Wednesday, January 17, 2018

రంభాహో రంభ!








మేము సిలిగురి లో ఉన్నప్పుడు అక్కడక్కడ ఇళ్ళల్లో ఉన్న అర్టై చెట్లు, వాటికి ఉన్న ఎర్రట్ అరటి పండ్ళ గెలలు చూస్తుంటే నాకు అరటి చెట్టు పెట్టుకోవాలని కోరిక కలిగింది. తెచ్చి పెట్టానో లేదో చుట్టుపక్కల వాళ్ళంతా ,అసలే మనం అడవిలో  ఏనుగుల మధ్య ఉన్నాము అరటి చెట్టుకోసం ఏనుగులొచ్చి పడతాయి తీసేసేయ్ అని గోల పెట్టేసారు. ఊళ్ళో వాళ్ళు పెంచుకుంటున్నారు కదా అంటే వాళ్ళు కంచె వేసి, దానికి లో వోల్టేజ్ లో కరెంట్ పెడతారు మనకసలు కంచెలే లేవుగా అన్నారు.అరటి చెట్టే కాదు అసలు ఏమొక్కా వేయలేదు ఎవరూ ఏనుగుల భయానికి.నీ అరటి చెట్టుకోసం నేనెక్కడ కాపలా కూర్చుంటాను అని ఏమండీ కోపంబడ్డారు :(  ఏం చేయగలను పెంచకోలేదు.
చాలా సంవత్సరాల తరువాత ఈ ఇంట్లో అరటి చెట్టు కోరిక పురి విప్పింది.అంతే వెనక వైపు వేసాను. కాస్త ఎదిగి కాంపౌండ్ గోడ పైకి రాగానే వెనికింటి వాళ్ళు మా గుమ్మం ముందు ఉంది, మాకు అరిష్టం తీసేయండి అని రోజూ గొడవ మొదలు. ఏమండీ గారు రోజూ వాళ్ళ తో గోలేమిటి తీసేసెయ్ అని ఆర్డర్. దేవుడా అనుకుంటూ మాలి తో తీయించి పక్కన వేయించాను. పక్కింటి కృష్ణవేణి గారు ఇదేమిటి మా గుమ్మం ముందు వేసారు, పోనీలే గోడ అడ్డం ఉంది కదా అని పనిమనిషి భారతి ( మాకు కామన్ పనిమనిషి లెండి) తో అన్నారుట. అప్పటికే ఆవిడ బాదం చెట్టుకోట్టేయించింది కదా అందుకని ఇదీ తీసేయమనలేకపోయారు అంది భారతి.ఓ రోజు అమ్మా కృష్ణవేణ్మా, సారూ అమావాస్య రోజు కంచం లో అన్నం తినరు, రెండు అరిటాకులు కోసుకోమా అని అడుగుతున్నారు అంది.సరే అన్నాను.అప్పటి నుంచి మా అరటి చెట్టు అమావాస్యరోజు వాళ్ళకు, ఏడాదికోసారి మా ఇంట్లో తద్దినం రోజు మాకు ఆకులు ఇస్తోంది.ఇలా ఇలా గడుస్తూ ఉండగా ముచ్చటగా ఓ శుభముహూర్తాన గెల వేసింది.దానికో పూవు పూసింది.అమ్మా ఇక గెల పెరగుదుట, పూవు కోసి వండుకోమన్నారు కృష్ణేణమ్మ అంది భారతి.ఎట్లా వండుతారో నాకు తెలీదు.అసలెప్పుడూ తినలేదు కూడా. పోనీ నేర్చుకొని వండుదామన్నా బద్దకం కింకర్తవ్యం? ఆవిడ వండుతారా అని అడిగాను భారతి ని.వండుకుంటారమ్మా అటువైపు వాళ్ళు కదా అంది. ఐతే ఆవిడనే వండి మనకూ కాస్త ఇవ్వమను అన్నాను.ఆవిడే వండి కాస్త నాకూ పంపారు.అంతగా నచ్చకపోయినా పరవాలేదు బాగానే ఉంది అనుకున్నాను.మా గెల కు ముచ్చటగా మూడు హస్తాలు వచ్చాయి. అవే మహా ప్రసాదం గా మేమూ, మా పరివారం కళ్ళ కద్దుకొని నోట్లో వేసుకున్నాము.
ఆ చెట్టు కొట్టేయాలి అన్నాడు మాలి.పచ్చని చెట్టు కొట్టేయబుద్ది కాలేదు.అసలు మనింట్లో అరటి చెట్టు పెట్టుకోకూడదు మనకు ఆనవాయితీ లేదు అన్నా నేను ముచ్చటగ పెంచుకున్న మొక్కను ఎలా కొట్టేస్తాను? కాకపోతే అదే వాడిపోయింది పాపం.దాని పక్కన ఓ బుజ్జి పిలక వచ్చింది.ఆ పిలకను తీసుకెళ్ళి ముందు వైపు నాటించాను.అమ్మా మనింటి గుమ్మం ముందు పెట్టిస్తున్నావు అని భారతి నస. నీ మొహం ఎవరింటి గుమ్మం ముందు లేదు పక్కకు ఉంది అని కోపం చేసాను.అది పెరిగీ పెరిగీ ఆకాశం లోకి దూసుకుపోతోంది.
మా అమ్మ దానికి పూజలు. ఏమి పూజ అని అడగొద్దు నాకు తెలీదు. ఒక్కోసారి ఒక్కో చెట్టుకు పూజలు జరుగుతూ ఉంటాయి.వాటికి మా డ్రైవర్ మహేష్,భార్య స్వప్న సమేతం గా దంపత తాంబూలలు అందుకుంటూ ఉంటారు.మరి అల్లుడు గారిని రమ్మనాలంటే భయం, మొహమాటం, మా వంటమనిషి మణి ఏమండిగారు ఎవరికీ చిక్కడు దొరకడు.అంచేత తాంబూలలన్ని ఆ దంపతులకే. తాంబూలం అందుకొని, అమ్మ కాళ్ళకు దణ్ణం పెట్టి , భక్తిగా ప్రసాదం తింటారు. వాళ్ళ అబ్బాయి రిషి మూడేళ్ళవాడు బామ్మా బామ్మా అంటూ ఓ అగరొత్తి పట్టుకొని అమ్మ వెనుక తిరుగుతూ ఉంటాడు.వాణ్ణి బ్రాహ్మణ్ణి చేస్తున్నారు అత్తయ్యగారు అని మా ఏమండీ అత్తగారితో అంటూ ఉంటారు :) ఈ విధముగా పూజలు, దంపత తాంబూలాలు అందుకుంటూ మా రంభ వయ్యారాలు పోతోంది. ఆ మధ్య మెట్లెక్కుతూ పైకి చూస్తే చిటారు కొమ్మన పూవు కనిపించింది.హుర్రే అనుకొని రోజూ గమనిస్తూ గమనిస్తూ ఉండగా ఉండగా పూవు, గెల పెద్దవయ్యాయి.

ఇప్పుడు వచ్చింది అసలు ప్రాబ్లం. పక్కింటి కృష్ణవేణి గారు ఊళ్ళో లేరు.ఇంకో నెల దాకా రారు. అప్పటి వరకు పువ్వు ఉంచలేము. పోనీ అమ్మను మొన్నటి దబ్బకాయల లాగా ( అమ్మ పనిమనిషి ఏమండీ గారు రాజమండ్రినుంచి వస్తూ రెండు దబ్బకాయలు తెచ్చాడు.నాకోటి ఇవ్వబోతే నాకొద్దు నువ్వే వండి పంపు అన్నాను. దబ్బకాయ పప్పు, దబ్బకాయ పులిహోర,దబ్బకాయ పచ్చడి ఇలా ఒక వారం దబ్బకాయ ఫెస్టివల్ జరిగింది) వండమందామంటే అమ్మకూ దాని సంగతి తెలీదు.ఇంక తప్పదనుకొని ఆ కిచెనూ , ఈ వంటిల్లూ, ఆ చెఫ్, ఈ అభిరుచి అన్నీ తిరగేసి మరగేసి అరటి పువ్వు వలచుట ఎలా (పువ్వు అంటే చక్కగా పూవులా ఉంటుందేమో అనుకున్నాను కాదు అబ్బో పెద్ద పని )నేర్చుకొని , మొత్తానికి సగం వండాను.ఏమండీగారేమొ బాగానే ఉంది కాని కాస్త కనరు ఉంది అన్నారు .మరి పూర్తి కనరు ఎట్లా పోతుంది? మిగిలింది ఎలా వండటము అన్నది ముందున్న పెద్ద ప్రశ్న!!!

4 comments:

Anonymous said...

Pl see

https://kastephale.wordpress.com/2014/10/27/%E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%87%E0%B0%AA%E0%B0%82%E0%B0%95%E0%B0%AC%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-%E0%B0%85%E0%B0%B0/

విన్నకోట నరసింహా రావు said...

ఈ క్రింది లింక్ పనిచేస్తుందేమో చూడండి.

"శర్మ కాలక్షేపంకబుర్లు-అరటి దూట పెసరపప్పు,/ దూట పచ్చడి./అరటి పువ్వు మెంతులు కూర"

sam said...

dear sir very good blog and very good connents
Latest Telugu News

విశాలి said...

అరటి చెట్టు కొట్టేశాక దాని కండంలో దూట వస్తుందండి. అది చాలా మంచిది ఆరోగ్యానికి. ఈసారి ఆ దూట కూడా వండి చూడండి.