Saturday, January 19, 2019

బుజ బుజ రేకుల పిల్లుంది


బుజ బుజ రేకుల పిల్లుందీ
జ్ఞాపకాలు -8
19-1-2019
మా అమ్మగారింటి వెనుక చల్ల కొస్ఠం అనిఉండేది.అది విశాలంగా ఒక హాల్ లా ఉండేది..అందులోనే ఒక మూల నా బొమ్మరిల్లుండేది.ఆ హాల్ లోనే ఒక గుంజకు పెద్ద పొడగాటి చల్ల కవ్వం కట్టి ఉండేది.అక్కడ మా అమ్మమ్మ  పాటలు పాడుతూ,చల్ల కవ్వం తిప్పుతూ,మజ్జిగ చిలికేది.అమ్మమ్మ పాటలు బాగా పాడేది."మీరజాలగడా నా ఆనతి " పాట చాలా బాగా పాడేది.( అమ్మమ్మ,నేను గుంటూర్ లో శ్రీకృష్ణతులాభారం సినిమా చూసాము.అందులో జమున ఈ పాట పాడుతే, "అమ్మమ్మా నీ పాట " అన్నాను.దానిని జావళి అంటారు అని అమ్మమ్మ అప్పుడు చెప్పింది.) మజ్జిగ చిలుకుతూ ఉంటే పైన వచ్చే నురుగ, ఆ పైన తెల్లగా ముద్దలు ముద్దలుగా వచ్చే వెన్న చూడటం చాలా సరదాగా ఉండేది.వెన్న మొత్తం రాగానే ఇంత ముద్ద తీసి "అమ్మన్నా ( నన్ను అమ్మన్నా అని అమ్మమ్మ ఒక్కతే పిలిచేది.మా బామ్మను అమ్మన్నా అనిపిలిచేవారుట.అందుకని నన్ను అలాగే పిలిచేది.)చేయి పట్టు ."అనేది.యాక్ మనకు వెన్న, మీగడ, పాలు లాంటి పదార్ధాలు పడవు.అప్పటిదాకా అక్కడ కూర్చొని, ఆసక్తిగా చూస్తున్నదానిని అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోయేదాని.ఏం పిల్లమ్మా అని ముద్దుగా విసుక్కునేది అమ్మమ్మ.
మేము రాగానే, మా మస్తాను నా బొమ్మరిల్లు చక్కగా అలికి, తెల్లగా ముగ్గులు వేసేది.ఆకుపచ్చగా మెరిసిపోతున్న తాటాకు మట్ట ఒకటి తెచ్చేది.తాతగారు ఇంట్లో లేనప్పుడు (తాతగారు రానీయరుగా,అందుకన్నమాట)  నల్లగా , లావుగా ఉండే ఒకావిడ, (ఆమే పేరు గుర్తులేదు.)  బూందీ మిఠాయి,చెక్కమిఠాయి, పకోడీలు బుట్టలో పెట్టి వెనక నుంచి తెచ్చి అమ్మమ్మకు ఇచ్చేది. ఆమె ను చూస్తే భయం వేసేది కాని ఆమె తెచ్చిన మిఠాయిలు చాలా బాగుండేవి సరే వరండాలో అప్పటికే దర్జీ సాయెబు వచ్చేసావాడు.పిన్ని అతనితో రంగురంగుల బట్టలు ముక్కలు తెప్పించేది.తాటాకుతో రెండు బొమ్మలు చేసేది.ఆ బట్టలతో వాటికి ధోతి, చీర కట్టి, పూసలతో హారాలు చేసి వేసి సింగారించేది.దొడ్లో ఉన్న పూలతో దండలు అల్లేది.అన్నట్లు, కాగితాలు ,మెంతులు నానేసి రుబ్బి, అందులో కాస్త పసుపేసి, ఇంట్లో ఉన్న చిన్న చిన్న కటోరీలు లకు దట్టంగా పట్టించి ఎండబెట్టేది.అవి బాగా ఎండాక ఆ గిన్నె ఊడొచ్చి , కాగితంవేమో చిన్న చిన్న గిన్నెలుగా తయారయ్యేవి.అవి నేను వచ్చేటప్పటికే తయారయ్యి ఉండేవన్నమాట.బొమ్మరిల్లు, తాయిలాలు, గిన్నెలు, బొమ్మలూ తయార్ ఇక ఆలశ్యం ఎందుకు.ఆ . . . కొబ్బరాకుల బూరలు కూడా రెడీ.
మా స్నేహితులు కుడా వచ్చేసేవారు.అందరినీ రెండు భాగాలు, ఒకరు ఆడపెళ్ళివాళ్ళు, ఇంకోరు మగపెళ్ళివారన్నమాట!
"బుజ బుజ రేకుల పిల్లుందా?
బుజ్జా రేకుల పిల్లుందా?
స్వామీ దండం పిల్లుందా?
స్వరాజ్యమిచ్చే పిల్లుందా?"
అని ఒక పార్టీ అడుగుతే ఇంకో పార్టీ
"బుజబుజ రేకుల పిల్లుందీ
బుజ్జా రేకుల పిల్లుందీ
స్వామీ దండం పిల్లుందీ,
స్వరాజ్యమిచ్చే పిల్లుంది."  అనేవారు.
ఇలా పాటలతో పిన్ని ఆధ్వర్యం లోచాలా వైభవంగా జరిగేది మా బొమ్మల పెళ్ళి.అలా పెళ్ళి చేసి, అలిసి పోయి అమ్మ దగ్గరకు వెళ్ళి
"ఆటలు ఆడీ పాటలు పాడీ అలసిపోయామె,
తియ్య తియ్యని తాయిలమేదో పెట్టమ్మా" అనేదానిని. ఏం పిన్ని పెట్టలేదా అని నవ్వేది అమ్మ. ఎందుకు పెట్టలేదు బోలెడు తిన్నాంగా ఐనా ఆడుకోవటం అయ్యాక అమ్మను అలా అడగాలన్నమాట.అక్కడ మేమున్న నెలలో కనీసం నాలుగైదు సార్లన్నా బొమ్మల పెళ్ళి జరిగేది :)
మా పిన్ని కి పెళ్ళిలో మాతాతగారు ఆవూదూడను ఇచ్చారు.ఆ ఆవూదూడ తో పాటు నన్ను కూడా పిన్ని అత్తగారింటికి తీసుకుపోయింది.అక్కడ బామ్మగారికి అంటే బాబాయిగారి అమ్మకన్నమాట నేను తెగ నచ్చేసాను.అవును మరి నేను బుజ్జి బుజ్జిగా ముద్దుగా ఉండేదానిని కదా! చాలా గారాబం చేసేవారు. వాళ్ళకు మల్లె తోటలు ఉండేవి.సాయంకాలం కాగానే బోలెడు మల్లెపూలు తెచ్చేవారు పాలేర్లు.ఇల్లంతా మల్లెల వాసనతో ఘుమఘుమలాడేది.బామ్మగారు ఆ మల్లె పూలు నా రెండు జడలకూ కుట్టేవారు.ఆవిడ చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలని ఒక బొమ్మలపెట్టె నాకు ఇచ్చారు.అందులో రెండు చెక్క బొమ్మలు ,వాటికి రకరకాల మెరిసిపోయే సిల్క్  బట్టలు, లక్కపిడతలూ ఇంకా ఏవో కొన్ని బొమ్మలున్నాయి.అక్కడ ఉన్నన్ని రోజులూ వాటితో ఆడుకున్నాను. మేము వచ్చేస్తుంటే తీసుకుపో అని నాకే ఇచ్చేసారు బామ్మగారు.ఆ పెట్టెను భద్రంగా పరుపు చుట్టలో చుట్టారు. బస్ స్టాండ్ లో బస్ రాగానే నేను ,పిన్ని లోపల ఎక్కాము.పరుపు చుట్టను బస్ టాప్ మీద ఎక్కించారు.కీసర వచ్చేసరికి చీకటి పడింది.నిదరపోతున్న నన్ను ఎత్తుకొని దిగటంలో , హడావిడిలో పైన ఉన్న పరుపుచుట్ట దింపుకోవటం మర్చిపోయింది. అంతే బామ్మగారు ప్రేమగా ఇచ్చిన బొమ్మలపెట్టె ఏదరి చేరిందో! ఇప్పటికీ పిన్నిని సాదిస్తాను నా బొమ్మలపెట్టె దింపుకోలేదు అని.



1 comment:

Lalitha said...

మీ బొమ్మలపెట్టి పోయినందుకు నాకూ బాధగానే వుంది. మా నాన్నమ్మ నాకు ఇచ్చిన బుల్లిబుల్లి ఇత్తడి డేగిశాలు, గోకర్ణాలు, నేతి జాలీలు నేనూ పోగొట్టుకున్నా :(