Wednesday, September 18, 2019

పునీతులు





పునీతులు
రచన ; సుజల గంటి
మత్తుపదార్ధాల ప్రభావం మీద సుజల గంటి గారు రాసిన నవల "పునీతులు" ఇప్పుడే చదివాను.ఈ నవల స్వాతి మాసపత్రిక లో ప్రచురించబడింది.
చలపతిరావు దంపతులకు నలుగురు సంతానం, ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు.ఆ పిల్లలందరిలోకి మూడోవాడైన వీరు అమాయకుడు మంచివాడు.ఎవరు ఏపని చెప్పినా చేస్తాడు.రెండో చెల్లెలు మంజరి తప్ప మిగితా కుటుంబసభ్యులందరూ వీరూ మీద పెత్తనం చెలాయిస్తుంటారు. చదువుబాగా చదువుతాడని , తనకు ఆసరాగా ఉంటడని పెద్దకొడుకు నాగేంద్రను బాగా చదివిస్తాడు  చలపతిరావు. నాగేంద్ర ఉద్యోగస్తుడు కాగానే తన స్వార్ధం తను చూసుకుంటాడు. ఎందుకూ పనికిరాడని చిన్నచూపుచూస్తూ, నిర్లక్షం చేసిన వీరు తను సంపాదన తల్లికే ఇస్తాడు.వీరు ఇష్టపడిన మేనత్తకూతురు రమణి ని గాక పెద్దచెల్లెలు మాధురి పెళ్ళికి, కుండమార్పిడి పద్దతిలో దుర్గ ను ఇచ్చి పెళ్ళిచేస్తార్డు చలపతి.భార్య నుంచి కూడా ఆశించిన ఆనందం పొందలేక, కన్న కొడుకులోనైనా సంతోషం చూసుకుందామనుకుంటే దుర్గ తెలివితక్కువ తో ,కొడుకు కూడా దూరమవటము తో , విరక్తితో, చెడు సావాసాలతో మత్తుమందులకు బానిసవుతాడు వీరు.సముద్రపు వడ్డున పడిఉన్న వీరు ని హృషీకేశ్ లో ప్రకృతివైద్యాశ్రమం నడుపుతున్న గురూజీ చూసి, ఆదరించి , హృషీకేశ్ కు తీసుకెళ్ళి ఆరోగ్యవంతుడిని చేస్తారు..ఆ ఆశ్రమం లో గురూజి ఇలాంటి డ్రగ్ ఎడిక్ట్స్ కు చికిత్స చేస్తుంటారు.  మారిన వీరు ఇంటికి తిరిగి వెళ్ళేందుకు ఇష్టపడక ఈశ్వర్ అనే పేరు ఆశ్రమంలోనే స్వామీజికి సహాయపడుతూ ఉండిపోతాడు. స్వామిజీ ప్రోత్సాహం తో పేంటింగ్స్ వేయటం  నేర్చుకొంటాడు.పెద్ద చిత్రకారుడిగా పేరు పొందుతాడు.చిన్న చెల్లెలు మంజరి అనుకోకుండా వీరు ను చూడటము తో కుటుంబస్భ్యులను కలుసుకుంటాడు.భార్య, తల్లీ తండ్రి వీరు పట్ల తాము చేసిన నిరాదరణను తెలుసుకొని పశ్చాత్తాపపడుతారు. ఇంటికి తిరిగి వెళ్ళేందుకు వీరు ఇష్టపడక ఆశ్రమం లోనే ఉండిపోతాడు.క్లుప్తంగా కథ ఇది.
ఇందులో పిల్లల సైకాలజీ గురించి, నిర్లక్షం చేస్తే వారు ఎట్ల మారిపోతారో, చెడు సహవాసాలకు ఎలా లోనవుతారో వీరు పాత్ర ద్వారా చెపుతారు. పిల్ల మనస్తత్వం గురించి, పేరెంట్స్ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెపుతారు.రచయిత్రికి పిల్లల సైకాలజీ మీద మంచి అవగాహన ఉంది.ఈ నవల ఎదుగుతున్న పిల్లలున్న తల్లితండ్రులకు ఉపయోగపడుతుంది.
కాకపోతే తల్లితండ్రులకు పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా , అది అందరిమీద ఒకేరకంగా చూపించరా? . మాటవినే,అమాయకులైన పిల్లలను పేరెంట్స్ కూడా అడ్వాంటేజ్ గా తీసుకుంటారా ? అనే అనుమానం వచ్చింది నాకు
ఈ నవలలో రచయిత్రి చెప్పినటువంటి గురూజీ ఆశ్రమము , "పున్నాగపూలు"నవలలో ఆ నవల రచయిత్రి జలంధరగారు చెప్పినటువంటి జేకే ఆసుపత్రి నిజంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా అనిపించింది.
ఎక్కడైనా వేటింగ్ అప్పుడు పుస్తకం చదువుతూ కూర్చోటం నాకు అలవాటు. పుస్తకం కోసమని పెద్ద పర్స్ తీసుకుపోవాల్సి వచ్చేది. ఈ పుస్తకం చిన్నగా ముచ్చటగా, చిన్న పర్స్ లో పెట్టుకునేందుకు వీలుగా పాకెట్ సైజ్ లో బాగుంది.

No comments: