Tuesday, June 8, 2010

ధఢ్ . . . ధఢ్ . . . ధఢ్ . . . ధఢాల్ . . . .





మావారిని , టిఫిన్ కారియర్ తో సహా పంపించేసి , తలుపేసుకొని , హాయిగా లాప్ టాప్ ముందు సెటిల్ అయ్యాను . సుజ్జి తో కబుర్లు చెప్పుకుంటూ , నేను ఇంతకు ముందు పోస్టు లకు వాఖ్య లిచ్చానో వాటికి ఎవ్వరైనా రిప్లై ఇచ్చారా చూసుకొని , ( ఇంతకు ముందైతే పోస్ట్ లకు వాఖ్య లిచ్చానా అని తెగ ఆలోచించి ఆలోచించి సతమత మైయ్యేదానిని . ఇప్పుడా భాధ లేకుండా హారం వాళ్ళు అన్ని ఒక చోట వచ్చేలా చేసారు . అమ్మయ్యా థాంకూ హారం ) , ఇంకాసిని వాఖ్య లిచ్చేసరికి ఆకలి వేస్తున్నట్లు గా అనుమానం వచ్చింది . సరే ఏదో కాస్త తినొస్తే పనైపోతుంది కదా అని , స్టడీ రూం నుండి బయటకు వచ్చాను . ఇదేమిటీ ?? ఆయనను పంపించి మేన్ డోర్ వేసినట్లు గుర్తే ! తీసివుందేమిటి ? ? ?


ఏమిటో వేసాననుకున్నాను కాని వేయలేదన్నమాట , అనుకొని తలుపు వేసి వంటింట్లోకి నడుస్తుండగా ఫోన్ పిలిచింది . దాని సంగతి చూసొద్దామని అటెళ్ళాను . పనయ్యాక మళ్ళీ ఆకలి గోలెట్టింది . వాకే బాబా తింటున్నాను , అని ఆకలిని బుజ్జగిస్తూ బయటకొస్తే మళ్ళీ మేన్ డోర్ తీసి వుంది . . .


ఏమిటీ వేసాననుకొని మళ్ళీ వేయలేదా ? ? ?

కాని నాకింత మతి మరుపు లేదే ! కొంపదీసి దొంగోడో దూరలేదుకదా !! !

చిన్నగా చప్పుడు కాకుండా అడుగులు వేస్తూ ఇల్లంతా వెతికాను . ఎవ్వరూ లేరు . మరి ఇదేమి మాయ . . . పక్క తలుపు దగ్గరగా వేసి ( దొంగోడో వస్తే తొందరగా బయటకు పరుగెత్తొచ్చని ) , మేన్ డోర్ తలుపు వేసి , సారి బోల్ట్ వేసి పక్కకు తిప్పాను . ఐనా ఏమిటో అంతా అయోమయం అనుకుంటూ అలాగే సోఫా లో కూర్చుండి పోయాను . ఇంతలో ఎవ్వరో తలుపు గట్టిగా కొట్టారు . ఎవరబ్బా అనుకొని వస్తున్నా అంటూ లేచాను .


ఆగకుండా ధడా ధడ్ అని అలా కొడుతారేమిటి అనివిసుక్కుంటూ సోఫాలోనుండి లేస్తూ తలుపు వైపు చూస్తే , తలుపు గట్టిగా వూగుతూ . . . .

బోల్ట్ చిన్నగా పక్కకు తిరుగుతూ . . .

నేను భయం భయం గా చూస్తూ వుండగానే , , ,

బోల్ట్ వూడి పోయి , తలుపు ధఢ . . ధఢ . . . కొట్టుకుంటూ ధఢాల్ మని తెరుచుకుంది .

నిశ్చేస్టురాలినై నిలబడి పోయాను . అర్ధరాత్రి దయ్యాలొస్త్తాయంటారు , కాని మిట్ట మధ్యాహ్నం కూడా వస్తాయా ? ? ? కాళ్ళూ చేతులూ చల్లబడ్డాయి . బుర్ర పని చేయటము లేదు . . .

అలా ఎంత సేపు నిలబడిపోయానో తెలీదు . మా పనమ్మాయి జహీరా లోపలి కొస్తూ క్యా అమ్మా ఐసే ఖడే హోగయే అని అడిగి , తలుపు వేసి , బోల్ట్ పెట్టి , నా జవాబు వినకుండానే లోపలి కెళ్ళింది . నేను ఉసూర్ మంటూ సోఫా లో కూలబడ్డాను . వెంటనే జహీరా బయటకొస్తూ , అమ్మా ఖానా నై ఖాయే క్యా ఆపకా ప్లేట్ నై హై అంటూ ఏదో చెపుతోంది . కాని మాటలు నా చెవిలోకి పోయే లోపలే . . .

ధఢా . . . ధఢ్ . . . ధడా . . . ధఢ్ . . . తలుపు భయంకరంగా వూగి పోతోంది .

బోల్ట్ పక్కకి తిరిగి పోతోంది . . .

నేను అప్రయత్నంగా లేచి నిలబడి , నిలువు గుడ్లేసుకొని చూస్తున్నాను . . . . .

తిరిగింది . . . బోల్ట్ వూడి పోయింది . . .

ధఢ్ . . . ధఢ్ . . . ధఢ్ . . . ధఢాల్ . . . . .

Saturday, June 5, 2010

ముచ్చటగా మూడు కథలు





నేను నా బుక్స్ కొనుకున్నప్పుడల్లా , మా పిల్లల కోసం కూడా కథల పుస్తకాలు కొంటూ వుంటాను . ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు పిల్లలకు కథలు చెప్పుకోవటము ( వాళ్ళు నాకు , నేను వాళ్ళకు ) తప్పనిసరి . ముందుగా కొన్ని బుడుగు కథలు , అందులో కాళిదాసు కవిత్వం కొంత , నా కవిత్వం కొంత కలిపి చెప్పుకున్నాక , వేరే కథలు చెప్పుకుంటామన్న మాట . అందులోని , ముచ్చటగా మూడు కథలు చెపుతాను . ఆలకించండి .

అమ్మ పెట్టేవి రెండు .

ఒకరోజు మా మనవరాలు అదితి అన్నం తినటానికి మారాము చేస్తోంది . అప్పుడు అక్కడ పనిచేసుకుంటున్న , మా పనిమనిషి సుబ్బులు రెండు పీకమ్మా , ఆమే తింటది . మా అమ్మ అంతే చేస్తది అంది . అంతే ఆ పనమ్మాయి పేరుతోనే చిన్నప్పటి నుండి నేను విన్న కథ అదితి కి చెప్పాను . అంతే కాదు , నా మనవలు , మనవరాళ్ళందరికీ అన్నం తినేముందు ఈకథే చెపుతాను . నేను మొదలు పెట్టగానే , సుబ్బలక్ష్మి కథ వద్దు బాబోయ్ , మేము అన్నం తింటాం కాని ఇంకేదైనా కథ చెప్పు అంటారు వాళ్ళు ! వద్దు బామ్మా వద్దు మేము అన్న తింటాము అని మా మనవలు దండాలు మొదలు పెడుతారు . అన్నం మింగావా .. . మింగు లేక పోతే అమ్మమ్మ , సుబ్బలక్ష్మి కథ చెపుతుంది అని పాటలు పాడుతారు . అంత సరదా మా మనవలకి , మనవరాళ్ళకి ఈ కథ అంటే . అంతటి పేరు , ప్రఖ్యాతి కలిగిన కథ ఇది .

అనగనగా ఒక వూళ్ళో సుబ్బలక్ష్మి అని ఓ అమ్మాయి వుంటుంది . ఆ అమ్మాయికి పెళ్ళై అత్తవారింటి కి వెళుతుంది . కొత్త కోడలు వచ్చింది కదా అని మురిపెంగా అత్తగారు , పులిహోర , పాయసం చేసి , కోడలి కి వడ్డిస్తుంది . అప్పుడు సుబ్బలక్ష్మి నాకు మా అమ్మ పెట్టేవి రెండు కావాలంటుంది . ఏమిటమ్మా , మీ అమ్మ పెట్టేవి అని అత్తగారు ఆప్యాయంగా అడుగుతుంది . మా అమ్మ పెట్టేవి అని మాత్రమే అంటుంది సుబ్బలక్ష్మి . కొత్త కదా మొహమాటం పడుతోందేమో చెప్పటాని కి అనుకొని , అత్తగారు , లడ్డూలు చేసి పెడుతుంది .

అబ్బే , సుబ్బలక్ష్మి తింటేనా ?? ఊం హుం ! మా అమ్మ పెట్టేవీ . . . అని మొదలు పెడుతుంది .

సరే పోనీయ్ పాపం అనుకొని అత్తగారు గారెలొండి పెడుతుంది . అబ్బే తినదే ! మళ్ళీ మా అమ్మపెట్టేవీ అని రాగాలు మొదలుపెడుతుంది . ఇంటిల్లి పాదీ వచ్చి , నీకేం కావాలో చెప్పమ్మా , వండిపెడతాము . బంగారు తల్లి వి కదూ ఏడవకమ్మా అని బతిమిలాడుతారు . నాకు ఆకలేస్తోంది , మా అమ్మ పెట్టేవి కావాలి అని ఏడుస్తూ ఎంతసేపటికీ ఆపదే ! అపుడు సుబ్బలక్ష్మి భర్తకు విసుగొచ్చి ఇవి మింగుతావా మింగవా అని రెండు దెబ్బలేస్తాడు . అంతే సుబ్బలక్ష్మి ఏడుపాపేసి , ఇవే మా అమ్మ పెట్టేవి అని ఆనందంగా అని అత్తగారు చేసినవన్ని తినేస్తుంది .

మింగావా మింగు అని కూడా మా పిల్లలు అన్నం దగ్గర పాట పాడుతూ వుంటారు . ఇదండీ అమ్మ పెట్టేవి రెండూ కథ .

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -


ఇక రెండో కథ , కలసివుంటే కలదు సుఖం .

అనగనగా ఒక వూళ్ళో సంజ్యొత్ , సతీష్ ( అను , బిపు ) అనే అమ్మానాన్న వుంటారు . వారికి అదితి , విక్రం ( మేఘ , గౌరవ్ ) అని , ఇద్దరు పిల్లలుంటారు . ఒకరోజు అమ్మ బేగంపేట బేకర్స్ ఇన్ కు వెళ్ళి మంచి కేక్ తెస్తుంది . పిల్లలకిచ్చి మీరు తినండి , నాకు పని వుంది అని లోపలకు వెళుతుంది . నేను కట్ చేస్తాను అంటే నేను కట్ చేస్తాను అని ఇద్దరూ పోట్లాడుకుంటూ వుంటారు . ఎందుకంటే ఎవరు కట్ చేస్తే , వారు పెద్ద ముక్క తీసుకుంటారని రెండోవారికి అనుమానమన్నమాట . ఇంతలో పక్కింటి కరటకుడు వచ్చి నేను ఇద్దరికీ సమానం గా కట్ చేసి ఇవ్వనా అంటాడు . సరే అంటారు పిల్లలు .

