తిండి
గోల
ఏమండి
మా పెళ్ళైన పదిరోజులకే లీవ్ ఐపోయిందని ,
నన్ను వాళ్ళ అమ్మ దగ్గర వంట నేర్చుకోమని వదిలేసి పటియాలా
వెళ్ళారు.మూడు నెలల తరువాత లీవ్ లో వచ్చారు.అప్పటికి నేను మా అత్తగారి దగ్గర
కొద్దోగొప్పో వంట నేర్చుకున్నాను.ఆ వంటలు చాలా ఉత్సాహంగా ఏమండీగారికి వండిపెడుతూ
సంతోష పడిపోతున్న సమయంలో ఓ రోజు అకస్మాత్తుగా బ్రేక్ ఫాస్ట్ రోజూ ఉప్మాయేనా ,
మనకు అక్కడ రవ్వ దొరకదు
ఇంకోటి చూపిస్తాను రా అని వంట ఇంట్లోకి తీసుకెళ్ళారు.అప్పటికే మా
అత్తగారికి ఏవో ఇన్ష్ట్రక్షన్స్ ఇచ్చినట్లున్నారు ఆవిడ చేసిన వంటంతా భోజనాల గదిలో
పెట్టేసి బయటకు వెళ్ళిపోయారు.ఏమండీగారి సూచనల ప్రకారం, ఒక
చిన్న గిన్నె, పెనం,అట్లకాడ,ఓ ఫోర్క్, నెయ్యి అన్నీ తీసాను. ఇంతలో మా పనబ్బాయి
నారాయణ కొన్ని ఎగ్గ్స్ తెచ్చి ఇచ్చి వెళ్ళాడు.అవి చూపిస్తూ ఇవి ఇట్లా పట్టుకొని
ఫోర్క్ తో చిన్నగా పగల గొట్టి ఈ గిన్నెలో వేయి అన్నారు."ఏమిటీ ఈ కోడి గుడూ
పట్టుకొని ,పగలగొట్టాలా ?యాక్ థూ"
అన్నాను.కాని ఆయనను చూస్తూ ఇంకేమీ మాట్లాడలేక దానిని మునివేళ్ళతో పట్టుకొని
కొటాను.అంతే అది మహా ఫోర్స్ గా పగిలిపోయి ,నా చేతిలో నుంచి
జారి కిందపడి నానాయాగి చేసేసింది.నేను బిత్తరపోయి నిలబడ్డాను.ఆయన ఇంకేమీ అనక ఇంకో
ఎగ్ తీసి తనే పగలగొట్టి గిన్నెలో వేసి బీట్ చేసారు.ఆ తరువాత పెనం స్టవ్ మీద పెట్టి
ఆంలెట్ చేయటం ( నాతో చేయించటం) చాలా పెద్ద ప్రహసనం ఐపోయింది.చివరకు ఎలాగో చేసి
ప్లేట్ లో వేసి తిను అన్నారు.నేనా ? ఉమ్హూ తినను గాక తినను
అని మొండికేసాను."మనం వెళ్ళాక కొన్ని రోజులు మెస్ లో ఉండాల్సి వస్తుంది.అక్కడ
మనలను వండుకోనీయరు.బ్రేక్ ఫాస్ట్ ఎగ్ నే ఉంటుంది.నువ్వు ఎంత తినగలుగుతే అంతే తిను,
మిగిలింది నేను తింటాను."అని నచ్చ చెప్పేందుకు ప్రయత్నం
చేసారు.నేను ముక్కు మూసుకొని అటు పరిగెట్టి, ఇటుతిరిగి చాలా
విన్యాసాలు చేసాను.ఇక ఆయన ఓర్పు నశించి, నీ ఖర్మ నువ్వు ఎగ్
తినేదాక నిన్ను తీసుకెళ్ళను ఇక్కడే ఉండు అని ఆ ఆంలెట్ ప్లేట్ సింక్ లోకి విసిరి
కొట్టి కోపంగా వెళ్ళిపోయారు.
ఏను
ఏమి చేయాలో తోచక ఆట్లా నిలబడిపోయాను."ఏం జరిగిందే వాడట్లా కోపం గా
వెళ్ళిపోయాడు"అంటూ లోపలికి వచ్చిన అత్తయ్యగారు,వంటింటి నిడా, గట్టుమీద,స్టవ్ మీద పడిపోయి ఉన్న ఎగ్ సొన, ఆంలెట్ , ప్లేట్ ముక్కలు అన్నీ చూసి వెనక్కి వెళ్ళి ముందు అదంతా బాగుచేయి అని
చెప్పి బయటకెళ్ళిపోయారు.నేను ఏడ్చుకుంటూ అంతా శుభ్రం చేసి వాసన రాకుండా ఫినాయిల్
వేసి కడిగి, స్నానం చేసి వచ్చేసరికి అత్తయ్యగారు వరండాలో
కూర్చొని ఉన్నారు.ఏమండీగారు కనిపించలేదు.అప్పుడు అసలేమైంది వాడెక్కడికెళ్ళాడు అని
అడిగారు.ఇక అంతే ఆవిడను గట్టిగా పట్టేసుకొని భోర్మని ఏడ్చుకుంటూ ఆయన నన్ను వదిలేసి
పటియాలా వెళ్ళిపోయారు ఇంక రారు అని ఏడ్చేసాను.ఆవిడ ముందు గాభరా పడ్డా
వాడెక్కడికెళుతాడు ఏడవకు అని సముదాయించారు కాని నా ఏడుపు ఆగలేదు.సాయంకాలం ఎప్పుడో
ఇంటికి వచ్చారు.మా మామగారు ఆయనని చూడగానే "చెప్పా పెట్టకుండా
ఎక్కడికెళ్ళావురా?అది పొద్దటి నుంచి అన్నం కూడా తినలేదు.ఒకటే
ఏడుస్తోంది."అన్నారు.ఆయన మాట్లాకుండా బాత్ రూం లోకి వెళ్ళిపోయారు.నా వైపు
కూడా చూడలేదు.నాకు ఇంకా దుఃఖం పొరలుకొచ్చేసింది.వెంటనే మా ఆడపడుచు దగ్గర పెన్ ,
పేపర్ అడిగి తీసుకొని దొడ్లోకి వెళ్ళి, "మహారాజశ్రీ
ప్రియమైన శ్రీవారి పాదపద్మములకు నమస్కరించి వ్రాయునది" అని మొదలు పెట్టి ఓ
నాలుగు పేజీలు ఉత్తరం నేను ఇక ముందు ఆయన చెప్పినట్లే వింటానని,నన్ను వదిలి వెళ్ళ వద్దని ఏడ్చుకుంటూ రసి ఆయన బట్టల దగ్గర పెట్టాను. మనలో
మన మాట ఆంలెట్ తింటానని పొరపాటున కూడా రాయలేదు.ఇంకోటి కూడా నాకు అర్ధం కాలేదు
సినిమాల్లో హీరోయిన్ ఏడుస్తూ ఉత్తరం రాస్తే ఆమె కన్నీళ్ళు అక్కడక్కడా ఉత్తరం మీద
పడుతాయి కదా, అదేమిటో నేనెంత ఏడ్చినా ఒక్క బొట్టు కూడా
రాలేదు.నాకు కాస్త జెనరల్ నాలెడ్జ్ రావాలని మా మామగారు నన్ను కొన్ని సినిమాలకు
తీసుకెళ్ళారులెండి.ఆయన జీవితం లో సినిమా చూడటము అదే ఫస్ట్ లాస్ట్ అట.అందరూ తెగ
ఆశ్చర్యపోయారు ఆయనేమిటి కోడలిని సినిమా కు తీసుకుపోవటం ఏమిటి అని.మరేం చేస్తారు
పాపం నేను మా అత్తగారికి మామగారికి బాగా నచ్చానుట.మా ఏమండీ గారు చిన్నపిల్లలా ఉంది
పెళ్ళిచూపుల్లోనే వంటరాదని చెప్పేసింది అని గునుస్తుంటే చిన్నపిల్లైతే చెప్పినమాట
వింటుంది నీకెందుకు మేము అన్ని నేర్పించి పంపుతాము అని ఆయనకు ప్రామిస్ చేసి ,ఆయనకూ నా పెద్దజడ నచ్చి చేసుకున్నారుట.సో ఇప్పుడు తెలిసిందిగా ఆ ఉత్తరం
సినిమా పైత్యమని.మామాగారి పుణ్యమా అని అంత జెనెరల్ నాలెడ్జ్ వచ్చేసింది మరి.సరే ఇక
ఉత్తరం సంగతికొస్తే నేను బెడ్ రూం లో చాలా టెన్షన్ గా కూర్చొని ఉన్నాను.ఆయన ఆ
ఉత్తరం చదివారో లేదో తెలీదు.నేను చూస్తే అక్కడైతే లేదు మరి.మరునాడు ఆయన బట్టలు
ఉతకటానికి వేస్తుంటే పైజామా జేబ్ లో కనిపించింది.కాని దాని గురించి ఎప్పుడూ ఏమీ
అనలేదు కాకపోతే పిచ్చిపోరి అని నవ్వుకొని ఉంటారని ఇప్పుడనిపిస్తోంది.
ఆ
తరువాత ఎప్పుడూ ఆంలెట్ తినమని అనలేదు నేనూ తినేందుకు ప్రయత్నం చేయలేదు కాని
తినకపోవటం వలన కొన్ని సార్లు ఇబ్బందైతే పడ్డాను. నేను తినకపోయినా ఏమండీ కోసం
ఆంలెట్, ఎగ్
కర్రీ,బుజియా వగైరా,పిల్లల కోసం కేక్
చేయటం నేర్చుకున్నాను.ఎగ్ భుజియా, రెండూ ఏడి వేడి ఫుల్కాలు
ఏమండీగారి ఫేవరేట్ డిన్నర్..చాలా ఏళ్ళ తరువాత మేము బరోడా పొస్టింగ్ మీద
వెళ్ళినప్పుడు,వెళ్ళిన రోజు ఉదయమే అక్కడ ఆయన ఫ్రెండ్ రమేష్
పార్లీకర్ వాళ్ళ ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు పిలిచారు.నేను ఫ్రెష్ ఐ వచ్చేసరికి అందరూ
డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ఉన్నారు.అందరి ప్లేట్ లల్లో ఆంలెట్, కార్న్ ఫ్లాక్స్ , బ్రెడ్ టోస్ట్ పెట్టి ఉన్నాయి.
నాకు ఒక్క నిమిషం ఏమి చేయాలో తోచలేదు.పెళ్ళైన కొత్తల్లోని ప్రహసనం
గుర్తొచ్చింది.మాట్లాడకుండా తల వంచుకొని మధ్య మధ్య నీళ్ళు తాగుతూ ఎట్లా గో
తింటున్నాను.ఇంతలో కల్పనా పార్లీకర్ వంట ఇంట్లో నుంచి వస్తూ నన్ను చూసి
"ప్రభాత్ మాల ఆంలెట్ తినదన్నావు.ఇప్పుడే బాయీ కి చెప్పి వస్తున్నాను చపాతి
చేయమని , తింటోంది గా " అంది.ఏమండీ "అవును నేనూ
అదే చూస్తున్నాను."అన్నారు ఆశ్చర్యంగా.
యాభై
సంవత్సరాల క్రితమే నేను ఏమండీకి మాట ఇచ్చాను ఆయన చెప్పినట్లే వింటానని.ఆయనా నాకు
మాట ఇచ్చారు నన్ను వదిలి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళనని ఎక్కడికెళ్ళినా వెంట
తీసుకెళుతాని. మరి ఇప్పుడు ఎందుకు నాకు మాటమాత్రమైనా చెప్పకుండా , నన్ను తీసుకెళ్ళ కుండా,నేనిచ్చిన కాఫీ తాగి, పేపర్ చదువుకొని మరీ నన్ను
మాయపుచ్చి ఎక్కడికో ఎందుకు మాయమైపోయారు.యోగా చేస్తున్నారనుకున్నాను కాని యోగ
నిద్రలోకే వెళ్ళిపోయారని తెలుసుకోలేకపోయాను.ఎప్పుడూ వెంట తీసుకెళ్ళేవారు ఇప్పుడు
మాత్రం నన్ను రమ్మంటే నేను రానన్నా అని కలలో నైనా అడుగుదామంటే కలలో కూడా
కనిపించరెందుకు ?
14 comments:
మాల గారు! మీర్రాసిన ఆఖరి పేరా అర్థం ఏంటండి? I hope all is well with you.
లలితగారు,
ఏమని చెప్పాలండి :( మే 22 న ఉదయం లేచి, కాఫీ తాగి, పేపర్ చదివి, నేను లోపలికి వెళ్ళి వచ్చిన పదినిమిషాలల్లో మా ఏమండీగారు యోగా చేసేందుకు యోగా బెడ్ మీద పడుకొని ,యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు.నేను బయటకు వచ్చి చూసి, రిలాక్స్ గా పడుకొని ఉంటే ప్రాణాయామం చేస్తున్నారు అనుకున్నాను కాని ప్రాణమే వదిలేసారు అని తెలుస్కోవటానికి ఇప్పటికీ నా మనసు నమ్మటం లేదు :( అది ఆయన అదృష్టం, నా దురదృష్టం .
ఓహ్ మై గాడ్!
మాలాకుమార్ గారు! ఆఖరు పేరా చదివేక ఏం రాయాలో తోచటం లేదు.
టేక్ కేర్.
జిలేబి
అమ్మ,
మీకు ధైర్యం, మీ ఎమండీగారికి ఉన్నతగతులు చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
మాల గారు,
ఎలా ఉన్నారు ? ఎక్కడ ఉంటున్నారు ? ఇదివరకటి ఇంట్లోనేనా ? ఏదో తిండిగోల అన్నారు కదా అని తర్వాత చదువుదాంలే అనుకున్నాను. మీకు జరిగిన లోటు పూడ్చలేనిది. ధైర్యంగా ఉండండి.
చాలా విచారకరమైన వార్త. ఇప్పుడే తెలిసింది. మీరు ధైర్యంగా ఉండండి. వారికి ఉత్తమగతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను.
http://bhandarusrinivasarao.blogspot.com/2013/08/blog-post_21.html
చాలా విచారకరమైన వార్త. ఇప్పుడే తెలిసింది. ధైర్యంగా ఉండండి. వారికి సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను.
అనాయాస మరణం .... పుణ్యం చేసుకున్నవారికి లభిస్తుందట. మీ వారు అదృష్టవంతులు.
వారికి సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను 🙏.
తే. దోసపం డెట్లు విడివడు తొడిమ నుండి
య ట్లనాయాసముగ దేహ మందు నుండి
నిర్గమించుట యభిలషణీయ మయ్యు
పరమధన్యాత్ములకు కాక వలను పడునె
తే. అట్టి వారల సాహచర్యమున పండి
వారి గుణమును శాంతము భావనమున
నిలుపు కొనుటయె వారల కొలుచు విధము
వారి ధన్యత్వమున పాలు పంచుకొనగ
తే. కార్యశీలురు మీరు దుఃఖమును దాటి
వారి మధురస్మృతుల నెల్ల పదిలపరుచ
మధురమధురాక్షరంబులౌ కథనములుగ
జగతి నిలుపుట యన్న్దది తగు నివాళి
Sorry to hear that. Hope God will give you strength to overcome the loss of your dear partner.
God bless you Mala.
మీకోసం శ్యామలీయం పద్యాలు పంపితే మీరు కనీసం acknowledge అన్నా చేయలేదు. లక్కరాజు గారి కామెంటునీ పట్టించుకోలేదు.
జిలేబీ గారు , అన్యగామి గారు, సుభ్రమణ్యం గారు ,విన్నకోట నరసింహరావుగారు ధన్యవాదాలండి.
నిహారిక, ప్రస్తుతం నేను పిల్లల దగ్గర యు.యస్ లో ఉన్నానండి.అక్టోబర్ లో వస్తానండి. అదే ఇంట్లో ఉంటాను. థాంక్ యు.
శ్యామలీయం గారు మీ పధ్యాలకు ధన్యవాదాలండి.
లక్కరాజు గారు ధన్యవాదాలండి.
ఆలశ్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి.
ఆనామస్ గారు అది పట్టించుకోకపోవటం కాదండి.అక్టోబర్ మా అమ్మ అకస్మాత్తుగా పోయింది.ఆ షాక్ నుంచి తేరుకోక ముందే మా వారు మాములుగా ఏ జబ్బూలేని మనిషి పొద్దున లేచి కాఫీ తాగి, పేపర్ చదువుకొని, యోగా కోసం ట్రాక్ సూట్ వేసుకొని మరీ వెళ్ళిపోయారు. అది ఇంకా షాక్ .మైండ్ బ్లాంక్ ఐపోయింది.ఎదో ఇట్లా రాసేసుకుంటున్నాను అంతే.మళ్ళీ ఇటు చూడటం లేదు .మీ అందరి సహకారమే నాకు శక్తి నిస్తోంది. గుర్తు చేసి నందుకు ధన్యవాదాలు.
Post a Comment