పది సంవత్సరాల క్రితం మా అబ్బాయి నాకు
బ్లాగ్ స్టార్ట్ చేసి , బ్లాగ్ అంటే ఓపెన్ డైరీ అనుకో. అందరు చదువుతారు కాబట్టి
కాస్త జాగ్రత్తగా రాయి అన్నాడు.అది విని మా ఏమండీ రాజకీయాలు,
కులాలు,ఎవరెవరి గురించో ముఖ్యంగా నెగిటివ్ గా ,
ఏవివిధమైన
వివాదాలకుపోయేవి ఏవీ రాయకు .ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు మానేజ్ చేయలేవు అని
హెచ్చరించారు. ఐతే నేనిక దేనిగురించి రాయాలి ?
నాకు నా మొక్కలు ,
మీరు తప్ప ఏ
సబ్జెక్ట్ లూ మిగలలేదు .మీమీద రాయనా అన్నాను.గడ్డం కింద చేత్తో రాసుకుంటూ కాసేపు
పైకీ కిందికి చూసి, ఇంకాసేపు దీర్ఘంగా ఆలోచించి సరే రాసుకో అన్నారు.అదో అలా
కట్టుదిట్టాల మధ్య నా రచనా ప్రస్థానం బ్లాగ్ పోస్ట్ లై,
కథల వరకూ సాగింది.
కథలల్లో సంఘటనలు మావే ఐనా పాత్రల పేర్లు వేరేగా పెట్టాను.కొన్ని కథలయ్యాక పాత్రల
పేర్ల విషయం లో ఇద్దరికీ భేదాభిప్రాయాలు వస్తుంటే ,పేర్ల జోలికి పోక నేనూ ,
మా ఏమండీ గానే
రాయటం మొదలు పెట్టాను.నా కథలైనా, బ్లాగ్ పోస్ట్ లైనా మావీ ,
కొన్నేమో
ఏమండీగారు చెప్పిన సంఘటనల అధారంగా రాసినవి.ఏది రాసినా ఏమండీగారు చదివి ఆమోద ముద్ర
వేసాకనే పబ్లిష్ చేసాను.
ఈ కథ 20-3-2014 లో ఆంధ్రభూమి వారపత్రికలో వచ్చింది.
ఈ కథ చదివి మా
అమ్మాయి "అమ్మా అచ్చం డాడీ ని చూసినట్లుగా ఉంది." అంది!
వీడు
వెరపెరుగడు సూడవే ! ! ! !
సీట్ బెల్ట్
తీసి, నిలబడి"ఇంకా
కూర్చున్నావేం లే. అందరూ దిగారు.”అన్నాడు అభిమన్యు, శశిరేఖ తో.
"ఇదేమి వూరండి నేను
సరిగ్గా వినలేదు.”అని అడిగింది శశిరేఖ.
"థాఫే.”బదులిచ్చాడు
అభిమన్యు.
"ఏ దేశం?"
"చైనా, ఇహ ప్రశ్నలాపి
లేస్తావా?"
"అమ్మో చైనా నే!
ఇదేమిటి ఇంకే దేశమూ లేనట్లు తెచ్చి తెచ్చి ఇక్కడ ఆపాడు.”భయం భయం గా అడిగింది.
"చైనా ఐతే ఏమైందిట? ఇక్కడ నిన్నెవరైనా
జైల్ లో వేస్తున్నారా?నువ్వలాగే
కూర్చో నేను దిగుతున్నాను.”
అమ్మో
నేనొక్కదాన్ని ఇక్కడ వుండటమే అనుకుంటూ భర్త వెనకాల నడుస్తూ,” ఏమండీ"అని పిలిచింది.
"మళ్ళీ ఏమిటి?"
"ఏమీలేదు, మీరు కాస్త
జాగ్రత్తగా వుండండి.”
వెనకకు తిరిగి
కొంచం సీరియస్ గా చూసాడు అభిమన్యు శశిరేఖ వైపు.
