ఇంటింటికొక
పూవు
కథల
సంపుటి
రచన; జి.యస్.లక్ష్మి
"జానకి రాం ,సుగుణ లది ఇద్దరు కూతుళ్ళు రమ సుమ ల తో
ముచ్చటైన సంసారం. జానకి రాం తండ్రి కట్టించిన రెండు గదులకీ మరో రెండు గదులు
కలుపుకొని ఆ పాత ఇంట్లోనే గుట్టుగా బతికేస్తున్న వారికి ఊహించని సంఘటన , ఎనిమిది సంవత్సరాల తరువాత సుగుణ మళ్ళీ తల్లి కాబోతోంది.ఇద్దరాడపిల్లల
తరువాత మొగపిల్లవాడు పుడతాడేమో నని ఆశ పడ్డ వారికి , స్కానింగ్
లో ఆడపిల్ల అని తెలుస్తుంది.మూడో ఆడపిల్లను కూడా పెంచగలమా అని మధనపడి అబార్షన్
చేయించుకోవాలని నిర్ణయించుకుంటారు. అదే సమయం లో పక్కింట్లో ఉన్న పార్వతీశం స్థలము ,
తమ స్థలము కలిపి అపార్ట్మెంట్స్ కట్టేందుకు గోల్డెన్ హోంస్ వాళ్ళు
అడుగుతారు.కొంత డబ్బు,మూడు అపార్ట్మెంట్స్
ఇస్తామంటారు.బిల్డర్ మాట్లాడేందుకు వస్తున్నారని, వారి కోసం
ఎదురుచూస్తూ జానకి రాం టి.వి పెడతాడు.అందులో ప్రభుత్వము రైతుల దగ్గర నుంచి భూమి ని
ఫ్యాక్టరీల కోసం స్వాధీనపరుచుకొని , రైతులకు వేరే చోట ఇళ్ళు
కట్టించి ఇస్తామని, కట్టబోయే ఫ్యాక్టరీ లో ఉద్యోగాలిస్తామని
అంటే , రైతులు భూములు ఇవ్వలేమని బాధపడుతుంటారు.వారిని ఒక
యాంకర్ ఇంటర్వ్యూ చేస్తూ ,ఎవరో శాస్త్రజ్ఞుడిని దీని గురించి
అడుగుతారు.ఇలా పంట పొలాలను స్వాధీనపరుచుకొని ఫ్యాక్టరీలు కలగటం వలన కలిగే నష్టం
ఆయన వివరిస్తాడు.భూమిలేకపోయినా శాస్త్రీయ పద్దతిలో చెట్లు పెంచ వచ్చు కదా అని
యాంకర్ అడిగిన ప్రశ్నకు , "సహజమైన వృక్షానికి కాసిన
పండుకు, బోనసాయి వృక్షానికి కాసిన పండుకు తేడా ఎలాంటిదో ఇదీ
అలాంటిదే, విత్తనం ఎంత ముఖ్యమో క్షేత్రం కూడా అంతే
ముఖ్యం."అంటాడు.అది జానకి రాం మనసులో నాటుకొని "భూమి సరిగ్గా
వినియోగించుకోకపోతే వాతావరణ సమతుల్యత ఎలా పోతుందో అలాగే ఆడపిల్లలని పుట్టకుండా
చేస్తే రేపొద్దున సృష్టే ఆగిపోతుంది కదా " అనుకొని ,ఎలాగో
అలాగ పిల్లలను పెంచుకుందాము ,కాని అబార్షన్ వద్దు
అనుకుంటాడు.తమ ఇంటిని అపార్ట్మెంట్ కు ఇచ్చేందుకు కూడా ఇష్టపడడు."
జి.యస్.లక్ష్మి గారి "ఇంటింటికొక పూవు " కథల సంపుటిలోని టైటిల్ కథ
"ఇంటింటికొక పూవు ." కథ
క్లుప్తంగా . గర్భం లో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే , ఆ గర్భస్థ శిశువును
పుట్టకుండా చిదిమేయటం చాలా కాలం నుంచి మన సమాజానికి పట్టిన చీడ.ఈ శిశుహత్యల ను
ఆపేందుకు ప్రభుత్వము స్కానింగ్ చేయటమును, ఒక వేళ అత్యవసర
పరిస్థితులలో చేయవలసి వచ్చినా పుట్టేది ఆడపిల్లో, మొగపిల్లవాడో
తెలపవద్దని చాలా స్ట్రిక్ట్ గా రూల్ పాస్ చేసింది.ఐయినా ఆపటము కష్టంగానే ఉంది.ఈ
మధ్య కాలం లో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతోందని , దీని వలన
సమాజానికి ముప్పు ఏర్పడుతోందని మేధావులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపధ్యం లో ఈ విషయము
మీద చాలా కథలు, కవితలు, సినిమాలు కూడా
వచ్చాయి, వస్తున్నాయి.
మరి
ఇన్ని వస్తున్నప్పుడు నేను ఈ కథ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటం ఎందుకంటే, రచయిత్రి ఈ కథను నడిపిన
విధానము నాకు నచ్చింది.పెద్ద పెద్ద ఉపన్యాసాలు, భారీ
డైలాగులు , భీకరమైన సన్నివేశాలూ లేకుండా ఒక చిరుద్యోగి
కుటుంబ నేపధ్యంలో కథ సాగుతుంది.భార్యా భర్త ల ఆలోచనలు, వారి
ఇబ్బందుల గురించి చాలా సున్నితంగా వివరించారు రచయిత్రి."విత్తనం ఎంత ముఖ్యమో
క్షేత్రం అంత ముఖ్యమే .ఇలా ఆడపిల్లల్ని ఇంకా పుట్టకుండా చంపేయడం వల్ల మనం
భావితరానికి కావలసిన క్షేత్రన్నే నాశనం చేస్తున్నట్లుంది .భూమి మీద కాని, మనిషి లో కాని అసలు మొలకనేదే రాకుండా సిమెంట్, కాంక్రీట్తో
కప్పేస్త్తున్నామేమో అని పిస్తోంది." అని జానకి రాం తోనూ, "ఆడపిల్ల అమ్మ
అవకపోతే ఈ సృష్టే లేదనీ, అంత పవిత్ర కార్యం చేపట్టే గొప్పతనం
కేవలం ఆడవారిలోనే ఉందనీ నాకిప్పుడు అర్ధమైందండీ. అందుకే మనం కనీస ఖర్చులు
తగ్గించుకొనైనా సరే నేను ఈ అడపిల్లను కనాలనుకుంటున్నానండీ".అని సుగుణ తో చెప్పించిన
మాటలు ఎంతో అర్ధవంతంగా ఉన్నాయి.ఈ కథలో ఆడపిల్లకు , క్షేత్రానికీ
పోలిక చెప్పి , రెండూ మానవ మనుగడకు ఎంత అవసరమో చెప్పటం బాగుంది. మంచి సందేశాన్ని , మంచి కథ తో అందించారు రచయిత్రి.
"నిజ జీవితంలో జరిగే సంఘటనలకే కాస్త కల్పన జోడించి, చదివేవారిలో
ఉత్సుకతను పెంచేలా రాసేదే కథ.కథ చదివాక పాఠకుడు కాసేపు దాని గురించి ఆలోచించినపుడే
అది మంచి కథ అవుతుంది.అటువంటి కథలే పత్రికలలో ప్రచురించబడి లక్షలాది పాఠకుల
మన్ననలను పొందుతాయి.సాధారణంగా మనిషి మనసులోనూ,పరిసరాలలోనూ
అతనికి అంతుపట్టని సమస్యలు ఎన్నో ఉంటాయి.కొన్ని సమస్యలను వింటున్నా ,చూస్తున్నా మనసు కలత పడుతుంది.కలతపడిన మనసులోచి వచ్చిన కదలికే కథ
అవుతుంది. ఆ కదలిక మరో మనసును కదిలించినప్పుడే ఆ కథకు సార్ధకత.అటువంటి కథల
సమాహారమే ఈ "ఇంటింటికొక పూవు."" అని తన మాట గా రచయిత్రి చెప్పారు.
అందులోని ఒక అందమైన పూవును మీకు పరిచయము చేసాను.ఇటువంటి పూవులు ఇంకో పన్నెండు
ఉన్నాయి. మిగితావి మీరు చదివేయండి.
రచయిత్రి
తో నేరుగా తమ భావాలను పంచుకోవాలంటే రచయిత్రి జి.యస్.లక్ష్మి గారి సెల్ నంబర్;990 864 8068
e mail;
slalita199@gmail.com
ఈ
పుస్తకము అన్ని పుస్తకాల షాప్స్ లల్లో దొరుకుతుంది.ధర;130 rs/ , u.s$9.99
(అవిర్భవ పక్షపత్రిక -1-11-2019)
No comments:
Post a Comment