దం లో పాల్గొన్నారని అంటారు.కొంత మంది వీరిద్దరు అక్కాచెళ్ళెళ్ళు అంటారు కొంతమంది తల్లీ కూతుళ్ళు అంటారు.సమ్మక్క కొడుకే జంపన్న అని, వీరోచితముగా పొరాడి చనిపోయాడని, అతని రక్తం తో ఏర్పడిందే జంపన్నవాగు అని అంటారు.ఆ వాగు లో నీళ్ళు ఎప్పుడూ ఎర్రగా ఉంటాయిట.అది చాలా పవిత్రమైన వాగు అని నమ్మకం.అందులో స్నానం చేసి అమ్మవార్లను దర్శించుకుంటారు.ఎవరి కొరకైతే మొక్కుకుంటారో ఆ మనిషి అంత బరువు గల బంగారం( బెల్లం) తూచి అమ్మవారికి సమర్పించుకుంటారు.
తరువాత తెలుగు మహాసభలల్లో తెలంగాణా వారి స్టాల్ లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం వారు ప్రచురించిన, సమ్మక్క-సారలమ్మ జాతర పుస్తకం కొని చదివాను.అందులో చాలా వివరం గా ఇచ్చారు.



No comments: