నవ్వుల్
-పువ్వుల్
"నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా "
అని ఏదో ఓ సినిమా పాట.ఎన్ని బాధలూ ఎన్ని కష్టాలూ ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ, పళ్ళికిలిస్తూ ఉండాలన్న మాట.చెప్పటానికేమిటి ఎన్ని మాటలైనా
చెప్పొచ్చు.ఎప్పుడూ నవ్వుతూ ఉంటే బుగ్గలు నొప్పెట్టవూ!అదెంత కష్టం! కానీ నవ్వుతూ
విషం ఇచ్చినా పుచ్చుకుంటారట.కత్తితో పొడిచినా హిహి హోహో అని నవ్వుతూ ఉంటారట.అందుకే
మనమూ ఓ ప్రయత్నం చేస్తే పోలే.బాబోయ్ విషం ఇవ్వటమూ,కత్తి తో
పొడవటమూ కాదు.నో అపార్ధాల్ ప్లీజ్.ఎల్ల వేళలా పకపకా నవ్వుతూ ఉండటం అన్నమాట.
ఎప్పుడూ
నవ్వుతూ ఉండాలి అంటే మా ఏమండీగారి పార్క్ వాకింగ్ ఫ్రెండ్ నవ్వుల్రావ్ (ఆయన అసలు
పేరేమిటో నాకు తెలీదు.నేను మటుకు నవ్వుల్రావ్ అని పెట్టుకున్నాను),అందరూ పార్క్ లోకి వచ్చి
వాకింగ్ మొదలుపెట్టే ముందు హహా అని నోరు తెరిచి పెద్దగా నవ్వాలి అంటారుట.ఆయన మాట
తీసేయలేక పాపం అందరూ వచ్చాక ఒకేసారి హాహా అని పెద్దగా,కాలినీ
లో పిల్లాజెల్లా అంతా దడుచుకునేట్టుగా వికటాట్టహాసం చేస్తారు.అంతే కాదు ఆయన ఎక్కడ
కనిపించినా నవ్వులతో అభివాదం చేయాలి.పొద్దున్నే మేమిద్దరమూ తీరికగా బాల్కనీలో
కూర్చొని కాఫీ తాగుతూ,కబుర్లు చెప్పుకుంటూ ఉంటామా అల్లంత
దూరాన ఆయన కనిపించగానే "ఏమండోయ్ మీ నవ్వుల్రావ్ వస్తున్నారు."అని చెప్పి
లోపలికి పారిపోయి గట్టిగా చెవులు మూసుకుంటాను.వాళ్ళిద్దరూ వికటాట్టహాసాలతో హలోలు
చెప్పుకున్నాక అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాను.నవ్వులంటే అలా నవ్వాలన్నమాట!
మరీ
అంతలా కాకపోయినా కాస్తైనా నవ్వుతూ ఉంటే మన మొహాలు కాస్త చూడబుల్ గా ఉంటాయి.మరి
నవ్వు మొహం తో ఉండటం అన్నది అదృష్టమైనా మన ప్రయత్నం మనం చేయాలిగా :) అందుకే
హాస్యకథలు, జోక్
లూ , కార్టూన్ లూ చదువుతూ ఉండాలి.అవి గుర్తొచ్చినప్పుడు
అప్రయత్నంగా నవ్వు రావాలి.అదో అలాంటి కథలూ ,కార్టూన్ లూ
ప్రముఖ కార్టూనిస్ట్ సరసి గారి పుస్తకాలల్లో కోకొల్లలు.సరసిగారి గురించి ప్రత్యేకం
గా చెప్పలిసింది ఏముంది అందరికీ తెలిసినవారే.సరసి గారి కార్టూన్ రాని పత్రిక ,పేపర్ లేదంటే అతిశయోక్తి కాదుకదా.ఈ మధ్య ఓ గ్రూప్ లో సరసి గారు కొద్దిగా
పరిచయం అయ్యారు.గ్రూప్ లో,ఆయన కార్టూన్ల తో రోజూ నవ్వులు
పువ్వులు చల్లుతుంటారు.వెంటనే మొహమాటం లేకుండా నాకు మీ బుక్స్ కావాలండి ఎక్కడ
దొరుకుతాయి అని అడిగాను.ఎక్కడో ఎందుకండి మీ అడ్రస్ ఇవ్వండి, నేను
పంపిస్తాను అన్నారు.బొలెడు సంతోషం వేసింది.అమ్మయ్య వెతుక్కోకుండా ఇంటికే పోస్ట్ లో
పంపుతానన్నారు అని సంబరపడిపోయి, మళ్ళీ ఎక్కడ మనసు
మార్చుకుంటారో అని వెంటనే నా అడ్రస్ ఇచ్చాను.తిరుగు టపాలో పుస్తకాలు వచ్చేసాయి.ఇక
నవ్వులే నవ్వులు. నేను ఒక్క దాన్నే నవ్వుకుంటే బాగోదని రోజూ అందరికీ గుడ్
మార్నింగ్ కో కార్టూన్, గుడ్ నైట్ కో కార్టూన్ మీ అందరికీ
కూడా పంచుదామని సరదా పడిపోయాను."ఎప్పుడో ఏదో ఒకటి తప్ప అన్నీ వడ్డించేస్తాను
అంటే కాపీ రైట్ ఉంది తస్మాత్ జాగ్రత్త!" అన్నారు సరసి గారు.ఇకేం చేయను నాలో
నేనే చదువుకొని నవ్వుకుంటాను. కానీ,నేను అన్ని
కార్టూన్స్ షేర్ చేయలేను కాని ఓ కాంప్లిమెంటరీ మటుకు ఇవ్వగలను :) మరి మీరూ నవ్వుల జల్లులల్లో
తడవాలంటే ఈ పుస్తకాలు కొనుక్కోవాల్సిందే! మేము నవ్వము అని మూతి బిగుంచుకునే
దురదృష్టవంతులూ, బంగారం ,డైమండ్ దంతాలు ఉన్నవారు తప్ప మిగితా అందరూ
కడుపారా, నోరారా నవ్వుకోండి.
అక్కడో
ఇక్కడో వెతుక్కోనవసరం లేదు.ఆయనకే ఫోన్ చేస్తే పోస్ట్ ఖర్చులు ఆయనే పెట్టుకొని , ప్రముఖ ఆరుగురి
కార్టూనిస్ట్ ల సంకలనం " కా6టూనిస్టులు"కాంప్లిమెంటరీ
కాపీ తో సహా సరసిగారి ఐదు పుస్తకాలు పంపుతారు.ధర ఎక్కువేమీ లేదు.ఐదు పుస్తకాలూ
కలిపి 540rs/మాత్రమే .
సరసి
గారు అడగగానే మీ అమూలయ్మైన పుస్తకాలు పంపినందుకు ధన్యవాదాలండి.
#నవ్వులనజరానా
No comments:
Post a Comment