చాయ్ బిస్కత్
జ్ఞాపకాలు - 5
10-1-2029
మా చిన్నప్పుడు మా అత్తయ్యవాళ్ళ ఇంటికి
వెళుతుండేవాళ్ళము.పెద్ద అయ్యాక వెళ్ళలేదా అంటే ఎందుకు వెళ్ళలేదు కాకపొతే కాస్త
పెద్దయ్యాక పెళ్ళి చేసుకొని ఏమండీ తో కలిసి దేశం మీద పడ్డాను కదా అందుకని
తగ్గిపోయిందన్నమాట.
మా అత్తయ్యావాళ్ళు ఆసిఫాబాద్ లో ఉన్నప్పటి
సంగతి.ఇల్లు అడవిలో ఉండేది. అదేమిటో "సీత"అన్న పేరున్న అమ్మాయిని పెళ్ళి
చేసుకున్నాము కాబట్టి అడవులల్లోనే ఉండాలి అనే రూల్ ఉందేమో అన్నట్లు మామయ్య, నాన్నగారు ఎప్పుడూ అడవులల్లో, తాండాలల్లో నే ఉండేవారు.ఈ సీతమ్మలు కూడా ఆ అడవులు ,
తాండాలు బాగానే ఎంజాయ్ చేసారుట.ఎప్పుడు ఆ విషయం వచ్చినా , ఓ పెట్టెలో కాసిని గిన్నెలు,వంటసామాన్లు, ఓ పెట్టెలో రెండు చీరలు వేసుకొని వెళ్ళేవాళ్ళం అని మురిపెంగా చెప్పేవారు!
ఆ అడవిలోనే మామయ్య కొలీగ్ అనుకుంటా ఇంకో ఆయన కూడా వుండేవారు.ఓసారి అత్తయ్య,
అత్తయ్య కూతురు పార్వతి,అమ్మ, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాము.వెళ్ళే ముందు అత్తయ్య, అమ్మ
నాకూ పార్వతికీ బోలెడు సూక్తి ముక్తావళి చెప్పారు, అక్కడ
వాళ్ళు ఏమైనా పెట్టగానే తినవద్దు.మాకు కావాలి అని అడగవద్దు.ఏమీ మాట్లాడకుండా
బుద్దిగా కూర్చోవాలి వగైరా వగైరా అన్నమాట. ఇద్దరం బుద్దిగానే బుర్ర ఊపేసాము.సరే
వెళ్ళాము. అత్తయ్య,అమ్మ, అత్తయ్యగారు (
మరి అప్పట్లో బయట వాళ్ళంతా అత్తయ్యగార్లు,
పిన్నిగార్లే కదా) కాసేపు కబుర్లు చెప్పుకున్నాక, అత్తయ్యగారు ఒక ప్లేట్ లో కాసిని బిస్కెట్ లు, రెండు
కప్పు లాలో ఏదో ద్రవ పదార్ధం తీసుకొచ్చారు.అమ్మా, అత్తయ్య
రోజూ కాఫీ తాగటం చూసాము కాని ఇదేమిటో మాకు
తెలీదు.బిస్కెట్ లు కూడా మా ఇంట్లో ఉండే బిస్కెట్ల లా లేవు.గుండ్రంగా పెద్దగా
ఉన్నాయి. నోరూరిస్తున్నాయి. నేను పార్వతి వైపు చూసాను.తనదీ నా పరిస్తితే!ఇద్దరమూ
అవి చూస్తున్నాము, అమ్మలను చూస్తున్నాము. "అత్తయ్యగారు పిల్లలు చాయ్ తాగుతారా?"
అని అడిగారు.ఓహో దానిని చాయ్ అంటారన్న మాట అనుకున్నాను.అమ్మ కప్
సాసర్ చేతిలోకి తీసుకొని లేదండి వాళ్ళకు అలావాటు లేదు అంది.కాని ఇక ఆరాటం ఆపుకోలేక
"లేదు తాగుతాం "అన్నాము ఇద్దరమూ అమ్మలవైపు చూడకుండా జాగ్రత్త పడుతూ.
"మీకు మలాయ్ చాయ్ తెస్తాను." అని
అత్తయ్యగారు రెండు చిన్న చిన్న గ్లాస్ లల్లో తెచ్చారు.కప్ లల్లో ఇవ్వలేదని
అసంతృప్తిగా ఉన్నా అవి తీసుకున్నాము.చూడగానే ఆ చాయ్ మీద మీగడ తరకలు తేలుతూ తెల్లగా
మెరిసిపోతున్నాయి.మనకసలే పాలు, మీగడ,వెన్న
లాంటి పదార్ధాలు పడవు.పైగా మీగడంటే డోకు!"యాక్" అంటూ మొహమంతా వికారంగా
పెట్టుకొని, పక్కన పెట్టేసి బిస్కెట్ తీసుకుంటూ పార్వతి వైపు
చూసాను తనూ డిటో! భలే రుచిగా ఉన్నాయి ఇంకేముంది ఇద్దరమూ రెండేసి బిస్కెట్లు
లాగించేసాము! .ఆ తరువాత ఇంటికి వెళ్ళాక మా ఇద్దరి పరిస్తితి ఏమిటి అని
అడగకూడదు.అడిగినా మేము చెప్పము
No comments:
Post a Comment