శశిరేఖ తడబడిపోతూ,” అహా ఏమీ లేదు, పోయినసారి మీరు రెస్ట్
రూం లోకి వెళ్ళినప్పుడు, బయట ఏదో
గొడవలౌతున్నాయని, పాస్పోర్ట్
లు వున్న బాగ్ లోపలే మర్చిపోయి హడావిడిగా బయటకు వచ్చారు. మీ వెనకాలే వెళ్ళిన
స్వీపర్ చూసి, మంచి ఆవిడ
కాబట్టి, మిమ్మలిని
పిలిచి ఆ బాగ్ ఇచ్చింది. ఆవిడ ఇచ్చేదాకా మీకు ఆ బాగ్ లోపల మర్చిపోయానని గుర్తు
కూడా లేదు. లేకపోతే మనం ఎంతఇబ్బంది పడేవాళ్ళము. అందుకే ఈ సారి బయిలుదేరే ముందు
పిల్లలు, ఎవరితో
ఎక్కువ తక్కువ మాట్లాడవద్దు,
ఏ గొడవలైతున్నా తలదూర్చవద్దు. ఎవరినీ పట్టించుకోవద్దు ఇలా ఎన్ని జాగ్రత్తలు
చెప్పారు. ప్లీజ్ ఎందులోనూ.....”కోపం గా చూస్తున్న అభిమన్యునుచూసి ఆపేసింది.
"చూడూ ఏదీ
పట్టనట్లు, నన్నంటుకోకు
నామాల కాకి అన్నట్లు వుండటం నావలన కాదు. కావాలంటే ఇదిగో ఈ బాగ్ నీ
దగ్గరవుంచుకో"అంటూ నడుముకు వున్న చిన్న బాగ్ తీయబోయాడు.
"ఆ వద్దు వద్దు
మీదగ్గరే వుండనీయండి.”అనేసింది శశిరేఖ. ” స్వామీ వెంకటేశ్వరుడా మమ్మలిని ఈ చైనా
నుంచి క్షేమంగాబయటపడేయి తండ్రీ"అని వెంకటేశ్వరుని వేడుకుంటూ అభిమన్యు వెంట
లాంజ్ లోకి నడిచింది.
విమానం తలుపు
దగ్గర, ఆరెంజ్
రంగులో ఏదో బుక్ మార్క్ లాంటి అట్టముక్క ఇచ్చారు. ఇదెందుకిచ్చారా అనుకుంటూ, వాళ్ళను ఏమడుగుతే
ఏమి తంటానో అనుకొని, తీసుకొని
పర్స్ లో వేసుకుంది. కొద్దిసేపు లాంజ్ లో వేసి వున్న కుర్చీలలో కూర్చున్నారు.
"విమానం ఓ గంట
ఆగుతుందిట, అలా
ఏర్పోర్ట్ లోకి వెళ్ళి చూసొద్దామా?"అడిగాడు
అభిమన్యు. సరే పదండి అని లేచింది.
లాంజ్ లో నుంచి
ఏర్పోర్ట్ లోకి వెళ్ళటానికి మెట్లు ఎక్కి పక్కన వున్న చిన్న గట్టును పట్టుకొని ఓ
నిమిషం నిలబడింది. ఆ గట్టుమీదఆరెంజ్ రంగులోని అట్ట ముక్క కనిపించింది కాని అప్పుడు
దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఎక్కడి నుంచో కమ్మని కాఫీ సువాసనలుతేలి వస్తున్నాయి.
విమానం లో వాళ్ళిచ్చిన కాఫీ కాని కాఫీ లాంటి ద్రవ పదార్ధం గుర్తొచ్చి ” ఏమండీ, ఇక్కడెక్కడో
కాపీ షాప్ వునట్లుందికాఫీ తాగుదామా?"అని
అడుగుతుండగానే ” కాఫీ తాగుదాము
పదా"అని ముందుకు నడిచాడు అభిమన్యు.
ఓ పెద్ద కాగితం
గ్లాస్ లో నురగలు తేలుతూ, సువాసనలు
వెదజల్లుతున్న కాఫీ ని ఇద్దరూ చెరిసగం చేసుకొని, దాని రుచిని ఆస్వాదిస్తూతాగారు.
