Friday, May 14, 2021

Nee Jathaga Nenundaali | Kathaa maala Podcast by Mala Kumar | E11 - విధి...

నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం. ఓ చల్లని సాయంకాలం నేనూ, మా ఏమండీ వాకింగ్ చేస్తుండగా, "ఏమండీ నేను కథ రాసి చాలా రోజులైంది. ఏదైనా రాద్దామంటే ఏ టాపిక్ తోచటం లేదు. మీరేదైనా టాపిక్ చెప్పండి" అని అడిగాను. కాసేపు ఆలోచించి, "నేను ఆర్మీలో చేరిన కొత్తల్లో జరిగిన మా ఫ్రెండ్స్ లో జరిగిన ఒక సంఘటన చెపుతాను. కాని అది మరి పాఠకులకు నచ్చుతుందో లేదో నువ్వు ఆలోచించుకో" అని ఈ కథ చెప్పారు. నేను కాసేపు ఆలోచించి, సబ్జెక్ట్ వెరైటీగా ఉంది. కల్పితం కాదు. జరిగిన కథనే రాసి చూద్దాం అనుకొని "రాస్తాను" అన్నాను. అయితే టైటిల్ దగ్గర నుంచి, అందులోని ముఖ్య పాత్రలకు అన్నీ ఒక అక్షరం సూచించి దానితోనే పేర్లు రావాలి అని కండీషన్ పెట్టారు. ఇక ఏక దీక్షగా మరి ఆర్మీ ప్రేమ కథ కదా అని కాస్త ప్రేమ కూడా జోడించి రాసి, ఏమండీకి చూపిస్తే నచ్చింది కాని పంచ్ రాలేదు అన్నారు. అలా అలా ఏమండీకి నచ్చే పంచ్ వచ్చే వరకూ రాసేసరికి కాస్త పెద్దదయింది. ఇది 16-12-2016 గోతెలుగు.కాం అంతర్జాలపత్రిక లో ప్రచురించబడింది. ఏమండి సూచించిన అక్షరమేదో కొంచం చదవగానే అర్ధమైపోతుందిలెండి. ఇక కథలోకి పదండి. 11. విధివిన్యాసాలు చదువుతున్న పుస్తకం లో నుంచి తలెత్తి వేళ్ళు విరుచుకుంటూ ఉంటే ఎదురుగా లలిత విచారంగా కూర్చొని కనిపించింది వసుధకు. వసుధ లలిత చేతిని తట్టి ఏమిటీ సంగతి అనట్లు సైగ చేసింది. లలిత ఉలిక్కి పడి బయటకు వెళుదాం అన్నట్లు లేచింది. వసుధ తన పుస్తకాన్ని రాక్ లో పెట్టి లలిత ను అనుసరించింది. లెక్చర్ జాబ్ నుంచి రిటైర్ అయ్యాక, ఇంట్లో పనంతా ముగిసాక మధ్యాహ్నం లైబ్రరీ లో గడపటం అలవాటు చేసుకుంది వసుధ. లలిత తో అక్కడే లైబ్రరీ లో స్నేహం కలిసింది. ఇద్దరికీ పుస్తకాలు చదవటం ఇష్టం. దానితో లైబ్రరీ లో చదవటం అయ్యాక, ఇంకో పుస్తకం ఇంటికోసం తీసుకొని, లైబ్రరీ ఆవరణలోని పున్నాగచెట్టు కింద కూర్చొని, కాసేపు పుస్తకాల గురించి చర్చించుకోవటం ఇద్దరికీ అలవాటు. చాలా అరుదుగా సొంత విషయాలు మాట్లాడుకుంటారు. ఇది గత కొద్ది కాలంగా సాగుతోంది. ఇద్దరూ పున్నాగ చెట్టుకింద, బెంచ్ మీద కూర్చున్నారు. అప్పుడప్పుడు చెట్టు మీద నుంచి పున్నాగపూలు రాలుతున్నాయి. వాటి సువాసన సన్నగా గాలిలో తేలి వస్తూ, చుట్టూ ఉన్న చెట్ల నుంచి గాలి వీస్తూ, పరిసరాలు చాలా ఆహ్లాదంగా ఉన్నాయి. కాసేపు ఇద్దరూ నిశబ్ధంగా కూర్చున్నారు. చివరకు, "నన్ను కూడా గమనించ కుండా అలా మూడీ గా కూర్చున్నావు ఏమిటి సంగతి?" అని అడిగింది వసుధ. "నీకు తెలుసుగా వసూ, నాకు ఒక్కడే కొడుకని, వాడీ మధ్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పెద్ద కంపెనీలో మంచి సాలరీ తో చేరాడని, వాడి కి పెళ్ళి సంబంధాలు చూస్తున్నామని” అని ఆగింది లలిత. "ఊ తెలుసు ఏదైనా మంచి సంబంధం వచ్చిందా?" అడిగింది వసుధ. "సంబంధాలకేమి బోల్డు వస్తున్నాయి. వాడే నా నెత్తిన నిప్పులు పోసాడు” కోపంగా జవాబిచ్చింది లలిత. "ఏమిటీ ఎవరినైనా ప్రేమించాడా? ఈ మధ్య ఇది మామూలైపోయింది కదా దానికి విచారమెందుకు?” అంది వసుధ. "మామూలు ప్రేమైతే విచారమెందుకు?" చికాకుగా అంది లలిత. "మరి కులాంతరమా? ఖండాంతరమా? ఖండాంతరం కూడా ఈ మధ్య ఎక్కువగానే జరుగుతున్నాయిగా” అంది వసుధ. "అదైనా బాగానే వుండు. ఎలాగో అడ్జెస్ట్ అయ్యేవాళ్ళం. ఇద్దరు పిల్లలున్న విధవను పెళ్ళి చేసుకుంటాడుట. వీడికేమైనా కాలొంకరా? కన్నొంకరా? అందగాడు, పెద్ద ఉద్యోగస్థుడు, ఒక్కగానొక్క కొడుకు. ఆమెనే పెళ్ళి చేసుకుంటాడుట. లేకపోతే అసలు పెళ్ళే చేసుకోడుట. ఇదేమి పోయేకాలమో! ఆ పిల్ల ఎవరో బాగానే బుట్టలో వేసుకుంది” కసిగా కన్నీళ్ళతో అంది లలిత. లలిత వైపు సాలోచనగా చూసి ”ఏమిటట, ఆ అమ్మాయిని ఉద్దరిస్తాడటనా?" అడిగింది వసుధ. "కాదుట, ప్రేమట. అదేమి ప్రేమో మరి” కోపంగా అంది లలిత. "ఓ" నిశబ్ధంగా ఆలోచనలో పడింది వసుధ. ఇద్దరూ కాసేపు మౌనంగా కూర్చున్నారు. "నేను చెప్పేది నమ్మలేకపోతున్నావా వసూ మాట్లాడటం లేదు” అడిగింది లలిత. దానికి జవాబివ్వకుండా, నేనొకటి చెపుతాను వింటావా లలితా అడిగింది వసుధ. "ఊ చెప్పు” అనాసక్తిగా అంది లలిత. · * * * * * * * * మరి వసుధ ఏమి చెపుతుందో విందాం పదండి నా ప్రభాతకమలం కు.

No comments: