అందమైన అద్భుతమైన
గతమా
రచన;మాలాకుమార్
(కమల పరచ)
" యే షామ్ మస్తానీ
మద హొష్
కియె జాయె
ముఝె
దోర్ కొయి ఖీంచె
తేరి
ఔర్ లియె జాయె "
మైక్ లో మృదుమధురంగా డేవిడ్ గొంతులో నుంచి
జాలువారుతోంది.ఆ పాట కు అనుగుణంగా అందరి పాదాలు కదులుతున్నాయి.లైట్లు డిమ్ గా
వెలుగుతున్నాయి.నా చేయి పట్టుకొని అడుగులు వేయిస్తూ " ఈ షామ్ ఏమిటీ ఎప్పుడో యాభై
ఏళ్ళ క్రితం షామ్
నే నన్ను గుంజేసావు ." అన్నారు ఏమండీ నవ్వుతూ.
"కదా! అందుకేగా అప్పటి నుంచీ నేను కింద
పడకుండా పట్టుకొని ఇలా మీ అడుగులో అడుగు వేయిస్తూనే వున్నారుగా " అంటూ చుట్టూ
చూసాను.అందరూ జంటలు జంటలుగా పాదాలు
కదుపుతూ అదో అలౌకికమైన ఆనందం లో ఉన్నారు.అది డిఫెన్స్ ఆఫీసర్స్ క్లబ్. కల్నల్
.జార్జ్ 75 వ పుట్టిన రోజును వాళ్ళ పిల్లలు అరేంజ్
చేసారు.ఆయన పాత మితృలందరినీ పిలిచారు.అంతే కాక అప్పటి వాళ్ళకు ఇష్టమైన మ్యూజిక్
మాస్టర్.డేవిడ్ ను పిలిచారు.అతను పెద్దవాడైపోయినప్పటికీ ,వీళ్ళ
ఆహ్వానాన్ని మన్నించి వచ్చి, అందరికీ ఇష్టమైన పాటలు
పాడుతున్నాడు.అంతా ఉత్సాహంగా పాదాలు కదుపుతూ , ఉషారుగా
డైభైలో ఇరవై వచ్చేనా ఎవరికైనా అంటే ఆహా అనేస్తున్నారు.ఇంతలో ఎవరొ "అరే
భాయ్ హం బుడ్డే నై హుయే బోలో జై జై శివ
శంకర్ " అని అరిచారు.అంతే మ్యూజిక్ ఊపందుకుంది.మరి అందరూ రాజేష్ ఖన్నా
అభిమానులు!
డాన్స్, కేక్
కట్టింగ్, డిన్నర్ అంతా ముగిసి ఇంటికి వచ్చేసరికి పదకొండైపోయింది.ఒకప్పుడు
డాన్స్ అంటే రాత్రి తెల్లవార్లూ చేసి, తెల్ల వారుఝామున క్లబ్
లో ఏదో ఇంత తినేసి వచ్చేసేవాళ్ళము.నేను అదే అంటే "ఎంత కాదనుకున్నా
వయసొచ్చేస్తోందిగా ?" అని నవ్వారు ఏమండి.
ఇంటి మెట్లెక్కుతుండగా , మెట్ల పక్కనున్న పారిజాతం, "హాయ్ "అని
పలకరించింది."అరెరే ఈ రోజు నిన్ను పలకరించలేదు కదూ ,ఇప్పుడే
వస్తానుండు."అని లోపలకెళ్ళి ఫ్రెషప్ ఐ వచ్చి, బాల్కనీ
లో కూర్చున్నాను.పారిజాతాన్ని చూస్తుంటే,గేట్ కాంపౌండ్ వాల్
మీద నుంచి "నీకెప్పుడూ అదంటేనే ఇష్టం.నాతో మాట్లాడనే లేదు."అని మూతి
ముడిచింది రాధామాధవం.
"అలగకురా బంగారూ."అని రాధామాధవం ను
బుజ్జగిస్తుంటే,
"ఏమంటున్నాయి నీ బంగారు తల్లులు?ఇదో కాఫి తాగు ఇంకాస్త ఓపికొస్తుంది వాటితో ముచ్చట్లాడేందుకు." ఎప్పుడు
కలిపారో ట్రేలో రెండు కాఫీ కప్ లు తీసుకొని వచ్చి,నాకో కప్పు
ఇచ్చి, ఏమండీ ఒక కప్పు తీసుకొని పక్క కుర్చీలో కూర్చున్నారు.
కొద్ది క్షణాలు మౌనం లో గడిచిపోయాయి.
"అవునూ నీ మాలతీలత ఎప్పుడు పెద్దగా
అవుతుంది? ఎప్పుడు మనం దాని దగ్గర నిలుచొని పాట పాడుకోవాలి?
అన్నారు బాల్కనీ మొదట్లోకి కొద్దిగా పాకిన మాలతి తీగను
చూస్తూ.పాల్గుణచంద్రుని కాంతిలో మొక్కలన్నీ మెరిసిపోతున్నాయి.రోడ్ మీద ఎవరూ
లేరు.అంతటా నిశబ్ధంగా ఉంది.ఆ నిశబ్ధం,సన్నగా వీచే గాలికి
తలలూపుతూ ,సువాసనలు వెదజల్లుతున్న పూల తీగలు,ఆకాశంలోని చందమామ వాతావరణం హాయిగా ఉంది.
వాటిని చూస్తూ నేను ఏమండీని " ఏ పాట పాడుతారేమిటి ?"
అని అడిగాను నవ్వుతూ.
"పచాస్ సాల్ పహలే హమే తుంసే ప్యార్ తా,
ఆజ్ భీ హై,ఔర్ కల్ భీ రహేగా " అన్నారు.
"అబ్బో " అంటూ చిన్నగా లేచి కింద
కూర్చొని ఆయన మీద తల ఆనించాను.
ఇద్దరమూ కాసేపు ఏవో ఆలోచనలలో ఉండిపోయాము.కొద్ది
సేపయ్యాక నేను "ఏమండీ ఎన్ని సార్లు ,ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను కాశీ వెళుదామని.హిందువులమై ఉండి ,హిందువుల పుణ్యక్షేత్రం చూడకపోతే ఎట్లా ? ఇప్పుడు
మనము ఫ్రీనే కదా వెళ్దామండీ.” అన్నాను.
"ఇప్పుడు బ్రిడ్జ్ టోర్నమెంట్స్
ఉన్నాయికదా .అవైనాక వెళుదాములే పది రోజుల తరువాత."అన్నారు ఏమండి.
"ఈ మధ్య నాకు నాగార్జున సాగర్ కూడా
వెళ్ళాలని ఎందుకో చాలా అనిపిస్తోంది."అన్నాను.
"ఎందుకు?" అని
అడిగారు.
"మన పెళ్ళి చూపులు అక్కడే కదా
అయ్యాయి.మీకు గుర్తుందా ? పెళ్ళి మాటలన్నీ అయ్యాక నాన్నగారు లెఫ్ట్ కెనాల్
దగ్గరికి, డాం దగ్గరికి తీసుకెళ్ళారు.అప్పుడే తవ్వుతున్న
కెనాల్ కిందికి మీరు రాళ్ళ మీద నుంచి దూకుతూ వెళుతుంటే మొదటిసారి చూసాను
మిమ్మల్ని. అమ్మ
తలెత్తవద్దు అంటే చూపులప్పుడు తలెత్తనే లేదు నేను.కెనాల్ దగ్గర మీరు కిందికి
దిగుతున్నప్పుడు, నాన్నగారు నా దగ్గరికి వచ్చి,నువ్వు ఆ అబ్బాయిని చూసావా అసలు ? అదిగో అతనే అని
మిమ్మలిని చూపించారు.అప్పటి వరకు ముమ్మలిని చూడలేదు. అక్కడ నుంచి డామ్ దగ్గరకు
వెళ్ళాము.అక్కడ శివాలయం లోకి వెళ్ళి మనిద్దరినీ దండం పెట్టుకురమ్మన్నారు
అత్తయ్యగారు.గుడి దగ్గరికి వెళ్ళాక "చెప్పులిప్పాలా ?" అని అడిగారు మీరు నన్ను.పెద్ద గుళ్ళోకెళుతే చెప్పులిప్పాలని తెలీనట్లు
.అదే మన మొదటి మాట.మనిద్దరినీ కలిపిన ఆ కృష్ణమ్మనీ,ఆ
శివయ్యనీ ఓ సారి చూడాలని ఉందండీ ."అన్నాను.
"అసలు నీకివన్నీ ఎట్లా గుర్తుంటాయి ?
ఏదో మాట్లాడించాలి కదా అని అడిగాను.ఎప్పుడూ గతం లోనే ఉంటే ఎట్లా?"అన్నారు ఏమండి నవ్వుతూ.
"ఈ మలి వయసులో ఎంతో అందమైన, అద్భుతమైన ఆ
గత అనుభూతులను తలుచుకుంటే ఎంత బాగుటుందో తెలుసా ?" అన్నాను
పరవశంగా .
"సరే సరే.నీకెప్పుడో చెప్పానుగా ఐ ఆం
ఆల్ వేస్ ఎట్ యువర్ సర్వీస్ అని." అన్నారు.
"అట్లాగే అంటారు. ఏమండీ . . . ఏమండీ మనము కూడా మీ 75 వ పుట్టినరోజు ఇలాగే
సెలబ్రేట్ చేసుకుందామా? పిల్లలను కూడా రమ్మందాము
"అన్నాను.
నా తలను మృదువుగా నిమురుతూ" దానికింకా
చాలా టైం ఉంది కదా ,అప్పుడాలోచిద్దాములే.ఐనా
ఎప్పుడూ పాటలు,పువ్వులు, ఊళ్ళు
తిరుగుదాం, పుస్తకాలేనా? కాస్త
నా మాట వినిపించుకోవు ."అన్నారు.
"వింటాను కాని ఇప్పుడు కాదు.కాశీ,
నాగార్జునసాగర్ వెళ్ళాలి ఇంకా ఏమండీ నన్ను హిమాలయాలు తెగ
పిలుస్తున్నాయి.ఓసారి హిమాలయాలకు కూడా వెళ్ళొద్దాము.అవన్నీ అయ్యాక మీరు చెప్పే మాట
వింటాను దానికింకా చాలా సమయము ఉంది."అన్నాను ఏమండీ లాగా అంటూ.
అప్పుడే నా మనసు హిమాలయాలల్లో కి వెళ్ళిపోయింది.
తెల్లని మబ్బులు చేతికి అందేట్టుగా దూది పింజల్లా అలా . .
. అలా. . . తేలిపోతున్నాయి.ఎత్తైన హిమాలయాలు
తెల్లతెల్లగా,చల్లచల్లగా మనసును ఊహలలో
తేలిస్తున్నాయి.అక్కడక్కడ లోయలూ, వాటిల్లో అందమైన పూల తోటలూ
మనోహరము గా ఉన్నాయి.
"హిమగిరి సొగసులూ , మురిపించును మనసులూ"అని పాడుకుంటూ ఏమండి చేయి పట్టుకొని, ఆ హిమాలయాలల్లో అలవోకగా నడిచేస్తూ,"ఏమండీ ఇది
సిమ్లా నా,డార్జిలింగా ?" అని
అడిగాను.
"ఏదైతే నేమి నీ మనసుకు నచ్చే హిమాలయాలు,పద ఎక్కడి దాకా ఎక్కుతావు ? "అన్నారు.
"ఎక్కడికైనా సరే నా మీద మీ ప్రేమనంతా మీ
హృదయం నిండా ,కళ్ళల్లో నింపుకొని నన్ను తీసుకుపోతుంటే రానంటానా?ఎక్కడికైనా వస్తాను.ఎక్కడికి రమ్మన్నా వస్తూనే ఉన్నాను కదా, రానని ఎప్పుడైనా అన్నానా ? మీ వెంటే నేను, మీ అడుగులల్లోనే నా అడుగులు." ఉద్వేగంగా అన్నాను.
"ఆహా" తమాషాగా అన్నారు.
ఆ మంచుపర్వతాలల్లో అలా. . . అలా. . . నడుస్తూ
ఉన్నాము.ఇంతలో ఆ తెల్లని దూదిపింజలు నల్లని కారుమేఘాల్లా కమ్ముకొచ్చేసాయి. నీలాల
గగనం నుంచి ధారాపాతంగా నీళ్ళు కారిపోతున్నాయి.ఎటుచూసినా నీళ్ళే! తెల్లని మంచు, లోయలూ,తోటలూ అన్నీ ఏవీ? నీళ్ళూ. . . నీళ్ళూ. . . నీళ్ళూ
ఏమిటీ ఈ నీళ్ళన్ని ఇలా నా చుట్టూ చేరిపోతున్నాయి.వంటరిగా నీళ్ళ మధ్య లో
నిలబడ్డానేమిటి? గుండె
దడదడ లాడిపోతోంది.కాళ్ళు వణుకుతున్నాయి. నన్ను చిరునవ్వుతో చూస్తూ,మురిపెంగా చేయి పట్టుకొని నడిపిస్తున్న ఏమండీ ఏరీ ?
"ఏమండీ . . . ఏమండీ . . . ఏమండీ"
గట్టి గట్టిగా పిలుస్తున్నాను.
"అమ్మా." మా అమ్మాయి పిలుపు విని
ఉలిక్కిపడి చుట్టూ చూసాను . కాలం ఎప్పుడాగిపోయింది ?ఏమి జరుగుతోంది?నేనేమి చేస్తున్నాను ఎమో!ఏమి
మాట్లాడుతున్నాను ఏమో!ఎవరితో మాట్లాడుతున్నాను ఏమో?ఎక్కడున్నాను?కాశీ వచ్చామట! ఇదేనా కాశీ ? నేను కొన్ని
సంవత్సరాలుగా వద్దామనుకున్నదీ, విశ్వేశ్వరుని దర్షించుకుందామనుకున్నదీ
ఈ కాశీయేనా !టోర్నమెంట్స్ ఐపోయాయా! ఇద్దరమూ వచ్చామా ?
"రా అమ్మా"అన్నాడు మా అబ్బాయి. అబ్బాయి
చేతిలోని సంచీని చూసి,"బేటా ఆ సంచీ
నాకివ్వు.నేను పట్టుకుంటాను.వళ్ళో పెట్టుకోవచ్చో లేదో నాకు తెలీదు.నా ఏమండి చివరి
క్షణం వరకూ నా దగ్గరే ఉండాలి."అన్నాను చిన్నగా వణుకుతూ.
మా అమ్మాయి నన్ను పట్టుకొని పడవ లో
కూర్చోపెడుతూ,"అమ్మా నీకెట్లా ఇష్టమైతే అట్లా
చేయి.ఇతరులకు ఇబ్బంది కలిగించనిది,మన కిష్టమైనది మనము
చేసుకోవచ్చు అనేవారు డాడీ ఎప్పుడూ గుర్తుంది కదా.ఈ సంచీ నీదగ్గర ఉంటే ఎవరికీ ఏ
కష్టమూ లేదు."అని చెపుతూ కూర్చోబెట్టి , ఆ సంచీ నా
చేతికి ఇచ్చింది.
"ఈ సంచీలో రోజూ బయటకు వెళ్ళినఫ్ఫుడు
డాడీ కోసం, ఒక మజ్జిగ సీసా,నాకోసం
ఫ్రూట్ జ్యూస్, బిస్కెట్ పాకెట్, ఒక
పండు పెట్టుకొని తీసుకెళ్ళేదాని."అన్నాను సంచీని నిమురుతూ.
" "ఎప్పుడూ పిల్లలకేనా నూనే రాసి,
నలుగు పెట్టేది? నాకూ రాయొచ్చుగా ?
"పిల్లలవంటే చిన్ని శరీరాలు.మీ వీపు
పదెకరాల పొలం అంతుంటుంది బాబూ .నేను రాయలేను , నాకు చేతులు
నొప్పి పుడుతాయి."
"నూనె రాయమన్నానని కుంకుడుకాయ రసం
కళ్ళల్లో పోస్తున్నావా ? అబ్బా చిన్నగా ."
"అయ్యో సారీ సారీ కళ్ళల్లో పడిందా ?"
"
ఏదీ ఆ పదెకరాల వీపు ? ఈ చేతిలో ఇమిడిపోయిందా? ఏవీ ఆ ప్రేమ నిండిన నయనాలు
ఎక్కడున్నాయి? ఆ
సంచీని గుండెకదుముకున్నాను.
"అమ్మా" అంటూ చేయిచాపాడు.
చుట్టూ చూసాను.నది మధ్యలోకి వచ్చాము. చుట్టూ
నీళ్ళు!మధ్యలో పడవలో మేము!సంచీలో నుంచి ,తెల్లని వస్త్రములో
కట్టి ఉన్న కుండను తీసి, చివరిసారిగా కళ్ళ నిండుగా చూసుకొని,
కళ్ళకద్దుకొని ఇచ్చాను.మా అమ్మాయి తీసుకొని కళ్ళ కద్దుకొని
తమ్ముడికిచ్చింది.వస్త్రము ముడి విప్పి నదిలో వేసి, కుండను
కూడా వదిలాడు.చేతిలోని సంచీని కూడా నదిలో వదిలేసాను.నది మీద ఆ వస్త్రము తేలుకుంటూ
దూరంగా, చాలా ,చాలా దూరంగా సాగిపోతూ..
. కనుమరుగైంది . . .
పడవ వడ్డుకు చేరింది.చెక్కలతో ఉన్న స్టేజ్
మీదకు దిగాము.వెను తిరిగి చూసాను.నా ప్రపంచాన్ని తనలో కలుపుకొని నిశ్చలంగా, గంభీరంగా ఉంది గంగమ్మ!
“పూల రధం లో కొత్త కాపురానికి తీసుకెళ్ళావు.
వంటరిగా నీ చేతిని అందుకొని అంత దూరం
వచ్చినప్పుడు భయపడ్డా,
ఆప్యాయంగా బ్రతిమిలాడే అమ్మలా నువ్వున్నావని
ధైర్యం తెచ్చుకున్నాను.
ఏ పనీ చేతకానప్పుడు నాన్నవై అన్నీ నేర్పావు.
ఆనాటి నుంచి నీ వెనుకే నా అడుగు
నీ వెంటే నా అడుగు
నాదని
వేరే ఏదీ లేనేలేదు.
నా గుండె ఏమండీ ఏమండీ అంటున్న
చప్పుడు వినిపిస్తోందా?
నీ కళ్ళల్లో ప్రేమలు నాకు ప్రకాశానిచ్చాయి,
ఎన్నో మధురానుభూతులను అందించి ,
పూల
పల్లకీ లో ఊరేగించి,
మాటైనా చెప్ప కుండా ,నేను అందుకోలేనంత దూరానికి వెళ్ళిపోయావు
భర్త,హితుడు,స్నేహితుడు,తండ్రి,సోదరుడు,గురువు అన్నీ నీవైన నువ్వు ఇలా హటాత్తుగా మాయమవటం న్యాయమా?
it's not fair
అందమైన, అద్భుతమైన
గతమా నీకు నా కన్నీటి నివాళి.”
పిల్లలిద్దరూ చేరోపక్కన నిలబడి,నా చేతులను పట్టుకొని "పదమ్మా" అన్నారు.
నా అడుగుల దిశ మారింది!
(సాహితి,ప్రతిలిపి,ఫేస్ బుక్ - 4-5-2020)
( దీనితో నా "ఏమండీ కథలు "
పూర్తయ్యాయి.నా ఏమండీ కథలను ప్రచురించిన వివిధ పత్రికల ఎడిటర్ లకు, ఫేస్ బుక్ లోని వివిధ గ్రూప్ ల అడ్మిన్ లకూ,ఆదరించిన
పాఠకులకు ధన్యవాదాలు.
నేనూ-నా ఏమండీ కలిసి రాసుకున్న మా కథలు మాకే
అంకితం.
ఏడాది నుంచీ నా తిక్కనూ,దుఃఖాన్ని భరిస్తున్న నా కుటుంబసభ్యులకు, మితృలకు
ధన్యవాదాలు చెప్పను.వాళ్ళు నన్ను భరించాల్సిందే తప్పదు :) )
3 comments:
చాలారోజుల తర్వాత.. మాలికకు వచ్చాను.. మొదట మీ పోస్ట్ చూడగానే.. ఏం రాసారో మేడం అని నవ్వుతూ చదివాను.. ఏంటండి ఇది..తట్టుకోలేకపోయాను.. మాకే ఇలా ఉంటే మీ పరిస్థితి...
మీకు ధైర్యం చెప్పటానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు...
ఎప్పటికయినా అందరం పోవలసినవాళ్ళమే.. కాని ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులు అని..మీరు ఆయన తీపిగుర్తు.. .మనసు దిటవు చేసుకోండి..
very sad!తట్టుకోలేనంత భాధ గా వుంది ....కాలము మాత్రమే తీర్చగలదు ఈ గాయాన్ని
మీ హిమాలయాల వర్ణన లో లీనమై చదువుతుంటే కాశీ ప్రయాణం చదివేసరికి అర్ధమయింది, మీరు బాధలో ఉన్నారని,కాలం అన్నీ మరిచేలా చేస్తుంది.
Post a Comment