Saturday, December 23, 2017

కొత్త కాపురం లో సునామీ సృష్ఠించబోయిన "జీవన తరంగాలు "





లక్ష్మీవసంత గారు , పద్మాదాశరధిగారు యద్దనపూడి సులోచనారాణి గారి నవల "జీవనతరంగాలు " మీద సమీక్ష రాసారనీ, అది తనకు చాలా నచ్చిందనీ, ఆ సమీక్ష ఇస్తూ రాసిన పోస్ట్ నాలోని కొన్ని జీవంతరంగాలు నవల కు సంబంధించిన జ్ఞాపకాలను తట్టిలేపింది.
అవి మా పెళ్ళైన తొలిరోజులు. ముందుగా పటియాలా వెళ్ళి, అక్కడ ఒక నెల మాత్రమే ఉండి , పూనా మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజ్ లో మా ఏమండీ కి కోర్స్ రావటం వల్ల, ఒక పెద్ద నల్ల పెట్టెలో వంట సామునులు, ఒక నల్ల పెట్టెలో ఏమండీ యూనిఫాం లు షూస్ , కిట్స్ , ఒక సూట్కేస్ లో ఆయన బట్టలు, ఒక సూట్కేస్ లో నా బట్టలు తో  పూనా వెళ్ళి కొత్తకాపురం మొదలు పెట్టాము.ఆయనకు పూనాలో వకటిన్నర సంవత్సరము, సికింద్రాబాద్ లో ఒకటిన్నర సంవత్సరము ట్రైనింగ్ అన్నమాట. పూనా వెళ్ళగానే ఆయన యంసియం లో చేరటమే కాకుండా నన్ను వాడియాకాలేజ్ లో బియే మొదటి సంవత్సరం లో చేర్చారు. ఇద్దరమూ పొద్దున్నే ఏడుగంటలకే ఇల్లు వదిలేవాళ్ళము.పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే కూర, పప్పు కూడా వండేసుకొని , అన్నం మాత్రం వచ్చాక వండేదానిని.ఏమండీగారి ప్రిన్సిపుల్స్ వల్ల అమ్మ దగ్గర నుంచి కాని , అత్తగారి దగ్గర నుంచి కాని ఏమీ సామానులు  తెచ్చుకోలేదు.హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు భాటియా షాప్ లో అత్యవసరమైన గిన్నెలు మాత్రము కొనుకొచ్చుకున్నాము.ఒక్కో నెల ఒక్కోటి కొందామని ఏమండీ ప్లాన్ అన్నమాట. అప్పుడప్పుడే గాస్ స్టవ్ లు వస్తున్న కొత్త రోజులు .కొంచం కాస్ట్లీ కదా అందుకని ఇంకో నెలకు అని పోస్ట్పోన్ అవుతోందన్నమాట.కిరోసిన్ స్టవ్ మీదే వంట . అన్నట్లు అప్పుడు మా పెళ్ళిలో మా ఏమండీ ఫ్రెండ్ కాప్టెన్ నగేష్ ప్రెషర్ కుక్కర్ బహుమతిగా ఇచ్చినా అందులో ఎట్లా వండాలో తెలీక చాలా ఏళ్ళు వండలేదు :)  ఇదీ నేపధ్యం :)
ఒక రోజు కాలేజ్ నుంచి వచ్చేసేటప్పుడు మా ఫ్రెండ్ నందిని ఎందుకో రైల్వే స్టేషన్ కి వెళుదాము రమ్మంది.సరే నని తనతో పాటు వెళ్ళాను.అక్కడ బుక్ స్టాల్ లో ఆంధ్రజ్యోతి వారపత్రిక కనిపించింది. అప్పటి వరకు చందమామ,బాల మిత్ర, టాంసాయర్, బారిష్టర్ పార్వతీశం లాంటి బాల సాహిత్యం చదివానే కాని పెద్దవాళ్ళ పుస్తకాలు చదవలేదు.అమ్మ ప్రభ తెప్పించేది చదువుదామని ఉన్న అమ్మ కోపం చేస్తుందని చదివేదానిని కాను.ఇక్కడ అమ్మలేదుగా కోపం చేసేందుకు ఐనా పెళ్ళైంది, కొంచం పెద్దదానయ్యాను కదా అని ధైర్యం చేసి కొనేసాను. ఇంటికి వెళ్ళాక,అన్నం వండి ఏమండీకి పెట్టి మధ్యాహ్నం క్లాస్ లకు పంపించేసి,పుస్తకం  తెరవగానే "జీవనతరంగాలు"సీరియల్ కనిపించింది.అప్పటికే అది మొదలై కొన్ని వారాలైంది.ఐనా జరిగిన కథ చదివి , సీరియల్ చదివాను.సీరియల్ తగ నచ్చేసింది. కాని ఒక్క పేజీ నే ఉంది.రెండోపేజ్ లో సగం ఇచ్చి, మిగితా సగం లో అడ్వటైజ్మెంట్ ఇచ్చాడు.ఎంత నిరాశగా అనిపించిందో!ఇక అప్పటి నుంచి ప్రతివారం (ఏ వారం వచ్చేదో గుర్తులేదు మరి ) దానికోసం ఎదురు చూడటం , బస్ లో నుంచి కిరికీ బుక్ షాప్ లో కనిపించగానే బస్ దిగేసి , పత్రిక కొనుక్కోని ఇంకో బస్ ఎక్కి వెళ్ళటం అలవాటయ్యింది. పత్రిక రాగానే కొనకపోతే మరునాడు దొరికేది కాదు. ఒక సారికిరికీ లో అప్పుడే ఐపోయాయి అన్నా డు.మరి మరునాడుస్టేషన్ లో కూడా దొరకకపోతే ప్రాణం నెక్స్ట్ వీక్ దాకా ఆగదుకదా అందుకని మళ్ళీ స్టేషన్ దాకా వెళ్ళి బుక్ కొనుక్కొని ఇంటి కి వచ్చేసరికి ఏమండీ అటూఇటూ అచార్లూ పచ్చార్లూ చేస్తున్నారు. మరి అన్నం తిని మళ్ళీ క్లాస్ కు వెళ్ళాలికదా! ఎందు కంత లేట్ అయ్యింది అన్నారు.చిన్నగా నసుగుతూ, భయపడుతూ చెప్పాను.అప్పుడేమీ అనలేదు.అన్నం గబగబా వండేసాను. తిని వెళ్ళిపోయారు.అలా రెండు సార్లు జరిగింది.ఇక మూడోసారి కోపం ఆపుకోలేక నా చేతిలోని పత్రిక లాక్కొని , కిటికీ లొనుంచి బయటకు విసిరేసారు :( అప్పటికి ధుమధుమాలాడుతూ వెళ్ళిపోయినా, నా ఏడుపు ముఖం చూసి జాలేసిందేమో, సాయంకాలమే వెళ్ళి గాస్ స్టవ్ కొనుకొచ్చారు :) ( అహా మొహం ఎంత వెలిగిపోతోందోకదా!) ఇంకెప్పుడూ ఇంత ఆలశ్యంగా రాకు అని వార్నింగ్ కూడా ఇచ్చారనుకోండి. ఇక అప్పటి నుంచి ఆహా నా జీవన తరంగమా అనుకుంటూ  కాలేజ్ లో చివరి క్లాస్ ఎగొట్టి , స్టేషన్ కే డైరెక్ట గా వెళ్ళి పత్రిక తెచ్చుకునేదానిని.
సంవత్సరమన్నర తరువాత సికింద్రాబాద్ వచ్చాము.స్టూడెంట్ ఆఫీసర్, పైగా సింకిద్రాబాద్ పెద్ద స్టేషన్ కాబట్టి ,చాలా మంది ఆఫీసర్ లు ఇంటికోసం వేటింగ్ లో ఉండేవారు.కాకపోతే మారేడ్పల్లిలో  ప్రైవేట్ ఇల్లు అద్దెకు తీసుకొని ఉండేవారు.అప్పటికే నేను ప్రెగ్నెంట్ ని. ఎనిమిదో నెల.అందుకని మేము విడిగా వెళ్ళ కుండా హైద్రాబాద్ లో మా అత్తగారింట్లోనే వున్నాము.ఏమండీనే పొద్దున్నే ఐదుగంటలకు సికింద్రాబాద్ వెళ్ళి, పి.