Tuesday, January 30, 2018

మా ఇంట్లో జాతర హడావిడి :)





రేపు తెలంగాణా లోని అతిపెద్ద జాతర "మేడారం జాతర" మొదలు కాబోతోంది. కాని మాఇంట్లో మాత్రం వారం రోజుల నుంచే జాతర హడావిడి మొదలైంది :)
మేము ఈ ఇంట్లో కి వచ్చిన పూటే ఎల్లమ్మ మా ఏమండీ ని గేట్ దగ్గరే పట్టుకొని రెండు చేతులూ జోడించి "అయ్య నీ బంచన్ కాల్మొక్కుతా, ఆపీస్ పెడుతున్నావంట నాకూ కొలువియ్యి దొరా " అని దీనంగా అడిగి (దబాయించి ) కొలువులో చేరింది మా సీనియర్ మోస్ట్ పనిమనిషి :) ఏం పని చేస్తుంది , ఎప్పుడొస్తుంది, ఎప్పుడెళుతుంది అడిగే హక్కు ఎవరికీ లేదు.మరి దొరగారి రికమండేషన్ కాండిడేట్ :) వారం క్రితం "అమ్మ నీ బాంచన్ కాల్మొక్కుతా ఓ చద్దర్ ఈయి .జాతరకు పోతుండా " అడిగింది. ముందు నీ బాంచన్ కాల్మొక్కుతా మాను తల్లీ ఎవరైనా విన్నారంటే నన్ను జైల్ లో పెడతారు అంటే బేఫికర్! పది రోజుల క్రితం మేడారం వెళ్ళే ముందు వేములవాడ వెళ్ళి శివయ్యకు మొక్కి రావాలే అని వెళ్ళింది. శివయ్యకు ఎందుకు మొక్కాలే అంటే నాకు తెల్వదు గట్ల మొక్కస్తాం అంది.అదైంది పొద్దున్నే వచ్చి "అమ్మ చెట్ల గిట్ల ఊడ్చినా , జాతరకు పొతున్న , మల్ల నాల్గ్ రొజుల కొస్తా ఏమైనా పైసలిస్తావ్" ( ఇవ్వననే ధైర్యమే ) మొదటి వికెట్ ఔట్.
నాలుగు రోజుల ముందే వాళ్ళ అమ్మను పిలిపించి భార్య పిల్లలను ఊరికి పంపేసాడు మా డ్రైవర్ మహేష్.ఇంత ముందే పంపావు అంటే జాతరకు వెళ్ళటానికి పలగారాలు చేసుకోవాలే కదా మేడం అన్నాడు. రాత్రి వచ్చి "సార్ రెండు కార్లల పెట్రోల్ ఫుల్ కొట్టించాను. టైర్లల్ల గాలి ఉంది. మంచిగా తుడిచాను. మొన్న సద్దేటప్పుడు చూసిన టెంట్ ఇస్తారా ( ఈ మధ్య అన్ని గదులూ క్లీన్ చేసి అనవసరమైన సామాను పడేసే ప్రోగ్రాం లో ఉన్నారు మా ఏమండి.ఆ ప్రక్రియలో ఎప్పుడో పిల్లలు సరదాగా కొనుక్కున్న టెంట్ కనిపించింది ) "మంచిది తీసుకోరా , కాని పిల్లలతో ఇబ్బంది పడతావు వాళ్ళనూ తీసుకెళుతావా ?" అన్న ఏమండీ ప్రశ్న వినిపించుకోకుండా టెంట్ ,అడ్వాన్స్ తీసుకొని వెళ్ళాడు. రెండో వికెట్ ఔట్ .
మా వలలి మణి నాలుగు రోజుల నుంచీతను తిరిగి వచ్చేవరకూ ఐదురోజులకూ సరిపడా బ్రేక ఫాస్ట్ కోసం పిండ్ళు రుబ్బటం, కూరగాయలు కోయటం,పిల్లలకు పంపే పచ్చళ్ళు చేయటం తో హడవిడి పడిపోతోంది.పిల్లల పచ్చళ్ళు పాక్ చేయించుకొచ్చి , అడ్వాన్స్ తీసుకొని మూడో వికెట్ కూడా ఔట్ ! భారతీ నువెళ్ళవా అని ఏమండీ అడిగారు. మాకు తెలీదు సార్ అంది తను.తనది రాయలసీమ. ఇక నుంచి నలుగురినీ నాలుగు ప్రాంతాలవాళ్ళని పెట్టుకోవాలి :)
పోయిన నెల ఏమండీ బ్రిడ్జ్ టోర్నమెంట్ కు వెళుతుంటే నేనూ వెళ్ళి మేడారం చూసి వచ్చాను. అప్పుడు తిరిగి వచ్చేటప్పుడు మహేష్ గట్టమ్మ గుడి దగ్గర ఆపి మేము జాతరకు వెళ్ళే ముందు ఈ అమ్మ కు మొక్కి వెళతాము. ఇదివరకు రోజులల్లో కోడిని నైవేద్యం పెట్టి వెళ్ళేవాళ్ళట.ఇప్పుడు కోడిగుడ్డు పెట్టి వెళుతున్నాము అని చూపించాడు.మేడారం జాతర లో దేవతలంతా కోయ గిరిజనులు కాగా, ఒక గట్టమ్మ మాత్రము నాయకపు గిరిజనులకు సంబందించినది.ఈమె గుడి వరంగల్ నుంచి మేడారం వైపు వస్తున్నప్పుడు ములుగు దగ్గర ఉన్న గట్టు మీద ఉంది.క్షేత్రపాలక దేవతగా గట్టమ్మను దర్శించుకోకుండా మేడారం జాతరకు వెళ్ళరు.    

No comments: