Thursday, October 7, 2010

ఆయన మట్టి తింటున్నాడు * * * * *

ఆయన మట్టి తింటున్నాడు * * * * * నేను 10త్ చదువుతున్నప్పుడు, మా క్లాస్ కు, కాకినాడ నుండి, ఓ కొత్తమ్మాయి వచ్చింది. సారు నా పక్కనే కూర్చో బెట్టారు. అలవాటు ప్రకారము నీ పేరేమిటబ్బా అని అడిగాను. పద్మజ అని చెప్పి, “మీ పేరేమిటండీ?” అని అడిగింది. “అదేమిటీ నన్ను మీరు అంటున్నావు” అని అడిగాను. అప్పటికే అమ్మాయిలందరూ నా బెంచ్ దగ్గర చేరి, కుతూహలంగా కొత్తమ్మాయి ని చూస్తున్నారు. ఆ అమ్మాయి గీరగా అందరినీ చూస్తూ, “ఇక్కడ వాళ్ళందరూ అబ్బా , నువ్వు , రావే, పోవే అని వే అంటూ మాట్లాడుతారు. మా వైపు అలా మాట్లాడమండి. ఎవరి తోనైనా మర్యాదగా మీరు, అండి అనే మాట్లాడుతామండి. ఐనా అలా మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతారండి?” అని అడిగింది. ఇదేమిటి ఈ పోరి ఇలా మాట్లాడుతొంది అని అందరమూ చెవులు కొరుక్కున్నాము . ఎవరూ పద్మజ తో స్నేహము గా కూడా వుండలేదు. అవును మరి మమ్మలిని మర్యాద లేనివాళ్ళు అన్న అమ్మాయి తో ఎలా మాట్లాడుతాము? కాని మేమూ మర్యాద కలవాళ్ళమే అని తెలుపుకోవటానికి తనతో అందరమూ “పద్మజ గారండీ” అనే మాట్లాడే వాళ్ళము . అంతే కాదు మా సంస్కారము తెలుపుకోవటానికి, ప్రయత్నము మీద ఓ నెల తిరిగేసరికి మాలో మేము కూడా మీరు, అండి అనే స్టేజ్ కి వచ్చేసాము. మా క్లాస్ లో శకుంతల అందరికన్నా పెద్దది . ఏదో పెళ్ళి చదువు చదువుతోంది. అమ్మాయిలను, అబ్బాయిల ను అందరినీ దబాయించి తన నోట్స్ లు రాయించేది. హోంవర్క్ చేయించేది. అందరిలోకీ రాంబాబు ను మరీ దబాయించి పారేసేది . రాంబాబు కూ ఏమీ అనలేని పరిస్తితి . వాడు సారీ, రాంబాబుగారు, శకుంతల ఇంటి పక్కనే వుండే వారు. ఆయనగారి చిన్నప్పటి నుండీ శకుంతలా వాళ్ళింట్లోనే అక్కా అక్కా అంటూ పెరిగాడు. ఓ రోజు శకుంతల “రాంబాబు గారండీ ఈ నోట్స్ రాసి పెట్టండీ” అంది. అంతే రాంబాబు అయోమయం ఐపోయాడు.” ఏంటక్కా ఏమన్నావు?” అని అడిగాడు." అదేనండి అలా నువ్వు అనకూడదు. మీరేమన్నారు అక్కగారండీ అనాలి” అని రాంబాబును ఎడ్యుకేట్ చేసింది. అంతే రాంబాబు గారు తల్లకిందులైపోయి, బెంచీల మీద గెంతి కాసేపు పిచ్చి చేష్టలుచేసారు. రాంబాబు ఒక్కడే కాదు, మా క్లాస్ అబ్బాయిలందరూ ఈ పరిణామానికి తట్టుకోలేక పోయారు. మా శకుంతలక్క ఎవరు నువ్వు అన్నా వూరుకునేది కాదు . మెల్లి మెల్లి గా కాకినాడ అమ్మాయి పుణ్యమా అని , అందరూ గౌరవంగా మాట్లాడటము నేర్చుకున్నారు . ' రా, 'వే' లాంటి పదాలు బొత్తిగా కనిపించకుండా పోయాయి. ఇదంతా చూసి మా సార్ లు ఝాటర్ ఢమాల్! ఆతరువాత , పద్మా నేనూబెస్ట్ ఫ్రెండ్స్ మి అయ్యాము. తన మూలం గానే ఇప్పటికీ ఎంత చిన్నవాళ్ళైనా మొదటి పరిచయములో నువ్వు అనలేను. నాకు అలా 10త్ నుండే చిన్నా పెద్దా అందరినీ మీరు అనటము అలావాటైందా, మా పిల్లలకు, మా మనవరాళ్ళకు, ఎదుటివారిని అలా గౌరవించి మాట్లాడటము నేర్పటము లో నాకేమీ ఇబ్బందులు ఎదురుకాలేదు. కాకపోతే చాలా ఏళ్ళు మా అబ్బాయి , 'మాలా మమ్మీ ' , 'ఏమండి డాడీ 'అని పిలిచేవాడు. విన్నవాళ్ళు నీకెంత మంది మమ్మీలూ, డాడీలున్నారురా అని వెక్కిరించేవారు. పైగా వాడితో పాటు వాడి ఫ్రెండ్స్ అందరూ మాలా మమ్మీ, ఏమండీ డాడీ అని పిలుస్తుంటే మానిపించలేక తల ప్రాణం తోకకొచ్చింది. వాడు మటుకూ ఇప్పటికీ అప్పుడప్పుడూ ముద్దుగా మాలా మమ్మీ, ఏమండీ డాడీ అనే అంటాడు! కాని మా బుడుగులున్నారు చూశారూ వాళ్ళతోటే బోలెడు తిప్పలు! మా విక్కీ కి సంవత్సరము లోపలే మాట్లాడటము వచ్చేసింది. (రోజంతా నువ్వు వాడిని వాగిస్తావు అందుకే అన్ని మాట్లొచ్చాయి అని మా అమ్మాయి అనేది.) ఓరోజు నేను ఏదో పని లో వున్నప్పుడు “అమ్మమ్మా వాడు నన్ను తీసుకెళుతాడట” అన్నాడు. “ఎవడ్రా వాడు” అన్నాను నేను. వెంటనే పక్కనుంచి “నేనాంటీ “ అన్నాడు మా అల్లుడు. వెంటనే నాలిక్కరుచుకొని, తల కొట్టుకొని, మా అల్లుడి కి బోలెడు సారీ లు చెప్పాను. మా అల్లుడుగారు ఏమనుకున్నారో అని చాలా రోజులు తెగ ఫీలైపోయాను. ఆ తరువాత విక్కీ కి, అలా పెద్దవాళ్ళను వాడు అనకూడదు అని చెప్పాను. మరేమనాలి అన్నాడు. “డాడీ తీసుకెళుతానన్నారు” అనాలి అని చెప్పాను. అలాగే అని బుర్ర వూపాడు . “అమ్మమ్మా డాడీ చూడు నన్ను బయటకు తీసుకెళ్ళరట” అని ఓసారి కంప్లైంట్ చేశాడు. డాడీ ఎక్కడున్నారు రా అంటే మా ఏమండీని చూపించాడు. ఆయన తాత కదరా అంటే, నువ్వు పెద్దవాళ్ళ గురించి చెప్పేటప్పుడు డాడీ అని చెప్పమన్నావు కదా అన్నాడు . ఉష్ . . . రామచంద్రా ఏం చెప్పను ఈ పిల్లాడి కి? ఏం తోచలేదు. వదిలేసాను! విక్కీ స్కూల్ కు వెళ్ళటము మొదలు పెట్టాక కొత్త ప్రాబ్లంస్ వచ్చాయి. స్కూల్ లో ఎవరినో చూపించి పనమ్మాయి లక్ష్మి తో వాడు అంటూ ఏదో చెప్పాడుట. అతనేమో లక్ష్మిని , విక్కీ ని గుర్రున చూశాడట. అలా రెండు మూడు సార్లు అయ్యాక, లక్ష్మి విక్కి బాబూ అలా వాడూ వీడూ అనకూడదు. ఆయన అనాలి అని కష్టపడి నేర్పించింది. మొత్తానికి మా విక్కీకి ఎదుటి వాళ్ళను గౌరవం గా సంభోదించటము వచ్చింది ఎంత అంటే "అమ్మమ్మా బిచ్చగాడుగారు వచ్చారు అన్నం పెడదామా?"అనేంత! "పాపం పనిమనిషిగారొక్కరే గిన్నెలు ఉతుకుతున్నారు (గాభరా పడకండి తోమటం, ఉతకటం, ఊడవటం కు చాలా రోజులు తేడా తెలీలేదు మా పిల్లలందరికీ పాపం), నేను హెల్ప్ చేయనా" అనేది మా మనవరాలు! అంత మర్యాద నేర్చుకున్నారన్నమాట! అమ్మయ్య అనుకున్నాను. ఇహ చిన్నోడు మా అబ్బాయి కొడుకు ఏమో మా ఏమండీని చాలా రోజుల వరకు ఏమండీ అని పిలిచేవాడు. ఏమండీ ఏమిట్రా తాత అనాలి అంటే నువ్వు ఏమండీ అంటావు కదా అనేవాడు . తాత అనాలి అని నేర్పించాక , బామ్మా నీ ఏమండి నిన్ను పిలుస్తున్నాడు అనో , మీ ఏమండి చూడు అనో మా ఏమండీ గురించి చెప్పేవాడు. నవ్వుకోవటము తప్ప ఏంచేయగలను? నేను చెప్పటము ఇంకా ఐపోలేదండీ బాబూ. అసలు కథ ఇప్పుడే మొదలైంది! " అమ్మమ్మా ఆయన మట్టి తింటున్నాడు" మూడేళ్ళ పెద్దోడు, ఏనిమిది నెలల చిన్నోడు గురించి నాకు చెప్పాడు. బుడి బుడి నడకల తో ఎప్పుడు మెట్లు దిగి వెళ్ళాడో మా చిన్న బుడుగ్గాడు బయట, జామ చెట్టు కింద కూర్చొని మట్టి గుప్పిళ్ళ తో తీసుకొని, వళ్ళంతా పులుముకొని, నోట్లో పెట్టుకుంటూ ఆడుకుంటున్నాడు. అలా వాడిని చూస్తే భలే ముద్దొచ్చి ఎత్తుకోగానే, మా దొరవారు నాకూ కాస్త మట్టి పులిమి, ప్రేమగా తినిపించే ప్రయత్నం చేసారు !!! " బామ్మా , ఆయన నా పి .యస్ . బి తీసుకున్నాడు." " కాదు అమ్మమ్మా ఇది నాదే. ఆయన పి. యస్. బి అత్త దాచి పెట్టింది ." "అమ్మమ్మా ఆయన , నాకు లాప్ టాప్ ఇవ్వటము లేదు." " బామ్మా నేను ఆడుకున్నాక ఆయనకు ఇస్తాను." " ఆయనకు నేను కొత్త గేం చూపిస్తానన్నాను అమ్మమ్మా." ఇలా రోజూ మా మనవళ్ళిద్దరు మాట్లాడుకునే పద్దతి. పొరపాటున కూడా వరేయ్ అని కాని, వాడు అని కాని అనరు. ఎంత పద్దతి గా పెంచాను కదా! ఇదండీ సంగతి. మీరెప్పుడైనా వీకెండ్ లో ఏ ఐమాక్స్ థియేటర్ లోనో , ఏ లుంబినీ పార్క్ లోనో , ఓ తొమ్మిదేళ్ళ , ఆరేళ్ళ అబ్బాయిలు ఆయన, ఆయన అని మాట్లాడుకోవటం వింటే మీరు ఝాటర్ ఢమాల్ అవకండి. వాళ్ళిద్దరూ ఖచ్చితం గా నా మనవళ్ళే అని తెలుసుకోండి. మేమెంత మర్యాదగా మాట్లాడుతామో తెలిసిందిగా * * * * * అదన్నమాట సంగతి !!!!!!!!!!

36 comments:

aavakaaya said...

Apologies for typing telugu in English Mala gaaru. emduko emta try chesina alekhini etc open avvatledu ee poota naaku.

baavumdi.mottaaniki kaakinaaDa pilla meeku emta samskaaram nearpimdO chooDamDi :)

maa abbaayiki oka saari cheppaanu,taatagaaru anaali ani. vaaDu oka rOju oreay taataagaaroo aaDukumdaamu vastaavaa annaaDu :).
ee pillali manamu cheppinadi tu.cha. tappakumDaa
paaTimchaTam lO vacchina kashTaalannamaaTa ivi .

mee manumaDu chakkagaa cheTTu kimda koorchuni maTTi tinea druSyam haayigaa anipimchimdi.emta mamdiki
umdi aa haayi baalyam eerOjullO

sunita said...

hahaha!kamalagaaroo meeku meerae saaTi:-)

రవిచంద్ర said...

భలే ఉన్నాయి మీ మనవళ్ళ ముచ్చట్లు...

శిశిర said...

:)భలే రాశారండి.

కృష్ణప్రియ said...

Sooper! :-)) తెగ నవ్వొచ్చింది ..

పరిమళం said...

ఏమండీ...మాలాగారూ ...మరండీ..మీకోవిషయం చెప్పనాండీ...మాది కూడానండీ...కాకినాడేనండీ :) :)

Anonymous said...

meeru , ayana is not symbol of respect. it is the way of talking of some region people. speaking nuvvu is not a bad way also.

కొత్త పాళీ said...

చదువుతుంటే కళ్ళ ముందు మీ బుడుగులిద్దరూ నిలువెత్తు షేర్వాణీల్లో మునిగిపోతూ "పెహ్లే ఆప్, పెహ్లే ఆప్" అని వంగి వంగి సలాములు చేస్తున్న దృశ్యం కనబడింది!

ఇంటింటి కథల్ని చెప్పడంలో మీరు చక్కని శైలిని రూపొందించుకున్నారు (ఈ మధ్యన కొన్ని మీ తొలిరోజుల టపాలు చదివాను). అభినందనలు. బుడుగు, బుడిగిల విషయాలు, ఇంకా మీ చిన్నప్పటి విషయాలు చాలా రాయండి.

మధురవాణి said...

భలే బాగుంటాయండీ మీరు చెప్పే సరదా కబుర్లు! :) :)

Overwhelmed said...

mi ayana ayana super andi.

సి.ఉమాదేవి said...

Wonderful Mala garu.మీ మనవళ్లకు ఆశీస్సులు.

వేణూశ్రీకాంత్ said...

హ హ చాలా బాగున్నాయండీ మీ మనవళ్ళ కబుర్లు :)

భావన said...

:-) :-)

satya said...

హ...హ...హ చిన్ననాటి కబుర్లు భలే బాగున్నాయండీ మాలగారూ!
"పిన్నీ! పిల్లి గారు మంచమెక్కేసారు" అన్న అక్కయ్య కొడుకూ,
"రామురు" "కృష్నురూ" "దేవురు" తో ఆపకుండా మరింత కంఫ్యూజ్ అయిపోయి "అమ్మా! నీకోసం నేహల్ వాళ్ల అమ్మగాడు వచ్చాడు" అన్న మా అమ్మాయిల బాల్యం గుర్తొచ్చింది.

శ్రీలలిత said...

ఆయ్.. మాది రాజమండ్రండి. మా పొలం నుంచి పాలేరు వస్తే.. నేను మా నాన్నగారికి చెప్పిన మాటకి ఇప్పటికీ అందరూ నవ్వుతారండి..ఆయ్..
"నాన్నగారూ, పాలేరుగారు వచ్చారండి.." అన్నానటండి.
ఎంతైనా మాకు గౌరవాలు ఎక్కువండి.. ఆయ్..

శివరంజని said...

హ..హ..హ...టపా మొదటి నుండి చివరి వరకు చాల నవ్వొచ్చిందండి ... లలిత గారన్నది 100 % కరెక్టండి ఎంతైన గౌరవాలు ఎక్కువండి మాకు

ఇలాగే ఒకసారి మా ఇంటికి beggar వస్తే నేనేమో చెయ్యి ఖాళీ లేదండి అలా వెళ్ళండి అనేసాను... ఇంక మా సౌమ్యా ఒకటే నవ్వు తను హైదరాబాద్ నుండి వచ్చింది ... ఏమిటీ నీకు మరి రెస్పెక్ట్ ఎక్కువనుకుంటాను అని తెగ ఆట పట్టించింది

karlapalem hanumanthaRao said...

మీ postings బాగున్నాయి madam!
ఇవాళే ఎక్కడో చూసాను...the talent of being a writer is 3% and the remaining 97% being not been distracted by Internet-అని.ఈ లెక్కన చూస్తే మీ రచనలు అన్ని తాజాగా వున్నాయి.కొద్దిగా punctuation మీద మరింత ధ్యాస పెడితే మగ్గిన జమ పండు లాగా మరింత రుచికరంగా వుంటాయేమో!
నా రెండు బ్లాగులు చూస్తూ మీ విలువయిన సలహాలు కూడా ఇస్తుందండి!

..nagarjuna.. said...

ఆనందమానందమాయెనే...మాలగారు నాగురించి రాసెనే..లలాల లలాల లాలలా లాల లలాల లలాల లాలలా....

ఈ టపా రాయడానికి మీకు ఐడియా వచ్చేట్లు చేసిన నాకూ, మీ మనుమలు గార్లకు నా ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

:D :D
చాలా బావుంది

మాలా కుమార్ said...

అవాకాయ గారు ,
మీ అబ్బాయి అన్న ఒరేయ్ తాతగారు ఆడుకుందాం వస్తావా అన్నది గుర్తొస్తే చాలండి ఎంత నవ్వస్తోందో !

& సునీత గారు ,
ఇహ నేను సరిలేరు నాకు వేరెవరూ అని పాడుకోవచ్చన్నమాట , హి హి హి .

& రవిచంద్ర ,
మా మనవళ్ళ ముచ్చట్లు మీకు నచ్చినందుకు థాంక్ యు .

మాలా కుమార్ said...

శిశిర ,
థాంక్ యు .
& కృష్ణ ప్రియ గారు ,
సూపరాండి ? థాంక్ యు .

&పరిమళం గారు ,
మీరు కాకినాడ అమ్మాయిగారాండీ ? మరైతే నేను కాకినాడ అమ్మాయి దగ్గర మర్యాదగా సంభోదించటము సరిగ్గా నేర్చుకున్నానాండి ?

మాలా కుమార్ said...

అనోనమస్ గారు ,
మీరు చెప్పింది నిజమేనండి , ఈ పిలుపులు , మర్యాదలు ఒక్కోప్రాంతానికి ఒక్కో రకముగా వుంటాయి . అవి అర్ధం చేసుకోలేక , అపార్ధం చేసుకునే సంధర్బాలే ఎక్కువగా చూసాను , నేను .
థాంక్ యు .

మాలా కుమార్ said...

కొత్తపాళి గారు ,
నన్ను మీరు మెచ్చుకున్నారా ? ఇంటింటి కథలు బాగా రాస్తున్నానా ? వావ్ థాంక్ యూ , హెడ్మాస్టర్ గారూ థాంక్ యు .
మీకు వినే ఓపిక వుండాలేకాని మా బుడిగి , బుడుగు ల కథలు బోలెడు చెప్పగలను .

& మధురవాణి ,
కబుర్లు ,నీకన్నా బాగా చెపుతున్నానా ? థాంక్ యు .

జాబిల్లి గారు ,
:)

మాలా కుమార్ said...

ఉమాదేవి గారు ,
ధన్యవాదాలండి .
& వేణూ శ్రీకాంత్ ,
& భావనా ,
థాంక్ యు .
& సత్య గారు ,
మీరు చెప్పిన ముచ్చట్లు కూడా భలే వున్నాయండి . పిల్లల చిన్నప్పటి ముచ్చట్లు , మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ వుంటే మనసుకు ఎంత హాయిగా వుంటుందోకదా !

మాలా కుమార్ said...

శ్రీలలిత గారాండీ . . .
ఆయ్ ((( మీ మర్యాదల తో మేమెక్కడ తూగగలమండీ ? మీ గౌరవాలు చూస్తుంటే * * * * * మాకు ఇలా నక్షత్రాలు కనిపిస్తాయండీ . . . ఆయ్ . . .

& శివరంజని గారు ,
ఐతే మీరూ శ్రీలలిత గారి టైపేనన్నమాట . మరి చేయి ఖాళీ అయ్యేవరకు బిచ్చగాడి గారి కి కుర్చీ వేసి కూర్చోపెట్టలేదాండీ ? మా అమ్మాయి చిన్నప్పుడు ఓసారి అలా కూర్చోబెట్టింది లెండి .

& కార్లెపాలం హనుమంతరావు గారు ,
మీలాంటి పెద్ద రచయత గారికి , నా రాతలు నచ్చటము నా అదృష్టమండి . మీ సూచన పాటించేందుకు ప్రయత్నిస్తానండి . ధన్యవాదాలు .

మాలా కుమార్ said...

నాగార్జునా ,
అమ్మయ్య వచ్చారా ? లేకపోతే ఓ గిటార్ పట్టుకొని స్టేజ్ మీద ఇంకెన్నాళ్ళు , టింగ్ టింగ్ అని వాయిస్తూ ఎదురుచూడాలా అనుకున్నాను . ఆ భాధ లేకుండా త్వరగా వచ్చేసావు . ఐనా అబ్బాయ్ , వచ్చేటప్పుడు ఆ లింక్ తెవద్దూ ? నీ పేరునుంచి , నీ బ్లాగు కెళ్ళి అక్కడ ఆకామెంట్ల వరదలో ఈదుకుంటూ , నా కామెంటూ , దానికి , అనుకున్నట్లే రౌడీ గారి వెక్కిరింపూ , నీ సమాధానం వెతుక్కునేసరికి ఎంత ఇబ్బంది అయ్యింది ఆయ్ (( . . .
వెటకారం కాదు , నాగార్జునా , చదివావు కదా నా మర్యాద గురించి . ఇక నువ్వు అనేందుకే ప్రయత్నిస్తాను .
థాంక్ యు .

& హరేకృష్ణా ,
థాంక్ యు.

Hemalatha said...

చాలా సరదాగా రాశారు ఈ పోస్టింగ్.:)

మీకు కూడా విజయ దశమి శుభాకాంక్షలు.

హరే కృష్ణ said...

విజయదశమి శుభాకాంక్షలు

వేణూశ్రీకాంత్ said...

విజయదశమి శుభాకాంక్షలు మాల గారు.

శిశిర said...

నా బ్లాగులో శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు మాలగారు. దసరా శుభాకాంక్షలు.

సుభద్ర said...

ha haa ha..bagundi..nijamE naaku yevrni nuvvu ane alavaaTu ledu..may be godavarijillalalone ante nemo!!sare manchi gurthulu chepparu mee manavalni pattukunenduku..

సుభద్ర said...

ha hahaa

మాలా కుమార్ said...

సుభద్రా,
అబ్బో చాలా నవ్వారే , థాంకు .

ఆ.సౌమ్య said...

హ హ హ బావుందండీ, మా ఫ్రెండు కూతురు ఇలాగే "అమ్మా రిక్షావాడు గారు వచ్చారు" అన్నాదిట.

అయితే మీ మనవళ్ళు ఇప్పటికీ ఆయన ఆయన అంటున్నారా...బాగు బాగు, ముచ్చటగా ఉంది వింటుంటే.

సత్య గారూ మీ పిల్లల భాష సూపరండీ :)

ఇది చదివితే నాకింకో విషయం గుర్తొచ్చింది.
న్నా మా అక్క కూతురిని మా నాన్నగారు "చిన్నా" అని పిలిచేవారు. ఒకసారి కాకుండా రెండు సార్లు "చిన్నా చిన్నా" అనేవారు. దానికి కాస్త మాటలొచ్చాక అది మా నన్నగారికి ఆ పేరే పెట్టేసింది. ఇంట్లోకి రాగానే "చిన్నా చిన్నా ఏరి" అని అడిగేది. అలాగే ఇంకో అక్క కూతుర్కి "జక్కల్ జక్కల్" అని వింతగా ఓ పేరు పెట్టారు మా నాన్నాగారు. అదేమో ఆయన్ని "జక్కల్ తాత" చేసేసింది. చిన్నపిల్లల ముచ్చట్లు భలే ఉంటాయందీ చెప్పుకుంటే.

ఆ.సౌమ్య said...

మరో విషయం ఈ గౌరవార్థకాల గురించి సరదాగా...
ఎవరో మునుపు ఉత్తరం రాసి సంతకం చేయాల్సిన చోట "వెంకట్రామయ్య గారు" అని రాసారట. తిరుగు టపాలో "శ్రీ వెంకటరామయ్యగారు గారికి" అని సంబోధిస్తూ ఉత్తరం వచ్చిందిట. :)

మాలా కుమార్ said...

సౌమ్య గారు ,
అలాంటిదే , ఓసారి మావారి కోసం ఎవరో కాల్ చేసారు . నేను లిఫ్ట్ చేస్తే , అమ్మగారాండీ . . . ప్రసాద్ గారుని మాట్లాడుతున్నానండి . . . సార్ గారు ఉన్నారాండీ . . . అని బహు మర్యాదగా అడిగారాయన గారు !!