టి, క్లాస్ లు, మధ్యాహ్నం గేం క్లాస్ లు, తరువాత కంబైండ్ స్టడీస్ అన్నీ ముగించుకొని రాత్రి పదింటికి వచ్చేవారు.ఒక్కోసారి ఎక్జాంస్ ఉంటే మెస్ లోనే ఉండిపోయేవారు. ఇక ఇంట్లో ఏమో తరంగాల కోసం కోసం నా మది తల్లడిల్లిపోతుండేది :) నేను బయటకు వెళ్ళేదానిని కాదు మరి ఓపలేనిదానిని కదా! ఏమండీ కంటికే కనిపించరు.మామగారిని పత్రిక కొని తేమని అడగలేనుగా :( అంతే అప్పుడప్పుడు తరంగం లా గుర్తుతెచ్చుకోవటే కాని మరిచిపోయేందుకు ప్రయత్నం చేసాను :( 
అలా అలా కాలం వెళ్ళబుచ్చుతూ ఉండగా మా అమ్మాయి డిసెంబర్ లో పుట్టింది.అప్పట్లో తెలంగాణా ఎజిటేషన్ మూలంగా కాలేజీలు బంద్ అయ్యి, జూన్లో మొదలు కావలసిన కొత్త సెషన్స్ జనవరిలో మొదలయ్యాయి.ఒక ఎకడమిక్ ఇయర్ వేస్ట్ అయ్యిందన్నమాట. నాకేమో కలిసి వచ్చింది.ఫిబ్రవరీ లో ఇంటిపక్కనే ఉన్న రెడ్డీ వుమెన్స్ కాలేజ్ లో బియే సెకండ్ ఇయర్ లో చేరాను. ఒక రోజు మా ఫ్రెండ్ స్వర్ణ హడావిడిగా వెళుతుంటే ఎక్కడికి అని అడిగాను.ఆర్కే లైబ్రరీ కి. ఇప్పుడే వెళ్ళక పోతే ఆంధ్రజ్యోతి దొరకదు.అంది.ఆంధ్రజ్యోతి పేరు వినగానే టక్కున తలెత్తి ఎక్కడా ఆ లైబ్రరీ అన్నాను.ఇక్కడే నువ్వు పుస్తకాలు చదవవా ? అంది .ఎందుకు చదవను నాకూ ఆంధ్రజ్యోతి కావాలి అని తన వెంట వెళ్ళాను.తను రెంట్కు తీసుకుంది.నేను కొనుకున్నాను.గబగబా పేజ్ తిప్పి చూసాను.జీవనతరంగాలు సీరియల్ ఉంది. ఐపోలేదు.ప్రాణం లేచి వచ్చింది.అప్పుడే స్వర్ణ ఈ రచయిత్రిదే సెక్రెట్రీ అని నవల ఉంది.చాలా బాగుంది చదువు అని రెంట్ కు ఇప్పించింది.అలా ఆలైబ్రెరి లో చేరిపోయాను.పత్రిక రెంట్ పది పైసలు రోజుకు.నవల పావలా. జీవన తరంగాలు చాలా నిరాశపరిచేది.ఒక్కటిన్నర పేజ్ మాత్రమే ఇచ్చేవాడు.ఒక్క నిమిషం లో చదవటం ఐపోయేది.ఉక్రోషం, కోపం, ఏడుపు వచ్చేవి :) అలా చాలా ఏళ్ళు వచ్చినట్లుంది ఆ సీరియల్.
ఆ విధము గా జీవనతరంగాలు మా కొత్తకాపురం లో సునామీలా వచ్చి చిన్నపాటి తుఫానుగా మారింది.నన్ను యద్దనపూడి అభిమానిగా చేసింది. లైబ్రరీ కి అంకితం చేసి పుస్తకాల పిచ్చి తగిలించింది :)  ఓ విధంగా రచయిత్రిని అయ్యేందుకు దారి వేసింది :) అన్నట్లు మా ఇంట్లో గాస్ పొయ్యి కూడా వెలిగించింది :)


2 comments:

శ్రీలలిత said...

పోనీండి.. సునామీని తేకుండా గాస్ స్టవ్ ని మటుకు తెచ్చింది. మంచిదే కదా!

sam said...

dear sir telugu article very good
Telangana News