విమానం కదలటాని కి
ఇంకా చాలా సమయం వుంది.
అద్దాల తలుపులలో
నుంచి, దీపాల
వెలుతురులో తళతళ లాడుతున్న షాపులోకి వెళ్ళారు.
"ఏమండీ చైనా
గుర్తుగా ఏమైనా కొనుక్కుందామా?"అంటూ షాప్
అంతా తిరుగుతూ, అక్కడ
పెట్టివున్న బొమ్మలను చూసింది. అమ్మోఎంత చిన్నది చూసినా 100 డాలర్ల పైనే
వుంది. ఏముంది బాబూ ఇందులో అని ఆశ్చర్యపోతూ సమయం గడిపేసింది.
"ఏమిటీ ఏవీ
నచ్చలేదా? ఐతే ఈ
షాప్ లో చూద్దాం రా"అంటు పక్కన వున్న బట్టల దుకాణం లోకి దారి తీసాడు
అభిమన్యు.
అటుచూసీ, ఇటు చూసీ ఓ తెల్ల
కోటు తీసి బేరమాడసాగాడు.
హుం బేరాలు
మొదలెట్టారూ? ఏమిటో ఏ
షాప్ లోనైనా బేరం ఆడకుండా ఏదీ కొనరుకదా! ఇహ ఐనట్టే, ఆ విమానం వుంటుందోపోతుందో!
కాస్త తొందర
పెట్టాల్సిందే. లేకపోతే ఇంతే సంగతులు అనుకుంటూ "ఏమండీ చాలా సేపైంది, విమానం
వెళ్ళిపోతుందేమో! మనమీ చైనా లో చిక్కుబడిపోతాము” అని హడావిడి పెట్టేసింది.
"అబ్బ నీకంతా భయం” అని విసుక్కుంటూ బేరం పూర్తి చేసి
120 డాలర్ ది
60 డాలర్స్ కు ఆ
కోట్ కొన్నాడు. అబ్బో అనుకుంటూ భర్త వైపు మెచ్చుకోలుగా చూసింది ! ఇద్దరూ, లాంజ్ లోకి
వెళ్ళారు. అప్పుడే విమానం బయిలుదేరుతుందని ప్రకటన వస్తోంది. అందరూహడావిడిగా
లేచారు. శశిరేఖ కూడా లేచింది.
"ఇక్కడే వున్నాము
కదా అంత హడావిడి దేనికి అందరినీ ఎక్కనీ” అన్నాడు అభిమన్యు.
కూర్చున్న
అభిమన్యు వైపు విమానంలొ ఎక్కుతున్నవారి వైపు చూస్తూ టెన్షన్ గా నిలబడింది.
అంతా ఎక్కేసారు. ఓ
అమ్మాయి మటుకు తలుపు దగ్గర నిలబడి, సెక్యూరిటీ
వాళ్ళ తో ఏదో మాట్లాడుతోంది. ఆ అమ్మాయికి దాదాపు 25-26 ఏళ్ళు వుండవచ్చు. జీన్స్ పాంట్, గులాబీ రంగు
టీషర్ట్ వేసుకొని, బుజాల
వరకు కత్తిరించిన జుట్టుతో వుంది. చేతిలో ని కాగితాలుఏవో ఆ సెక్యూరిటీ అతనికి
చూపిస్తూ ఏదో చెపుతోంది. ఇంత దూరానికి కూడా ఆ అమ్మాయి మొహంలో గాభరా కనిపిస్తోంది.
"ఇహ లేవండి బాబూ
అందరూ ఎక్కేసారు. ఈ కూర్చునేదేదో విమానంలోనే కూర్చోవచ్చుకదా?” అని
గాభరా పడుతున్నశశిరేఖ నుపట్టించుకోకుండా, గబగబా వెళ్ళి, సెక్యూరిటీ
వాళ్ళ తో మాట్లాడుతున్న అమ్మాయి తో ” ఏమ్మా ఏనీ ప్రాబ్లం" అని అడిగాడు.
బాబోయ్ ఆపద్భాందవా
ఏమి కనిపించింది? ఇహ మన
పనైపోయింది ! తనూ వెనక పరుగెత్తింది.
"అవునంకుల్, వీళ్ళు ఇచ్చిన
ఎంట్రీ పాస్ కార్డ్ ఎక్కడో పడిపోయింది. అది ఇవ్వకపోతే విమానం ఎక్కనివ్వమంటున్నారు.
నా పాస్పోర్ట్, టికెట్
చూపించినా వదలటం లేదు.” ఏడుపు గొంతు తో చెప్పింది.
ఓహో ఐతే ఈ అట్టముక్క గేట్ పాస్ అన్నమాట! ఇంకా
నయం పర్స్ లో వేసుకున్నాను, ఇంకెక్కడోవేసాను
కాదు అనుకొంటూ అరేదాన్ని ఇందాక ఎక్కడో చూసాను అనుకొని, మెట్ల దగ్గర
చూసింది గుర్తొచ్చి అదే ఆ అమ్మాయికి చెప్పింది శశిరేఖ.
ఆ అమ్మాయి అటువైపు
పరిగెత్తింది. సెక్యూరిటీ ఆఫీసర్ వీళ్ళను లోపలి కి వెళ్ళమన్నాడు. చిన్నగా
తలపంకించి అక్కడే నిలబడ్డాడు అభిమన్యు. ఆ అమ్మాయి బిక్క మొహం తో అక్కడ ఆ అట్టముక్క
లేదంటూ వచ్చింది!
"నీ తోపాటు ఇద్దరు
ముగ్గురు ఆడవాళ్ళు వుండాలి. ఓ పెద్దావిడని వీల్ చేర్ లో తీసుకొచ్చావు, వాళ్ళంతా
లోపలికివెళ్ళిపోయారా?"అడిగింది
శశిరేఖ.
"వాళ్ళు కో
పాసెంజర్స్ ఆంటీ, మొదటిసారిగా
వస్తున్నారని, అంతా
కొత్త అంటే నేను చూపిస్తున్నాను. ఆ పెద్దావిడ మాకు తెలిసినావిడ. ఆవిడకు సాయం
చేయమంటే చేస్తున్నాను.”అంది.
ఇదంతా మాకు
పట్టదనట్లు ఆ అమ్మాయిని ఆగిపొమ్మని, వీళ్ళిద్దరినీ
లోపలికి వెళ్ళమనీ తొందరచేస్తున్నాడు సెక్యూరిటీ ఆఫీసర్.
"ఈ అమ్మాయి
కోలాలంపూర్ లో, ఈ ఫైట్ లో
ఎక్కింది. ఈ ఫ్లైట్ లో నుంచే దిగింది. నేను చూసాను. ఐనా పాస్ పోర్ట్, టికెట్ వున్నయికదా
?" అన్నాడు
అభిమన్యు.
" పాస్ పోర్ట్, టికెట్ వున్నా ఈ
విమానం లో నుంచే దిగింది అన్న నమ్మకం మాకేమిటి ? మేమిచ్చిన పాస్ చూపిస్తేనే లోపలి కిపంపుతాము. సారీ సర్, మా రూల్స్
వొప్పుకోవు. మేము లోపలికి వెళ్ళనీయము. మీరు వెళ్ళండి.”అని ఖరాఖండిగా
చెప్పేసాడుఅతను.
"నువ్వెళ్ళు
లోపలికి. నేను ఈ అమ్మాయి సంగతి చూసి వస్తాను.” శశిరేఖ తో అన్నాడు.
"అమ్మో నేనసలు మీరు
లేకుండా లోపలికి వెళ్ళను.”అని గట్టిగా అభిమన్యు చేయి పట్టుకొని నిలుచుండిపోయింది
శశిరేఖ. బిక్కమొహం తో నిలుచున్న ఆ అమ్మాయిని చూస్తుంటే జాలివేస్తోంది కాని, దేశం కాని దేశం లో
భర్త అనవసరమైన వివాదం లోకివెళుతున్నాడేమోనని ఓ పక్క భయం వేస్తోంది! చిన్నవాళ్ళు కూడా మాకెందుకని వెళ్ళిపోతుంటే ఈ
పెద్దమనిషి కెందుకో ఈ అఖ్ఖర్లేని జంజాటం…అని ఇంకోపక్క గాభరా! `
సెక్యూరిటీ ఆఫీసర్
కూ అభిమన్యు కూ వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఆ అమ్మాయి, పాస్ పోర్ట్, టికెట్ చూపిస్తూ, వెళ్ళనీయమనిభయం
భయం గా, కంగారుగా
అడుగుతోంది. సెక్యూరిటీ ఆఫీసర్ ససేమిరా ఆ అమ్మాయిని మాత్రం వదలనంటున్నాడు. మధ్య
మధ్య వీళ్ళను లోపలకు వెళ్ళమని హెచ్చరిస్తున్నాడు. శశిరేఖను లోపలికి వెళ్ళమని
అంటున్నాడు అభిమన్యు. ఉమ్హూ అంటూ అభిమన్యుచేయి గట్టిగా పట్టుకొని, భయం భయం గా
అందరినీ చూస్తూ నిలుచుంది శశిరేఖ.
దేవుడా దేవుడా
రక్షించు. నీకు రెండుకొబ్బరికాయలు కొడతాను అర్జెంట్ గా వెంకటేశ్వరస్వామి కి
మొక్కేసుకుంది శశిరేఖ.
హుం... ఆ
కొబ్బరికాయలకు వెంకటేశ్వరస్వామి పడిపోలేదు! ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ఏర్పోర్ట్
పోలీసులను పిలిచాడు. వాళ్ళను చూసి,
ఆఅమ్మాయి ఏడుపు లంకించుకుంది. శశిరేఖ, వణికిపోతూ
అభిమన్యు చేయి ఇంకా గట్టిగా పట్టుకొని, అభిమన్యు
కు అతుక్కొనినిలబడింది.
"సారీ సర్ మీరు మా
మాట పట్టించుకోవటంలేదు, మిమ్మలిని
అరెస్ట్ చేయక తప్పదు "అన్నాడు.
పోలీసులు ఆ
అమ్మాయిని, అభిమన్యు
ను అరెస్ట్ చేస్తూ శశిరేఖను విమానం లోపలికి వెళ్ళిపొమన్నారు.
"నో... నో... నేను వెళ్ళను. నన్ను కూడా ఆయనతోపాటు
తీసుకెళ్ళండి.”అంటూ పరిగెడుతూ ముందుకు తూలింది. కింద పడబోతూ అభిమన్యు ని గట్టిగా పట్టుకుంది. ఏమైంది అట్లా
అరుస్తున్నావు అంటూ అభిమన్యు అనగానే గబుక్కున స్పృహ లోకి వచ్చి చుట్టూచూసింది.
ఇంకా అభిమన్యు కు, ఆ
సెక్యూరిటీ ఆఫీసర్ కు వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఆ అమ్మాయేమో టెన్షన్ గా ఇద్దరినీ
చూస్తోంది. ”ఓ పోలీసులు అభిమన్యు ను పట్టుకుపోవటం నిజం కాదన్నమాట. నా ఉహా” అనుకుంటూ ఇంక ఆపమనట్లు అభిమన్యుచేయి చిన్నగా గుంజింది. కాని అభిమన్యు
పట్టించుకోలేదు. ఇంకా ఆ ఊహ లో నుంచి బయటకు రాలేకపోయింది. కాళ్ళు గజ గజా
వణుకుతున్నాయి. అలాగే అభిమన్యు చేతిని ఆసరాగా చేసుకొని నిష్త్రాణం గా
నిలుచుండిపోయింది!
కళ్ళల్లో సుళ్ళు
తిరుగుతున్న నీళ్ళతో వణికి పోతూవున్న ఆ అమ్మాయి వైపు ఏమి పరవాలేదు అని ధైర్యం
చెపుతునట్లుగా చూసి, నడుముకు
వున్న సంచీని తీసి, అందులో
నుంచి ఐడెంటిటీ కార్డ్ తీసి,”
నేను ఆర్మీ ఆఫీసర్ ను.”అని ఆ కార్డ్ ఆ సెక్యూరిటీ ఆఫీసర్ కు ఇచ్చాడు అభిమన్యు.
ఆ కార్డ్ ను, అభిమన్యునూ
కొన్ని క్షణాలు మార్చి మార్చి చూసి సెల్యూట్ చేసి లోపలికి వెళ్ళమన్నట్లు
చేయిచూపించాడు.
ఇంకోసారి ఇలాంటి
పొరపాటు చేయవద్దని ఆ అమ్మాయిని హెచ్చరించి లోపలకు వదిలాడు. అంతే ఆ అమ్మాయి వింటిని
వదిలిన బాణంలా రయ్ న లోపలకు పరిగెత్తింది! ఆ సెక్యూరిటీ ఆఫీసర్ కు థాంక్స్ చెప్పి
లోపలి కి నడిచిన అభిమన్యు ను బ్రతుకు జీవుడా
అనుకుంటూ అనుసరిస్తూ,” ఇంత సాయం
చేస్తే ఆ అమ్మాయి కనీసం థాంక్స్ ఐనా చెప్పకుండా వెళ్ళింది.”అని గొణిగింది శశిరేఖ.
"ఆ అమ్మాయి థాంక్స్
చెప్పాలని సాయం చేసామా? ఐనా పాపం ఆ
అమ్మాయి ఎంత టెన్షన్ పడిందో.”అన్నాడు అభిమన్యు.
"అది కాదండి, ఆ అమ్మాయి థాంక్స్
ఎవరికి కావాలి కాని, మీరు
గబుక్కున ఇలా దూరిపోయారు, దేశం కాని
దేశం లో అందునాచైనాలో. ఏమైనా ఐతే”
అంటున్న శశిరేఖ
మాట పూర్తి కాకుండా?” మాటి మాటి కి చైనా అని భయపడతావు, వాడేమైనా మన తల
నరుకుతాడా ? ఆ అమ్మాయి
స్థానం లో మన అమ్మాయి వుంటే కూడా ఇలాగే ఆలోచిస్తావా?"
"అది కాదండీ, మనం బయిలు
దేరేటప్పుడు పిల్లలు ఎన్ని జాగ్రత్తలు చెప్పారు. ఆ అమ్మాయిని మనం కోలాలంపూర్ లో
కూడాచూసామనుకోండి. అంతమాత్రాన ఆ పిల్ల ఎలాంటిదో మనకు తెలుసా? వకవేళ ఏదైనా
మూఠాకు చెందిన పిల్లైవుంటే ?
ఇవాళ రేపుఎవరినీ నమ్మలేము. మనమొక్కళ్ళమే కాదు
కదా ఇంకా విమానం లో వున్నవాళ్ళు చాలా మంది ఆ అమ్మాయినిచూసేవుంటారు.
ఒక్కళ్ళూ పట్టించుకోలేదు. అంతెందుకు, ఆ
అమ్మాయితో వున్నవాళ్ళే లోపలకు వెళ్ళిపోయారు. వాళ్ళంతా కలిసి ఈ అమ్మాయి మా అమ్మాయే
అని గట్టిగా చెపితే వినకపోయేవాడా ? ఏదో అతను పట్టించుకున్నాడు కాబట్టి సరిపోయింది. అంతేకాని
అన్ని చోట్లా మీ ఆర్మీ ఐడెంటిటీ కార్డ్ పని చేస్తుందా? పైగా రిటైర్ అయ్యి
కూడా పదేళ్ళవుతోంది. అతనికేదో డిఫెన్స్ వాళ్ళంటే గౌరవంవున్నట్లుంది. వదిలేసాడు.
కొద్దిలో జైల్ నుంచి తప్పించుకున్నాము.”బాధగా, ఉక్రోషంగా మాట్లాడుతూ శశిరేఖ తన సీట్ వైపు వెడుతూ ఓరగా ఆ
అమ్మాయిని చూసింది. ఆ అమ్మాయి తను ముందుగా కలిసి దిగినవారితో అభిమన్యుడు
ఛేదించలేని పద్మవ్యూహం తను ఛేదించుకు వచ్చినట్టు గొప్పగా పోజులిచ్చేస్తూ
వర్ణించేస్తోంది. కనీసం తిరిగి కూడా చూడలేదు! ఇంకా వళ్ళు మండిపోయింది.
"చూసేరా.. చూసేరా..
కనీసం థాంక్స్ అయినా చెప్పలేదు సరికదా అసలు మనవైపే చూడకుండా మొహం ఎలా
తిప్పేసుకుంటోందో..”
"ఆ అమ్మాయి థాంక్స్
చెప్పలేదని అంతగా గింజుకోకు. బహుశా
వాళ్ళందరి దగ్గరా ఇప్పటి వరకు తన గురించి గొప్పలు చెప్పుకొనివుంటుంది.
ఇప్పుడు ఇలా కాగానే అవమానంగా భావిస్తోందేమో ! ఇప్పుడు కూడా తనే ఏదో మానేజ్
చేసుకొని వచ్చేసానని చెపుతూవుండవచ్చు. ఇంక మన దగ్గర కు వచ్చి థాంక్స్ ఏమి
చెపుతుంది? లేదా ఆ
కంగారులో తోచకపోయివుండవచ్చు. ఏదైనా కారణంకావచ్చు. మనకు మంచి అనుకున్నది మనం
చేసాము. ఇంకా విషయం మర్చిపో. చిన్నపిల్ల అని నవ్వుకో.” అని చెప్పి హాయిగా సీట్
వెనకకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు అభిమన్యు.
ఏ దేశమైనా కాని, ఏ వూరైనా కాని,
జాతీయ విమానాశ్రయం కాని,
అంతర్ జాతీయ విమానాశ్రయం కాని, నాకు
మంచిది అనుకున్నదినేను చేస్తాను. నాకే భయమూ లేదు, ఎవరి మెప్పూ అక్కరలేదు అన్నట్లు నిశ్చింతగా కూర్చున్న
అభిమన్యు ను చూడగానే
“సిరుత నవ్వుల వాడు
సిన్నెక్కా వీడు వెరుపెరగడు సూడవే సిన్నెక్కా”.
అన్నమాచార్య
కీర్తన గుర్తొచ్చి నిట్టూర్చింది * * * **
(20-3-2014 ఆంధ్రభూమి వారపత్రిక)
3 comments:
2009 లో నేను బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు చాలా పెద్ద బ్లాగర్స్ అందరూ ఉండేవారు .. ఏవేవో విషయాలు రాస్తూండేవారు.వీళ్ళలో ఎవరిని పలకరిస్తే ఎలా స్పందిస్తారో నాకెందుకులే అని బ్లాగ్స్ లో కామెంట్ కూడా తక్కువగానే ఇస్తుండేదాన్ని.కానీ మీరు నేను "నాచిన్నిప్రపంచం" బ్లాగ్ లో రాసుకునే ఏవో చిన్న ముచ్చట్లకే చక్కగా స్పందించి,ఆప్యాయంగా రాజీ అంటూ మంచి వ్యాఖ్యలు ఇచ్చేవారు.మీలాంటి పెద్దవారికి కూడా నా బ్లాగ్ నచ్చుతుంది అని,నాకు చాలా సంతోషంగా అనిపించేది.
మీ ముచ్చట్లు,కథలు చదవటం చాలా సంతోషంగా ఉండేది.ఇప్పుడు మళ్ళీ మీ సాహితీలో మాకు ఇలా కబుర్లు చెప్పటం చాలా సంతోషంగా ఉందండి.. :)
మీ ఏమండీ గారి జ్ఞాపకం బావుందండి!
raji, lalita thank you.
Post a Comment