కరటకుడు కేక్ ను కట్ చేసి చెరో ముక్కా ఇస్తాడు . అప్పుడు ఊ ఊ అక్కకు పెద్దది ఇచ్చావు , నాకు చిన్నది ఇచ్చావు అని తమ్ముడు ఏడుపు మొదలు పెడుతాడు . ఓహో అవునా , సరే ఐతే అని తమ్ముడి దాని లోనుండి కొంత కట్ చేసి తినేస్తాడు కరటకుడు . అప్పుడు అక్క నాకు చిన్నదిచ్చావు అని గొడవ పెడుతుంది . అప్పుడేమో ఎంచక్కా అక్క కేక్ లోనుండి కట్ చేసి తినేస్తాడు . అలా కేక్ మొత్తం తినేసి , పిల్లలకు టా టా చెప్పి హాపీగా వెళ్ళి పోతాడు . ఇద్దరూ ఏడుపు మొహాలేసుకొని కూర్చుంటారు . అమ్మ వచ్చి , సంగతి తెలుసుకొని , చూసారా , అందుకే సిస్టర్ , బ్రదర్ ఎప్పుడూ పోట్లాడుకో కూడదు . కలిసి మెలిసి వుండాలి . పెద్దవాళ్ళైనా కూడా ఒకరికొకరు ఫ్రెండ్లీ గా వుండాలి అంటుంది . అప్పటి నుండి పిల్లలు పోట్లాడుకోకుండా హాపీ గా కలిసి మెలిసి వుంటారు .

ఇహ కొసమెరుపేమిటంటే ఈ మధ్య ఈకథ చెపుతుంటే ఇంత కష్టం ఎందుకు , హాయిగా స్కేల్ తో కొలిచి కట్ చేసుకుంటే ఐపోతుంది కదా అంటున్నారండి , మా పిల్లలు . ఇదీ ఈ కథ ఎఫ్ఫెక్ట్ !!!!!!

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

ముచ్చట గా మూడో కథ :

ఆడిన మాట తప్పరాదు .

ఒకసారి అమ్మ అను ( సంజు ) , పిల్లలు , మేఘ , గౌరవ్ ( అదితి , విక్రం ) లను అడివికి పిక్నిక్ కు తీసుకెళుతుంది . చాలా సేపు ఆడుకున్నాక పిల్లలు అలిసి పోతారు . వాళ్ళదగ్గర వున్న నీళ్ళు ఐపోతాయి . అందుకని అమ్మ , పిల్లలూ మీరిక్కడే వుండండి , నేను ఎక్కడైనా నీళ్ళు దొరుకుతాయేమో చూసి తెస్తాను అని , నీళ్ళు వెతుక్కుంటూ వెళుతుంది . ఇంతలో ఓ పులి గాండ్రు మంటూ అమ్మ మీదికి వస్తుంది . అప్పుడు అమ్మ అయ్యో నా పిల్లలు అనుకుంటుంది .
పులీ , పులీ , ప్లీజ్ ,ప్లీజ్ నన్నొదిలేయవా , నా పిల్లలు అక్కడ వొంటరిగా వున్నారు అని పులిని వేడుకుంటుంది .

ఆ నిన్నొదలను . నాకు చాలా రోజులకు ఆహారం దొరికింది అని గాండ్రిస్తుంది పులి .

అయ్యో , నా పిల్లలు అడవిలో ఒంటరి వాళ్ళై పోతారు . చాలా చిన్న పిల్లలు . ఇంటికి దారి కూడా తెలీదు . పోనీ వాళ్ళను ఇంటిదగ్గర వదిలేసి వస్తాను ప్రామిస్ అంటుంది అమ్మ .

సరే . నువ్వు తిరిగి రాక పోయావో , మీ ఇంటికి వచ్చి నీ పిల్లలను కూడా తినేస్తాను . పో , వాళ్ళను దింపేసి తొందరగా రాపో అని పర్మిషన్ ఇస్తుంది పులి .

అమ్మ పిల్లలను ఇంటిదగ్గర దింపేసి వాళ్ళను వదలలేక వదలలేక వదిలేసి ఏడ్చుకుంటూ పులి దగ్గరకు తిరిగి వస్తుంది . అప్పుడు పులి , అమ్మ చేసిన ప్రామిస్ ను తప్పలేదని , అమ్మను చాలా మెచ్చుకొని , నీ పిల్లల దగ్గరకే వెళ్ళిపో అని అంటుంది . అమ్మ పులికి థాంక్స్ చెప్పి , సంతోషం గా ఇంటికి తిరిగి వస్తుంది . కాబట్టి ఎప్పుడు కూడా ఆడిన మాటను తప్పరాదు అని నీతి .

( నా మొహం . ఇప్పుడైతే ఈ కథ మొదలు పెట్టగానే మా పిల్లలు అడవికి వెల్లేటప్పుడు గన్ తీసుకెళితే సరి . అప్పుడు ఏ ఆనిమల్ వచ్చినా కాల్చేయొచ్చు అంటారండి మా పిల్లలు . ఇవన్ని పంచతంత్రం మొదలైన పుస్తకాల లోవే . కాకపోతే కాస్త మార్చి వాళ్ళ పేర్ల తో చెపితే ఇంట్రెస్ట్ గా వింటారని ఇలా చెపుతానన్నమాట . కాక పోతే చిన్నపుడు బాగానే వినేవారు . ఇప్పుడే ఇలా తెలివి మీరిపోయారు హుం ! )

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - - - - - - -

ముసలమ్మ సూది కథ కొనసాగింపు

మా అమ్మమ్మ అలా నేనేదంటే అలా నటే సూది వస్తుందా అని అడుగుతూ వుండేది . ఇహ విసుగూ , కోపం వచ్చి పక్కకు తిరిగి పడుకునేదానిని . కాసేపైనాక అమ్మమ్మ అమండూ నిద్రపోయావురా అని అడిగేది . అమ్మమ్మ , ముసలమ్మ సూది ఎలా వస్తుందో చెపుతుందేమోనని ఆశ తో గబ్బుక్కున లేదమ్మమ్మా అంటూ లేచి కూర్చునేదానిని . చటుక్కున అమ్మమ్మ లేదమ్మమ్మా అంటే సూది వస్తుందా అని అడిగేది . అంతే ఉక్రోషం తో మాట్లాడకుండా పడుకుండి పోయేదానిని . అప్పుడు అమ్మమ ' బూచివాడు వచ్చి బుట్ట్లల్లుతున్నాడు ' అని పాడటము మొదలు పెట్టేది . మా అమ్మమ్మ చాలా బాగా పాడేది . నాకు ఈ పాటలో ఈ ఒక్క చరణమే గుర్తుంది . చిరు చీకటిలో , కింద నుండి తడి మట్టిమీద నుండి సువాసనలు తేలుతూ వస్తున్న చల్లటి గాలి లో , అమ్మమ్మ సన్న సన్నగా పాడుతున్న పాట తో ఎప్పుడు నిద్ర పోయే దాని నో నాకే తెలీదు .

నా మనవళ్ళు , మనవరాళ్ళు ఎంతసేపటికీ నిద్ర పోకుండా ఇంకా ఇంకా కథలని వేధిస్తూ వుంటే నేనూ ఈ కథే చెప్పి , మా అమ్మమ్మ ట్రిక్నే ఉపయోగిస్తాను . కాక పోతే అమ్మమ్మ అంత మధురంగా పాడ్లేను . అసలు పాడనే లేను , కాని ఇదో ఈపాట తో వాళ్ళను నిద్ర పుచ్చుతాను .

ఆటలు ఆడి , పాటలు పాడి అలసి పోయానే
తియ్యా తియ్యని తాయిల మేదో తీసీపెట్టమ్మా .

గూటి లోని బెల్లం ముక్క కొంచం పెట్టమ్మా
చాటలోని చాయా పప్పూ చారెడు పెట్టమ్మా
అటకా మీది అటుకుల పళ్ళెం అమ్మా దింపమ్మా
తియ్యా తియ్యని తాయిల మేదో తీసి పెట్టమ్మ .

ఆటలు ఆడి పాటలు పాడి అలసీ పోయామే
తీయా తీయని తాయిల మేదో తీసీ పెట్టమ్మా .

Wednesday, June 2, 2010

మాగాయే మహా పచ్చడి !!!




మాగాయే మహా పచ్చడి ,
పెరుగేస్తే మహత్తరి ,
అదివేస్తే అడ్డవిస్తరి ,
మానీయా మహా సుందరి.

అన్నారండి పెద్దలు . మాగాయ రుచి మహా గొప్పది . ఏ కూరలు చేసే ఓపిక లేనప్పుడు , పెరుగన్నం లో మాగాయ కలుపుకుని తిన్నామనుకోండి , గిన్నెడన్నమూ ఒక్కరికి కూడా సరి పోదు ! అందుకే నేను కూర వండటానికి బద్దకించను . అలాగే ఏ దోశో , చపాతి నో చేసుకొని , కూర వండే టైం లేక , శ్రీవారు బయటకు వెళ్ళే తొందర లో వున్నప్పుడు , కూర వండటము ఇంకా కాలేదా అని కోపం తో చిందులు తొక్కుతున్నప్పుడు , కొద్దిగా మాగాయ , పెరుగులో కలిపి , మెంతులు , ఇంగువ వేసిన ఘుమ ఘుమ లాడే పోపు వేసామను కోండి కోపం గీపం పోయి శుభ్రం గా లాగించేస్తారు .

అంతటి మహత్తరమైన మాగాయ మేము చేసే విధానము : -

పెద్ద సైజు మామిడికాయలు - 20
ఉప్పు - 4 పావులు
ఖారం - 2 పావులు
మెంతులను ఎర్రగా వేయించి కొట్టుకున్న మెంతి పొడి - అర్ధ పావు
ఆవపిండి - అర్ధ పావు
పసుపు
నువ్వుల నూనె - 1 1/2 కిలో
ఎండుమిరపకాయలు ,
మెంతులు -
పాల ఇంగువ ,
ఈ చివరవి మూడూ పోపుకు సరిపడ

చేసే విధానము : -
మామిడి కాయలను శుభ్రం గా కడిగి , తుడిచి , తొక్కతీసి మనకు కావలసినట్లు గా ముక్కలు కోసుకోవాలి . టెంక అవసరము లేదు . ఆ ముక్కలలో నాలుగు పావుల ఉప్పు , కొద్ది గా పసుపు వేసి బాగా కలుపు కోవాలి . ఒక జాడీ లోకి తీసుకొని మూత పెట్టి మూడు రోజులుంచాలి . మూడో రోజు ఆ ముక్కల లోని నీటిని గట్టిగా పిండి , వాటిని ఎండ లో పెట్టాలి . ఆ ఊటను పారబోయ కూడదు . మధ్య మధ్య లో నెరుపుతూ కచ్చా పచ్చా గా ముక్కలను ఎండనీయాలి . అంటే మరీ ఎండిపోయినట్లు కాకుండా , కొద్దిగా పచ్చిగానే వుండనీయాలి . ఆ తరువాత ముక్కలకు , ఎండ వేడి తగ్గిన తరువాత , ఒక పెద్ద బేసన్ లోకి తీసుకోవాలి . ఊటను ఒక సన్నని బట్ట తో వడకట్టుకొని ( గట్టిగా బట్టను పిండవద్దు . తేలికగా ఆ రసమును రానివ్వాలి ) , ఆ రసమును , రెండు పావుల ఖారం ను , అర్ధ పావు ఆవపిండి , అర్ధ పావు మెంతి పిండి , ఆ ముక్కలలో వేసి బాగా కలపాలి . ఒక బాణలి లో కిలోన్నర్ర ఇదయం నువ్వులనూనె ను పోసి , బాగా కాచాలి . నూనె బాగా కాగాక కొద్దిగా మెంతులు , ముచ్చికలు తీసిన కొన్ని ఎండుమిరపకాయలు వేసి ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి . ఆ తరువాత మంట తగ్గించి , పొడి చేసుకొని వుంచుకున్న పాల ఇంగువను వేసి వెంటనే , ఆ నూనె ను మాగాయ ముక్కలలోకి వంచేయాలి . ఇంగువ వేసినప్పుడు జాగ్రత్తగా వుండాలి ఎందుకంటే , కొన్ని సార్లు ఇంగువ వేయగానే నూనె పొంగుతుంది . ఆ తరువాత నూనె చల్లారాక మాగాయను జాడి లో భద్ర పరుచుకొని ఆరగించటమే !



చుందా





ఈ ఆవకాయ , మాగాయ పెట్టినప్పుడు , ముక్కలు కోసే సమయము లో , అందులోనూ ఈసారి రెండు సార్లు ఆవకాయ పెట్టటముతో ఓ పది మామిడికాయల ముక్కల వరకూ మిగిలి పోయాయి . వాటిని ఏమి చేయాలా అని మా ఫ్రెండ్ ప్రభను అడిగాను . చుందా చేసేయ్ అంది . అసలు పిల్లలు చుందా తింటారా తినరా కనుక్కొని చేద్దాం , లేక పోతే వేస్ట్ అవుతుంది అనుకొని , మా కోడలికి ఫోన్ చేసి అడిగాను . తను కాసేపు ఆలోచించి నేను తీపి తినను కదా ఆంటీ , ఐనా కొత్త వెరైటీ చేస్తున్నారు కదా కొద్దిగా ఇవ్వండి అన్నది . మా అమ్మాయిని అడుగుతే అమ్మా చుందానా వెంటనే నేర్చుకొని , చేసేసెయ్ . సతీష్ , మా మాగారు ఎప్పుడూ బడీచావిడీ జోషీ షాప్ నుంచి కొనుక్కొస్తారు అంది . అమ్మయ్య అనుకొని ప్రభాకు చేద్దాము , చూపించు అని చెప్పాను . మీ కోడలు తీపి తినదా ఐతే కొద్దిగా ఖారం ది చేద్దాం అన్నది .

చుందా చేసే విధానము : -
పది మామిడికాయలను ( ముక్కలను ) తురమాలి . ఆ తురుమును లో ఓ పావు ఉప్పును కలిపి కొద్ది సేపు ఉంచాలి . ఆ తరువాత ఊరిన నీటిని పైపైన పిండాలి . అంటే నీరు మొత్తం తీసేయకుండా కొద్ది తడిని వుండనీయాలన్న మాట . ఆ తురుమును కొలుచుకొని దానికి రెట్టింపు పంచదారను వేసి బాగాకలిపి ఓ రెండు దాల్చిని ముక్కలను అందులో వేసి , దానిని ఓ గిన్నలో వేయాలి . ఆ పైన ఓ శుభ్రమైన బట్టను , ఆ గిన్నెకు వాసెన కట్టి ఎండలో పెట్టాలి . మధ్య మధ్య లో కలుపుతూ , పంచదార బాగా కరిగి , తీగ పాకం లా అయ్యేంత వరకూ ఎండ లో వుంచాలి . రెండు రోజలో అవుతుంది . అప్పుడు అందులో , జీలకర్రను దోరగా వేయించి కొట్టుకున్న పొడిని ఓ చెంచాడు కలపాలి . సగము విడిగా తీసుకొని అందులో మన టేస్ట్ ప్రకారము ఖారం కలుపుకుంటే సరి . తీపి , ఖారం చుందా రెడీ . ఇది జాం లాగా బ్రెడ్ లోకి , చపాతిలలోకి బాగుంటుంది . ఎండాకాలం పిల్లలకు మంచిది .

ఇహ తురుమును పిండిన నీటి లో , దానికి రెట్టింపు పంచదార వేసి , ఓ సీసాలో పోసి , మూత బెట్టి ఎండలో పెట్టాలి . రెండు రోజులలో పంచదార కరిగి , మాంగో షరబత్ రెడీ .

లేదా ఆ ఊటలో పోపేసుకొని పచ్చి పులుసు చేసుకోవచ్చు .

ఇవండీ ఈసారి నేను చేసిన పచ్చడులు , చుందానూ .