Sunday, July 17, 2022

భాగ్యలక్ష్మి దేవాలయము -చార్మినార్

భాగ్యలక్ష్మి దేవాలయము చార్మినార్ నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం. బోనాలజాతర సంధర్భంగా మనము దర్శిస్తున్న అమ్మవారి దేవాలయాలలో ఈ రోజు చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుందాము రండి. ఈ దేవాలయము ఎప్పుడు వెలిసినది అన్నదానికి వివిధకథలు వినిపిస్తున్నాయి. ఓసారి చార్మీనార్ దగ్గరికి అమ్మవారు నడుచుకుంటూ వస్తే అక్కడి కాపలావారు ఆవిడను అడ్డగించారు. దేవి తనగురించి చెబితే రాజానుమతి తీసుకొని వస్తామనీ, అప్పటి వరకూ అక్కడే ఉండమని ఆ కాపలాదారు లోపలికి వెళ్ళి రాజుతో చెప్పాడు. అప్పుడు రాజుకు ఆ వచ్చింది అమ్మవారేనని అనిపించి, కాపలాదారు వెళ్ళకపోతే ఆవిడ ఇక అక్కడే ఉండిపోతుందని అనుకొని అతనిని వెళ్ళవద్దంటాడు. దానితో ఆ దేవి అక్కడే ఉండిపోయిందట. “ఇక్కడ వందల ఏళ్ల నుంచీ అక్కడ పూజలు జరుగుతున్నాయి. కాకపోతే గుడి ఉండేది కాదు. అమ్మవారు ఇప్పుడున్న రూపంలో కాకుండా, బొడ్రాయి రూపంలో ఉండేది. 1979 లో వక బస్ డ్రైవర్ ఆ రాయిని ఢీకొట్టాడు. అది ప్రమాదవశాత్తు జరిగింద లేక కావాలని చేశారా అనే గొడవ నడిచింది. అప్పుడు చెన్నారెడ్డిగారు ముఖ్యమంత్రి. ఆయనే అప్పుడు అక్కడ ఒక గుడిలా కట్టడానికి సహకరించారు. అప్పట్లో ఆ గుడి పూజారి కర్ఫ్యూలో కూడా పూజలకు వెళ్లేవారు. శుక్రవారం పూట మధ్యాహ్నం 12 గంటల నమాజు సమయంలో ఆయన హారతి గంట కొట్టకుండా పోలీసులు ఆ గంట పట్టుకుని కూర్చునేవారు. పగిలిన రాయిని పూజించకూడదు కాబట్టి ఒక పటం పెట్టి పూజించేవారనీ, ఆ తరువాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసారనీ, విగ్రహము పాదాల దగ్గర రెండు వెండితొడుగుల కింద ఆ రాయి ముక్కలను ఉంచారనీ అక్కడి పూజారులు చెపుతారు. ఇంకా ఈ దేవాలయము గురించి ఉన్న చాలా కథలు, ఈ దేవాలయము గురించిన పరిశోధనల పూర్తి వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు గూగులమ్మను అడుగుతే చెపుతుంది. బోనాల చివరిరోజున అమ్మవారి రథయాత్ర ఇక్కడ నుంచి సాగుతుంది. ఇందులోని పాట మా అమ్మమ్మ కీ|శే|శ్రీమతి. వరలక్ష్మమ్మగారు దాదాపు నలభైయాభై సంవత్సరాల క్రితం పాడినది. ఇదండీ ఈనాటి మనదేవాలయ దర్శనము. వచ్చేవారం మరో దేవాలయ దర్శనములో కలుసుకుందాము. నా పోస్ట్ లను శ్రద్దగా వింటున్న మితృలకు ధన్యవాదాలతో సెలవు. నమస్తే. https://www.youtube.com/watch?v=E4LQ1DUJIgs

No comments: