Tuesday, April 24, 2012

బ్లాగ్ తారలే దిగి వచ్చిన వేళ - బహుమతులే తెచ్చిన వేళ

నిన్నటి నుంచీ జ్యోతి గారు , జ్ఞానప్రసూన గారు ,శ్రీలలిత గారు , ప్లసులలో జ్యోతి గారు, వరూధిని గారు , రమణి గారు మా గెట్ టుగేదర్ గురించి చెప్పిన విశేషాలు వింటున్నారు కదా , ప్లీజ్ ప్లీజ్ నా ముచ్చట్లు కూడా కాస్త విందురూ ! అవును మరి నాకు బోలెడు బహుమతులు వచ్చాయి . అవి చూపించవద్దూ :) అవి చూపించే ముందు మా గెట్ టుగేదర్ గురించి శ్రీలలిత గారు రాసిన కవిత చదవండి . ఆ తరువాత తీరిగ్గ నాకొచ్చిన బహుమతులు చూద్దురుగాని . ముందే చెపుతున్నాను అవి చూసి ఎవరూ కుళ్ళుకోవద్దు :)


మహిళలందరు కలిసి ముదమార జతకూడి
మాటల మూటలు కట్టగ మాల ఇల్లు చేరేరట...
సంతోషం, సంరంభం, సల్లాపాల వెల్లువలై
వేసవిలో వానపాటలు వరదల్లే పొంగేనట...

ఒకరి వంట ఒకరు మెచ్చ
ఒకరి మాట ఒకరు చెప్ప
నీది బాగంటే నీదిబాగంటూ
ఒకరినొకరు మెచ్చుకొనగ
ఎదుటివారిలోని మంచి
ఎదుటివారి గొప్పతనం
ఒకరికొకరు గుర్తించి
ఒకరినొకరు పలుకరించి

జ్యోతి మనకు గురువంట
ప్రసూనయే స్ఫూర్తి యంటూ
స్వాతి, సుజన లనే మామ్మలకు
మరల మరల గుర్తు చేస్తూ..
(ఇక్కడో పిట్ట కథ..సుజ్జి మాలాకి ఫోన్ చేసి "అక్కడందరూ పెద్దవాళ్ళుంటారు..నేనొస్తే బాగుంటుందా?"
అన్నట్టందిట. "ఫరవాలేదు, బాగుంటుంది ర" మ్మని సుజ్జికి చెప్పి, మాలా ఆ విషయం మాతో చెప్పి, సుజ్జిని రమ్మని చెప్పిన ఆవిడ విశాలహృదయాన్ని చూపించుకున్నారు.
కాని మేము మాలా కి అంత పేరు వచ్చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా..అబ్బే..
నేనూ, పి.ఎస్.ఎమ్.లక్ష్మిగారు కలిసి సుజ్జి అన్న ఆమాట పట్టుకుని,
ఒక్కదాన్నీ ఏడి్పిస్తే ఏమైనా అనుకుంటుందని, సుజ్జికి తోడు స్వాతిని కూడా కలిపేసి, అక్కడున్నంతసేపూ వాళ్ళిద్దరినీ మామ్మలని చేసేసి, అలాగే పిలిచేసి, నేనూ లక్ష్మిగారు పేద్ద యూత్ లా ఫీల్ అయిపోయాం.. ఇక్కడ "మామ్మ" అన్నమాట వెనకాల అంత కథ వుందన్నమాట. )

ఆటలలో ముందుంటూ
పాటలతో "సై" అంటూ
ఒకరినొకరు చేయి పట్టి
మున్ముందుకు నడిపిస్తూ

సుజాత కూతురు సంకీర్తన
పెట్టిన పోటీలో ఓడి
సన్న మొగ్గ కళ్ళలోని
సంతోషం గమనించి..

నడుంకట్టి మన మాలే
వేడి వేడి పూరీలు
అప్పటికప్పుడు చేయించి
అందంగా అమరిస్తే

వెనక వెళ్ళి వేలు పెట్టి
అత్తగారి పోజ్ కొట్టి
ఫొటో కావాలన్న స్వాతి , సుజ్జి ల
చిలిపితనం చిరునవ్వులు తెప్పిస్తే...

పూర్ణం బూరెలు నిండుగ తెచ్చిన
అపర అన్నపూర్ణ..
స్వీట్ లివిగో తినమంటూ
ఉమాదేవి, సుజాతలు..

చిప్స్ నమిలి, కోక్ పుచ్చుకోమని
యాత్రాలక్ష్మి హడావిడి..
కేరట్ తురుముతొ మెరుస్తున్నవెన్నలాంటి ఆవడలు
చెప్పకనే చెప్పెనులే వరూధిని గొప్పలు

ఘుమఘుమ లాడిపోతున్న పుదీనా చట్నీ,
కమ్మనైన బజ్జీల ఎంచక్కటి మజ్జిగపులుసు
అందరికీ తెలిసినదే అది షడ్రుచుల ప్రతిభేనని
కావాలా వేరేగా దానికొక ప్రతిభ తెలిపే పట్టీ

నా పులిహోరకు న్యాయం చెయ్యమంటూ
రమణి పెట్టిన గట్టి హుకుం
కొత్తావఘాటెక్కించే స్వాతి ఆవకాయ ,
వేడి పూరీలకు జత కలిసే
శ్రీలలిత చోలే

ఇంకా ఇంకా చాలాచాలా
తిని పెట్టి, తాగి పెట్టి (సోడా కలుపుకోకుండా)
ఆటలాడి అలసిపోయి
పాట పాడి సొక్కి పోయి

వేడి వేడి తేనీటితో
అలసటంత తీర్చుకుని
ఇంటిముఖం పట్టామందరం
తప్పదు కదా ఇంక అంటూ....

అసలు మా ఇంట్లో గెట్ టుగేదర్ కు పిలుపుల కార్యక్రమం లో వరూధిని గారు సాయపడ్డారు . పాపం ఆ విషయంలో ఆవిడే ఎక్కువ కష్టపడ్డారు . ఇహ వచ్చిన వాళ్ళతో పేర్లు చెప్పించే , పరిచయాలేమో లక్ష్మి గారు చేసారు . మరి నేనేమి చేసానంటారో ఇదో ఇవన్నీ అందుకుంటూ బిజీగా వున్నానన్నమాట :)

క్లుప్తంగా ఇవీ మా గెట్ టుగేదర్ విషయాలు .

ఇహ పోతే అందరికనా ముందుగా వచ్చిన జ్ఞానప్రసూనగారు నాకో చక్కటి రామాయణం పుస్తకం బహుమతిగా ఇచ్చారు .అలా వూరికే ఇచ్చేసారనుకుంటున్నారా ? కాదు ఎంచక్క నన్ను ఎలా పొగిడుతూ ఇచ్చారో చూడండి :)

పరిమళము , తెల్లదనము
చల్లదనమూ , కోమలత్వమూ
కలగలిసిన మల్లెపూలవంటి
మాలాగారికి చిక్కని స్నేహముతో
జ్ఞానప్రసూన
అని వ్రాసి మరీ ఇచ్చారు .

అది అలాంటి ఇలాంటి ది కాదు .యస్. ఆర్ . కొల్లూరి గారు , కంప్యూటర్ గ్రాఫిక్ పైంటింగ్స్ వేసి రచించిన అపురూపమైన పేంటింగ్స్ తో వున్నది . దానికి ఇంకో విశేషము కూడా వున్నది . అదేమిటంటే ఈ పుస్తకము అమ్మగా వచ్చిన డబ్బులను బ్లైండ్ స్కూల్ వారికి డొనేషన్ గా ఇస్తారట .

ఇదిగో ఇదే ఆ పుస్తకం ;



జ్ఞానప్రసునగారితోపాటు వచ్చిన శ్రీలలిత గారు గేంస్ అరేంజ్మెంట్ చూసారు . అంటే గిఫ్ట్స్ కొనుకొచ్చారు , తంబోలా సెట్ తెచ్చారన్నమాట .ఇంకా జై శ్రీరాం , జై శ్రీ క్రిష్ణ ఆడించారన్నమాట . అలాగే ఇదిగో , ఇది వారి నాన్నగారు వ్రాసిన పుస్తకం " పిడపర్తి వారు , కథలూ - గాధలు " ని బహుమతిగా ఇచ్చారు .




మండే వేడి , ఫాన్ గాలీ వేడిని ఆపదు . ఏ.సీ ఆపదు . వుడికి వుడికి పోతూ , ఉష్ బుష్ అనుకుంటూ చిరాకు పడే బదులు చక్కని పాటలు వింటూ వుంటే వేడీ గీడీ అన్నీ ఎగిరిపోతాయి . కదా ! అందుకే జ్యోతి గారు చల్ల చల్లగా కూల్ కూల్ గా ఆ పాత మధురాలను డి. వి. డి లో వెయ్యి తెలుగు పాటలు , వెయ్యి హిందీ పాటలు ఓపికగా అప్లోడ్ చేసి ఇచ్చారు .ఎంత గొప్ప ఐవిడియానో కదా !




ఓపక్క చక్కని పాటలూ , ఇంకోపక్క ఓ చక్కటి నవల చదువుతూ వుంటే హబ్బ . . . స్వర్గం ఎంత దూరంలోనో లేదు . మనమే స్వర్గం లో వున్నట్లు అనిపించదూ . ఆ అనుభూతిని పొది ఆనందించమనే సుజాత గారు చూడండి ఎన్ని పుస్తకాలిచ్చారో ! గదిలోనే ఎందుకు చల్లని సాయంకాలం హాయి హాయిగా తోటలో కూర్చోండీ అంటూ , బ్రహ్మకమలం , మల్లె మొక్కలు కూడా ఇచ్చారు తెలుసా !!!!!






సుప్రసిద్ద రచయిత్రి మంథా భానుమతిగారు , ఆవిడ స్వహస్తాలతో ఆటోగ్రాఫ్ చేసి , ఆవిడ నవల ఒకటి , కథలసంపుటి ఒకటి ఇచ్చారు . ఎంత హాపీసో :) మంథా బానుమతి గారు నాకు పాత స్నేహితులే . దాదాపు 20 ఏళ్ళ తరువాత కలుసుకున్నాము . చాలా సంతోషం కలిగింది . సమయం వున్నంతలోనే పాత సంగతులు గుర్తు తెచ్చుకున్నాము .



హేమిటీ ఏదో ఏ మూలనుంచో ఇన్ని పుస్తకాలా అని గొణుగుడు వినిపిస్తోంది . ముందే చెప్పానా కుళ్ళవద్దు అని :) అన్నీ తీరికగా చదివి పరిచయం చేస్తానులెండి .

26 comments:

karthik said...

కుళ్ళుకోవద్దు అని మీరు చెప్పినా, పాటించడం కష్టమండీ :))
అసలు మీరందరూ జనాలను ఏడిపించడానికే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారని ఒక రూమర్ (హిహిహి నేనే spread చేస్తున్నా;-))

Anyway, మీరు మరిన్ని సార్లు ఇలానే కలిసి సరదాగా ఎంజాయ్ చెయ్యాలని, చేస్తారని ఆశిస్తాను..

-కార్తీక్

జ్యోతి said...

మీరే హోస్ట్ కదా. బ్రహ్మాండమైన గెట్ టుగెదర్ ఏర్పాటు చేసారని కుళ్లుకోవడం లేదు. సుజాతగారు నాకు బోల్డు పుస్తకాలు ఇచ్చారు కాని భానుమతిగారి దగ్గర వసూలు చేసుకోవాలి.. ఉమాదేవిగారింట్లో కలుస్తాం కదా..వదుల్తానా...

oddula ravisekhar said...

అదృష్ట వంతులు .అంతా హైదరాబాద్ లో వున్నారు కదా!మీ ప్రయత్నం అభినందనీయం .

SHANKAR.S said...

"అసలు మీరందరూ జనాలను ఏడిపించడానికే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారని ఒక రూమర్ "

రూమర్ ఏంటి కార్తీక్? పచ్చి నిజమైతేనూ.



సుజాత గారు వెళ్లేలోగా ఓ రోజు మేమంతా ఆవిడ దగ్గరున్న పుస్తకాల చోరీకి ప్లాన్ చేస్తున్నాం కార్తీక్. ఆవిడ మమ్మల్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు ఆల్రెడీ మాస్క్ లు కూడా కొనేసుకున్నాం. అలాగే ఓ రోజు జ్యోతి గారి ఇంటి మీద కూడా దాడి చేద్దాం. ఈవిడ దగ్గరకూడా బోలెడన్ని పుస్తకాలు ఉన్నట్టు ఆల్రెడీ మన చంబల్ ఇన్ఫో సెంటర్ నుంచి న్యూస్ వచ్చింది :))

జయ said...

చాలా బాగుంది. ఆ బహుమతులన్నీ నాక్కూడా ఇస్తే...మళ్ళీ ఇచ్చేస్తాలే!

రాజ్యలక్ష్మి.N said...

మాలా కుమార్ గారూ..
మీ గెట్ టు గెదర్ విశేషాలు,మీకొచ్చిన బహుమతులు చాలా బాగున్నాయండీ..
మీరు ఆహ్వానించినా నా Exams కారణంగా రాలేకపోయాను సారీ..
మీరందరూ చెప్పే విశేషాలు విన్న తరవాత అనిపించింది ఒక మంచి అవకాశాన్ని మిస్ అయ్యానని..
ఈ సారి తప్పకుండా వస్తాను.. పిలుస్తారు కదా ఇప్పుడు రాలేదని కోప్పడకుండా :):)

సి.ఉమాదేవి said...

మనసున మల్లెలు పూయించారు మాలగారు!శ్రీలలిత కవిత,చక్కని ఆదివారాన్ని కలకాలం గుర్తుండేలా చేసింది.అలసటలోను మీ సన్నని అరనవ్వే అతిథులకు పరమాన్నం.చక్కగా నిర్వహించారు.థ్యాంక్యూ!

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

బ్లాగ్ తారల సమావేశం అపూర్వం. శ్రీలలితగారి కవిత అమోఘం. మంధా భానుమతి గారి కధలు అద్బుతం. ఆవిడ పరిచయం, స్నేహం కలగడం మీ అదృష్టం. రామయణం మామయ్య సీరియల్ గా వచ్చినపుడు మాకు ఆఖరి భాగం దొరకలేదు. ఆవిడకి ఈ సంగతి రాస్తే ఆభాగం మాకు పోస్టు లో పంపిన సహృదయురాలు..

durgeswara said...

అమ్మా !

మీరందరూ కలసి హనుమత్ రక్షాయాగానికి వచ్చేయకూడదూ ! ఎంచక్కా స్వామినిచూడొచ్చు. వచ్చినవాల్లందరితో మాట్ళాడుకోవచ్చు. పుణ్యం పురుషార్ధం కలసి వస్తాయి

రసజ్ఞ said...

మీరు ఇలాంటి విషయాలన్నీ చెప్పేసి కుళ్ళుకోవద్దు అంటే ఎలా? జ్యోతి గారు నన్ను రమ్మని అడిగినప్పుడు ఇంతమందిని కలవలేకపోతున్నానే అన్న బాధకి ఇంత గొప్ప అవకాశాన్ని జారవిడుచుకున్నానేమో అన్న బాధ ఎక్కువయ్యింది ఇప్పుడు :(

Kottapali said...

సంతోషం. భానుమతి గారి అనంతవాహిని కథల సంపుటి చదివాను. కథలు చాలా బావున్నాయి.

మాలా కుమార్ said...

కార్తీక్ గారు ,

మరీ అలా రూమర్లు ప్రచారం చేయకండి :)

మీ విష్ కు థాంక్స్ అండి .

*జ్యోతిగారు ,
భానుమతి గారిని వదలకండి . మీతోపాటు నేనూ ఇంకొన్ని పుస్తకాలు అడుగుతాను :)

*రవి శేఖర్ గారు ,

అందరమూ హైదరాబాద్ లోనే వుండేది కలవచ్చు అనుకుంటాము కాని కుదరదండి . దాదాపు సంవత్సరం తరువాత ఇప్పుడు కలుసుకున్నాము :)

మాలా కుమార్ said...

శంకర్ గారు ,
మీరు ఇప్పుడు సుజాతగారినిటి కి కన్నంవేసి లాభం లేదనుకుంటానండి . ఆవిడ పుస్తకాలు అందరికీ పంచేసినట్లున్నారు .పైగా మీతో సామానులు పాకింగ్ చేయిస్తారేమో జాగ్రత్త :)

*జయా,
అలాగే ఇస్తాను . చదివి జాగ్రత్తగా వాపసుచేయి :)

*రాజీ గారు ,
మిమ్మలిని మేమూ మిస్ అయ్యామండి . మీకు వీలుకాకపోతే ఏమిచేయగలరు కోపం ఏమీ లేదండి . సుజాత గారు యు.యస్ వెళ్ళిపోతున్నారని మే 6 న ఉమాదేవి గారు వాళ్ళ ఇంట్లో గెట్ టుగేదర్ ఏర్పాటు చేద్దామనుకుంటున్నారు . అప్పటి కి మీఎక్షాంస్ ఐపోయి రాగలనంటే , వివరాలు మీకు మేయిల్ చేస్తాను .

మాలా కుమార్ said...

ఉమాదేవి గారు ,
అంతా మీ అభిమానమండి . థాంక్ యు .

*సూర్యలక్ష్మిగారు ,
అవునండి అన్నీ మీరు చెప్పినంత అద్భుతంగా జరిగాయి . థాంక్ యు .

*దుర్గేశ్వరగారు ,
మీ ఆహ్వానానికి ధన్యవాదాలండి .

మాలా కుమార్ said...

రసజ్ఞ గారు ,
భాధ పడకండి . ఇలా మిసైపోయిన వారందరికోసమే మళ్ళీ మే 6 న ఉమాదేవి గారింట్లో కలుద్దమనుకుంటున్నాము . మెకు వీలైతే వచ్చేయండి . జ్యోతి గారు వివరాలు చెపుతారు .


*నారాయణస్వామి గారు ,
మీ వాఖ్యకు ధన్యవాదాలండి .

మధురవాణి said...

మాలా గారూ,
చాలా అందంగా, ఆనందంగా జరిగిందన్నమాట అతివల సమావేశం.. వంటలూ, ఫోటోలూ ఇప్పటికే చూసాను. సుజ్జీ కొన్ని కబుర్లు చెప్పింది. ఇదిగో ఇప్పుడు మీరు అమూల్యమైన కానుకలు చూపెట్టారు. మాలాంటి వాళ్ళకి వచ్చే భాగ్యం లేకపోయినా కనీసం చూసే భాగ్యం దక్కింది ఈ సారికి.. :))

మాలా కుమార్ said...

మధు,
ఈ సారి నువ్వు ఇండియా వచ్చినప్పుడు సమావేశమేర్పాటు చేసుకుందాము . అప్పుడు నీ అల్లరిని మేమంతా ఎంజాయ్ చేస్తాము :))

psm.lakshmi said...

అవును. ఈమారు బయట దేశాలవారు ఇక్కడికొచ్చేటప్పుడు చెప్పండి.. వీలునుబట్టి సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు.
psmlakshmi

Maitri said...

మాలగారూ ఒకే ఊళ్ళో ఉంటే ఇన్ని లాభాలున్నాయన్నమాట. బాగున్నాయి మీ ముచ్చట్లు.

మాలా కుమార్ said...

లక్ష్మి గారు ,
అవునండి . అలా ఇంకొంతమందిని కలవచ్చు.

క్రిష్ణవేణి గారు ,

ఒకే వూళ్ళో వుంటే బోలెడు లాభాలండి :)
నా ముచ్చట్లు నచ్చినందుకు థాంక్స్ అండి .

Hima bindu said...

హ్మం మాలాంటి ఊరోల్లని కూడా పిలవచ్చు కదండీ ,వచ్చి కాస్త సందడి చేసేవాళ్ళం :-)

మాలా కుమార్ said...

చిన్ని గారు ,
ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం విజయవాడలో తిన్నాను చెరకురసాలు . మళ్ళీ ఇప్పటి వరకు అలాంటివి దొరకలేదు . మీరు తెచ్చిస్తారా చెప్పండి , మీకోసం ప్రత్యేకంగా పార్టీ అరేంజ్ చేస్తాను.చక్కగా సందడి చేద్దురుగాని :)

చెప్పాలంటే...... said...

nenu hyd lo lekundaa chusi elaa party lu pettesukuni bahumatulu tisesukunte ne oppukonu.....baagaa chepparu maalaa gaaru

మాలా కుమార్ said...

మంజు గారు ,
అదేమిటో నండి మన పార్టీలన్నీ మీరుహైదరాబాద్ లో లేనప్పుడే అవుతుంటాయి . అందుకే ఈ సారి మీరు అరేంజ్ చేసేయండి :)

Hima bindu said...

అయ్యొయ్యో !చెరుకురసాలు కావాలంటే అడ్రెస్స్ ఇవ్వండి ఫోన్ నంబర్ సహా యిట్టె పంపెయను !నేను హైదరాబాద్ రాకుండానే వచ్చేస్తాయి .

మాలా కుమార్ said...

చిన్ని గారు ,
మీ అభిమానానికి థాంక్స్ అండి .