Friday, January 18, 2019

జొన్న రొట్టె- ఉల్లిపాయ ఖారం


జొన్న రొట్టె- ఉల్లిపాయ ఖారం
జ్ఞపకాలు -3
4-1-2019
"బేబమ్మా . . . చుక్కీ . . . బేబమ్మా. . . చుక్కీ "
బిజిలీ  పిలుపులు గట్టిగా వినిపిస్తుంటే చెట్టు వెనుక దాకున్న నేను ఒక్కసారిగా ఉలిక్కి పడి చుట్టూ చూసాను. చీకట్లు కమ్ముకుంటున్నాయి.చుట్టూ పరిసరాలు మసక మసకగా కనిపిస్తున్నాయి.అప్పటిదాకా ఆట ద్యాసలో చీకటిని గమనించని నేను భయపడి బిజిలీ  అని అరుస్తూ పరుగెత్తుకెళ్ళి బిజిలీ  ని వాటేసుకొన్నాను.ఇంకో పక్క నుంచి చుక్కీ కూడా వచ్చి బిజిలీ  వాటేసుకొంది. నన్ను దగ్గరకు తీసుకొని,"ఇంత రాత్రయ్యేదాక బేబమ్మ ను అడివి లో తిప్పుతున్నావా?" అని చుక్కి చెవు పిండి, నెత్తిన మొట్టింది.చుక్కీ ఏడుపు  చూసి నేనూ ఏడుపు లంకించుకున్నాను.ఇద్దరినీ చెరో చేత్తో పట్టుకొని మా ఇంటి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇల్లంటే , వెదురు బొంగులు,తడికతో కట్టిన గుడిశ.దాని ముందు పేడతో కళ్ళాపి చల్లి ముగ్గేసి ఉంది.అక్కడే అమ్మ ఒక నులక మంచం మీద కూర్చొని నా లంగా కు అద్దాలు కుడుతోంది.నేను ఒక్క ఉదుటున బిజిలీ  ని వదిలించుకొని అమ్మ దగ్గరకు పరిగెత్తాను.అమ్మ ఒక్క చేత్తో నన్ను ఆపుతూ "చిన్నగా సూది గుచ్చుకుంటుంది.అప్పుడే ఆటలైపోయాయా ?" అంది.
అది ఒక చిన్న లాంబాడీ తాండా.నాన్నగారి పనిమీద అక్కడి కి వచ్చాము.ములుగు దగ్గర అడవి అది.అక్కడ మా  ఇంటి లాంటి వెదురు ఇళ్ళు ఓ పది ఉండవచ్చు. మేము తప్ప మిగితా అందరూ లంబాడీలే. బిజిలీ  అమ్మ కు అసిస్టెంట్. ఇంట్లో పనంతా చేస్తుంది. అమ్మ కు అద్దాలు కుట్టటం బిజిలీ  నే అమ్మకు నేర్పించింది.అప్పట్లో నా లంగాలు, గౌన్ లు అన్నింటి మీద అద్దాలే అద్దాలు :) బిజిలీ  కూతురు చుక్కీ నా వయసుదే, నా దోస్త్. పొద్దున్నే అమ్మ, నేను, బిజిలీ  , చుక్కీ అందరమూ దగ్గరలో ఉన్న వాగుకు వెళ్ళి స్నానం చేసి, కాసేపు నీళ్ళల్లో ఆడుకొని వచ్చేవాళ్ళం.అప్పుడేమిటి రోజంతా ఆటలే. ఆ అడవి, కొండలు, గుట్టలూ  అన్నీ   మా ఇద్దరివే .
ఆడుకొని ఆడుకొని అలిసిపోయి వస్తే బిజిలీ  వేడి వేడి నీళ్ళ తో స్నానం చేయించేది.నాన్నగారు సర్వే నుంచి వచ్చేసరికి కాగులో నీళ్ళు కాగుతూ ఉండేవి.నాన్నగారి స్నానం అయ్యేలోపల రెండు పెద్ద పెద్ద జొన్న రొట్టెలు, అందులోకి ఎర్రగా మెరిసిపొతున్న ఖారం వేసి తీసుకొచ్చి ఇచ్చేది. నాన్నగారు అవి తింటూ నాకూ కాస్త జొన్న రొట్టె, ఖారం పెట్టేవారు. ఆ ఖారం నోట్లో వేసుకోగానే అబ్బ ఎంత మంట పుట్టేదో! ఐనా రుచి బ్రహ్మాండగా ఉండేది.ఇప్పటికీ ఆ రుచి నాలుక మీద ఆడుతూనే ఉంది.
రెండు నెలల క్రితం నీరసంగా పడుకున్న అమ్మ దగ్గర కూర్చొని ఈ సంగతి చెపితే, "అప్పుడు నీకు ఐదేళ్ళు కూడా లేవు . ఇంత గుర్తుందా?" అని ఆశ్చర్యపోయింది.
"ఎందుకు గుర్తులేదు , ఆ ఖారం రుచి, నువ్వు నులకమంచమీద, జుబ్లీ కింద కూర్చొని , అద్దాలు కుట్టటం, అన్నీ గుర్తే నాకు."అన్నాను.
ఆ గూడెం పేరు ఏదో చెప్పింది అమ్మ. కాని ఇప్పుడు అది మర్చిపోయాను." అప్పుడు ఆ చుట్టు పక్కల అడవిలోకి  సర్వే కు వెళుండేవారు మీ నాన్నగారు.సమ్మక్క సారలక్క జాతరకు కూడా వెళ్ళారు.నేనూ వస్తాను అంటే, వద్దు అక్కడ కు పులులు వస్తాయి అని మీ నాన్నగారు నన్ను తీసుకెళ్ళలేదు. అవునూ నీకు అన్నీ గుర్తున్నాయి అంటున్నావు కదా , నీ ఫస్ట్ బర్త్ డే కు నువ్వు ఏమి చేసావో చెప్పు." అంది అమ్మ నీరసంగా నవ్వుతూ.
"పో అమ్మా.మరీ సంవత్సరం అప్పటివి ఏమి గుర్తుంటాయి?నువ్వు చెప్పు నేనేమి చేసానో" అన్నాను.
ఇదంతా వింటున్న మా చెళ్ళెల్లిద్దరూ "అక్క ఏం చేసిందమ్మా ? "అని ఆతృతగా అడిగారు. నా ఫస్ట్ బర్త్ డే కి నేనేమి చేసానో అమ్మ చెప్పింది వింటే అందరూ కమల పరచ కు ఇంత సీన్ ఉందా అని ఆశ్చర్యపోతారు!


No comments: