Friday, August 29, 2025
గ్రీన్ వీరుడు
రచన: మాలా కుమార్
బాత్ రూం లో నీళ్ళ చప్పుడుకు మహతికి మెలుకువ వచ్చింది. ఒక్క క్షణం తనెక్కడ ఉందో అర్దం కాలేదు. బ్లాంకెట్ జరిపి లేస్తుంటే మెడలోని మంగళసూత్రం చిరు సవ్వడి చేసి, నీకు పెళ్ళి అయ్యింది, మొగుడింట్లో ఉన్నావు అని గుర్తు చేసింది. అవును కదూ… బద్దకంగా కళ్ళు విప్పి పక్కకు చూసింది. సాకేత్ లేడు. సెల్ లో టైం చూస్తే అయిదుంబావు అయ్యింది. బయట వరండాలో కూడా ఏదో చప్పుడు అవుతోంది. ఓ… ఈరోజు డ్యూటీలో జాయిన్ అవ్వాలని చెప్పాడు సాకేత్. ఇంత పొద్దున్నే వెళుతాడా? చిన్నగా బ్లాంకెట్ ను జరిపి లేచింది. వాళ్ళ పెళ్ళి అయి నెలరోజులవుతోంది. మహతి తండ్రి చిన్ననాటి స్నేహితుని కొడుకు ఆర్మీలో కాప్టెన్ గా చేస్తున్నాడు. ఆన్యువల్ లీవ్ లో వచ్చి పెళ్ళి చేసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాడని తెలిసి, మహతితో పెళ్ళి చూపులు అరేంజ్ చేయటము, ఒకరికొకరు నచ్చటమూ, వెంటనే పెళ్ళి అయిపోవటమూ అన్నీ గబగబా జరిగిపోయాయి. నిన్ననే సాకేత్ ఉద్యోగం చేస్తున్న జాం నగర్ వచ్చారు. నిన్న రాత్రి ట్రేన్ దిగినప్పటి నుంచీ కాస్త గాభరాగా ఉంది మహతికి. రైలు దిగుతూనే నలుగురు జవాన్ లు పరిగెత్తుకుంటూ వచ్చి, రైల్ లో నుంచి సామానులన్నీ దింపి పక్కనే ఉన్న జీప్ లో పెట్టారు. జీప్ కంటోన్మెంట్ ఏరియా లోకి రాగానే, ఎప్పుడూ చూడని, తెలియని మిలిట్రీ ప్రపంచంను, అక్కడ తిరుగుతున్న మిలిట్రీ ట్రక్ లు, యూనీఫాంలో గన్స్ పట్టుకొని ఉన్న జవాన్ లనూ బిక్కుబిక్కుమని చూస్తూ సాకేత్ చేయి పట్టుకుంది. జీప్ ఒక చిన్న ఇంటి ముందు ఆగింది. ఆ ఇల్లు, ఇంటి ముందున్న చిన్నతోట చాలా నచ్చాయి. రాత్రి పడుకునేటప్పుడే పొద్దున్నే డ్యూటీ కి వెళుతానని చెప్పాడు. బ్రేక్ ఫాస్ట్ ఏదైనా చేయాలి కదా అనుకుంటూ కంగారుగా లేచింది. సాకేత్ బాత్ రూం నుంచి బయటకు వచ్చి, అప్పుడే లేస్తున్న మహతిని చూసి, "గుడ్ మార్నింగ్" అన్నాడు.
"అప్పుడే లేచేసారా? నన్ను లేపలేదేమిటి? తొందరగా ఉప్మా చేసేస్తాను. లంచ్ కు వస్తారా?" అడిగింది.
"కంగారేమీ లేదు. లంచ్ కే కాదు, బ్రేక్ ఫాస్ట్ కు కూడా ఒక గంట తరువాత వస్తాను" ముదురు ఆకుపచ్చ, బ్రౌన్ కలర్ గీతలున్న పాంట్, షర్ట్ వేసుకుంటూ తనవైపే కళ్ళు విప్పార్చుకొని చూస్తున్న మహతితో అన్నాడు..
ఇంతలో బయట నుంచి "సాబ్ జీ" పిలిచారెవరో.
"ఆర్డర్లీ టీ తెచ్చినట్లున్నాడు, చూడు" అన్నాడు సాకేత్.
మహతి తలుపు తీయగానే ట్రేలో టీ పాట్, మిల్క్ పాట్, సుగర్ బౌల్, టీ కప్స్ పట్టుకొని ఒకతను నిలబడి ఉన్నాడు. అతని దగ్గర నుంచి ట్రే లోపలికి తెచ్చి, కప్ లో టీ కలిపి ఇచ్చింది.
టీ తాగేసి, జంగల్ బూట్స్ వేసుకుంటున్న సాకేత్ తో "ఇది మీ యూనీఫాంనా? వేరేగా ఉందే?" ఆసక్తిగా అడిగింది.
"ఈ రోజు క్రాస్ కంట్రీ ఉంది. అంటే బయట ఆ చెట్లల్లోకి ఎక్సర్సైజ్ కు జవాన్స్ ను తీసుకెళుతాము" అని చెపుతూనే వెళ్ళిపోయాడు.
వరండాలో సాకేత్ యూనీఫాం ను సెట్ చేస్తున్న ఆర్డర్లీని "నీ పేరేమిటి?" అడిగింది.
"కాశిం" అని జవాబిచ్చి, "మేం సాహెబ్ బిస్తర్ బనావూం? ఆప్ కే లియే చాయ్ బానావూం?" అడిగాడు.
"నై నై" అని చెప్పి లోపలికి వెళ్ళింది. ఒక్క నిమిషం చాయ్ చేసి ఇవ్వమననా అని అనుకుంది కానీ బాబోయ్ ఇంకేమన్నా ఉందా ఆర్డర్లీని నా యూనీఫాంలు సెట్ చేయటానికి, నా ఆఫీస్ పనికని ఇస్తారు, ఇంటిపని చెప్పవద్దు. నాకు పొద్దున టీ చేసి ఇచ్చాక ఇంక అతనికి లోపల పని ఉండదు అని ముందే చెప్పాడు సాకేత్. ఫ్రెషప్ అయ్యి కాఫీ తాగి బ్రేక్ ఫాస్ట్ పోహా చేసింది. ఏడవుతుండగా వచ్చాడు సాకేత్. వస్తూనే "మహీ బ్రేక్ ఫాస్ట్ రెడీనా? వెళ్లాలి" కేకేసాడు.
"ఆ రెడీనే. అంటూ అన్నీ డైనింగ్ టేబుల్ మీద సద్దింది. సాకేత్ వచ్చి స్నానం, బ్రేక్ ఫాస్ట్ ముగించి యూనీఫాం వేసుకుంటుంటే చూస్తూ కూర్చుంది. ఆలివ్ గ్రీన్ కలర్ పాంట్, షర్ట్ వేసుకున్నాడు. షర్ట్ చేతులు మోచేతి వరకు నలగకుండా మడిచి ఉన్నాయి. బ్రౌన్ కలర్ బెల్ట్, దాని మీద మెరుస్తున్న బకల్, షర్ట్ బుజాల మీద తళతళా మెరుస్తున్న మూడు బ్రాసో స్టార్స్, భలేగా అనిపించింది. అంతకన్నా ఇంకా మెరుస్తున్న బ్రౌన్ కలర్ షూస్ వేసుకుంటూ, తననే పరిశీలనగా చూస్తున్న మహతితో "ఎట్లా ఉన్నాను?" చిలిపిగా కన్నుకొడుతూ అడిగాడు.
"స్మార్ట్ గా ఉన్నారు" అంది.
"అవునా? థాంక్యూ మేడం" అని సల్యూట్ చేసి నవ్వుతూ వెళ్ళాడు.
తన స్నానం, పూజ కానిచ్చి వంట చేసి, ఆ రోజు పేపర్ చదువుతూ, కాసేపు టీ.వీ లో ఛానల్స్ తిప్పుతూ కూర్చుంది. రెండవుతుండగా వచ్చాడు సాకేత్. వస్తూనే షార్ట్స్, టీ షర్ట్
లోకి మారి, లంచ్ చేసి మంచం మీద వాలాడు. పొద్దుటి నుంచి అలిసిపోయి ఉంటాడని మహతి కూడా ఏమీ మాట్లాడించలేదు. ఎవరో లేపినట్లే టంచన్ గా మూడింటికల్లా లేచి, టీ పెట్టు అన్నాడు. మహతి టీ తీసుకొచ్చేసరికి, తెల్లని టీ షర్ట్, తెల్లని స్పోర్ట్స్ నిక్కర్ వేసుకొని, తెల్లని పీ.టీ షూస్ కు లేస్ బిగిస్తున్నాడు. వంగి షూలేస్ కట్టుకుంటున్న సాకేత్ ఏవో చూపులు గుచ్చుతున్నట్లనిపించి తలెత్తి చూసాడు. బుగ్గన చేయి పెట్టుకొని తననే పరిశీలనగా చూస్తున్న మహతిని చూసి కాస్త ఇబ్బందిగా కదిలి ఏంటి అట్లా చూస్తున్నావు అడిగాడు. ఏమీ లేదన్నట్లు తలూపింది. మహతి చూస్తుండగానే బై అని వెళ్ళిపోయాడు! హోరి దేవుడా? ఈ డ్రెస్ లు మార్చటమేమిటి? ఈ పరుగులేమిటి? బాబోయ్! సాకేత్ వెళ్ళిన వైపే చూస్తూ గుండెల మీద చేయి వేసుకుంది! టైం చూసింది. మూడు నలభై అయిదు అయ్యింది.
దాదాపు అయిదున్నర అవుతుండగా సాకేత్ వచ్చాడు. వస్తూనే “మహీ కాస్త చాయ్ పోస్తావూ? చాయ్ అయ్యాక రెడీ అవ్వు. కల్నల్ సంతోష్ వాళ్ళింట్లో కార్డ్స్, డిన్నర్ అరేంజ్ చేసారు. వెళుదాము" అన్నాడు.
పెళ్ళి పట్టుచీర చూపిస్తూ "ఇది కట్టుకోనా" అడిగింది.
"వద్దు. మొన్న కొన్న రెడ్ షిఫాన్ చీర కట్టుకో. కాస్త మేకప్ చేసుకో. ఊ… అంటూ మహతి జడ పట్టుకొని ఈ జడ మాత్రం ఇలాగే వేసుకో" అన్నాడు.
మహతికీ పార్టీ, డిన్నర్ అంటే సరదాగానే ఉంది. ఎర్ర షిఫాన్ చీరకు, మాచింగ్ గా ముత్యాల గొలుసు పెట్టుకోనా? పగడాల గొలుసు పెట్టుకోనా అని కాసేపు ఆలోచించి ఏదీ నచ్చక, లాకెట్ బంగారం గొలుసు వేసుకుంది. సాకేత్ బ్లాక్ కలర్ లాంగ్ డిన్నర్ సూట్, నల్లటి పాలిష్ తో మెరిసిపోతున్న బ్లాక్ షూస్ వేసుకొని మెడలో టై సద్దుకుంటూ వచ్చి, మహతిని చూసి, "వావ్ సూపర్" అని నడుము పట్టుకొని గిర్రున తిప్పాడు.
"ఆ సాకేత్" అంటూ కళ్ళు మూసుకొని సోఫాలో కూలబడింది.
ఏడున్నరకల్లా కల్నల్ సంతోష్ ఇంటికి వెళ్ళారు. కొత్త పెళ్ళికూతురుని వాళ్ళు సాదరంగా ఆహ్వానించారు. ఇంకా కొంత మంది కపుల్స్ ఉన్నారు. మిసెస్. సంతోష్ మహతిని అందరికీ పరిచయం చేసింది.
అందరూ డ్రింక్ చేస్తూ, డాన్స్ చేస్తూ, కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళని బెరుకుబెరుకుగా చూస్తూ కూర్చుంది మహతి. డిన్నర్ అయ్యాక, అందరూ గుడ్ నైట్ చెప్పుకొని, కల్నల్&మిసెస్. కల్నల్ కు థాంక్స్ చెప్పి బయటకొచ్చారు. ఒక్క సారే చల్లని గాలి తగిలి వళ్ళు జల్లుమంది. బైక్ మీద సాకేత్ వెనుక కూర్చుంటూ, "అబ్బ ఇంత రాత్రి దాకా పార్టీనా?" సాకేత్ నడుము చుట్టూ చేయివేసి, భుజం మీద తల వాలుస్తూ గారంగా అంది మహతి.
ఓ చేత్తో బైక్ నడుపుతూనే అలిసిపోయావా డార్లింగ్ అని ముద్దు చేసాడు సాకేత్.
పొద్దున్నే అయిదుకల్లా లేచి రెడీ అవుతున్న సాకేత్ ను ఎక్కడికన్నట్లు చూసింది. “ఈ రోజు డ్రిల్ ఉందని చెప్పానుగా" అన్నాడు బ్రౌనిష్ గ్రీన్ కలర్ యూనీఫాం వేసుకుంటూ. బెల్ట్ పెట్టుకుంటూ తలెత్తిన సాకేత్ కు కళ్లు విప్పార్చుకొని తనవైపు చూస్తున్న మహతిని చూసి ఏమిటన్నట్లు కళ్లెగరేసాడు.
"ఇదింకో యూనీఫాం! దేవుడా ఎన్ని రకాల గ్రీన్ కలర్ షేడ్స్ లలో డ్రెస్ లూ! బాబోయ్ ఆర్డర్లీ లేకపోతే ఎట్లా?" సాకేత్ డ్రెస్ చూస్తూ భయంభయంగా అంది.
"ఎట్లా ఏముంది? నువ్వే రెడీ చేయాలి" కూల్ గా జవాబిచ్చాడు.
"ఆ నేనా? నాకేం వచ్చు?" ఏడుపు గొంతుతో అడిగింది.
"నేర్చుకో" అని చెపుతూ బిక్కమొహం వేసుకొని కూర్చున్న మహతి బుగ్గ మీద చిటిక వేసి వెళ్ళిపోయాడు.
ఆ మరునాడు సాకేత్ పొద్దున్నే అయిందింటికి వెళ్ళకుండా మామూలుగా ఏడున్నరకల్లా ఆఫీస్ కు వెళ్ళాడు. ఈ రోజు పొద్దున హడావిడిలేదే అనుకుంటూ ఆర్డర్లీ వెళ్ళిపోయాక తలుపేసుకొని తన పనులన్నీ ముగించుకొని వంట ఏం చేద్దామా? అనుకుంటూ ఫ్రిడ్జ్ తీసింది. మహీ అన్న సాకేత్ పిలుపు విని ఇవ్వాళ తొందరగా వచ్చేసాడే అనుకుంటూ తలుపు తీసింది. సాకేత్ యూనీఫాం మార్చి combat gear (ఫైరింగ్ స్పెషల్ డ్రెస్) మార్చుకుంటూ "ఇప్పుడు జవాన్స్ తో ఫైరింగ్ ప్రాక్టీసు ఉంది. లంచ్ కు వచ్చే సరికి ఆలస్యం అవుతుంది నువ్వు తినేయి. కాస్త టీ ఇవ్వు" అన్నాడు.
“వంట అయ్యింది. లంచ్ చేసేయకూడదూ” అంది టీ కలుపుతూ.
"లేదులే ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించాలి. వచ్చేసరికి ఆలశ్యం అవుతుంది. నువ్వు ఎదురు చూడకు. లంచ్ చేసేయి" టీ తాగి హడావిడిగా వెళూతూ, మహతి చూస్తుండగానే నువ్వు నాకోసం ఎదురు చూడకు తినేయి అని మరోసారి చెప్పి వెళ్లాడు. సాకేత్ అలా డ్రెస్ లు మార్చిమార్చి వేసుకుంటుంటే, ఆ రకరకాలా యూనీఫాంలలో సాకేత్ ను చూస్తూ "సొగసు చూడ తరమా" అని మురిపెంగా అనుకుంది. ఆసక్తిగా, సరదాగానూ ఉంది మహతికి.
సాకేత్ వచ్చేసరికి సరికి సాయంకాలం అయిదు అయ్యింది. వస్తూనే "నువ్వు లంచ్ చేసావా? నేను అక్కడే తినేసాను. ఆర్డర్లీ కి జ్వరం వచ్చింది. రేపు రాడు" అని చెప్పాడు.
రేపేమిటో అయ్యగారి సింగారం అని మనసులో అనుకొని, "మరి రేపటి యూనీఫాం ఏమిటి?" అడిగింది.
"మామూలు యూనీఫాంనే. రేపేమీ ప్రత్యేకం లేదు. పొద్దున చూసుకుందాములే" జవాబిచ్చాడు.
పొద్దున సాకేత్ ఇంకా లేవలేదే! అయినా ఈరోజు మామూలు ఆఫీస్ అన్నాడు కదా అనుకుంటూ తీరికగా లేచి బ్రేక్ ఫాస్ట్ ఉప్మా చేస్తున్న మహతి, "మహీ" సాకేత్ పిలుపు విని గబగబా వెళ్ళి ఏమిటన్నట్లు చూసింది.
"నన్ను లేపలేదేమిటి? ఆలశ్యం అవుతోంది. ఇదో షర్ట్ మీద ఈ స్టార్స్ ఇట్లా పెట్టు తొందరగా" అని చూపించి షూస్ పాలిష్ చేసుకున్నాడు. స్టార్స్ పెట్టి ఇవ్వగానే హడావిడిగా ఉప్మా తినేసి వెళ్ళిపోయాడు.
పార్కింగ్ ప్లేస్ లో బైక్ ఆపుతూ టైం చూసుకున్నాడు. అమ్మయ్య ఆలశ్యం కాలేదు. అక్కడున్న జవాన్ సల్యూట్ చేసి, ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. ఏమిటీ అని అడగబోయేంతలో, సీ.వో. కల్నల్. మాన్ జీప్ రావటం తో అటెళ్ళి ఆయనకు సెల్యూట్ చేసి తన ఆఫీస్ వైపు వెళ్ళాదు. అయిదు నిమిషాల తరువాత మెసెంజర్ వచ్చి మిమ్మలిని సీ.వో. సాబ్ పిలుస్తున్నారు అని చెప్పాడు. ఎందుకబ్బా అని ఆలోచిస్తూ వెళ్ళి ఆయన ముందు నిలబడి సెల్యూట్ చేసి, ఆయన చెప్పేది వినటానికి రెడిగా అటెన్షన్ లో నిలబడ్డాడు. సీ.వో కుర్చీలో నుంచి లేచి, టేబుల్ పక్కనుంచి వచ్చి, సాకేత్ భుజం ఫ్లాప్స్ మీద ఉన్న స్టార్స్ ను తీసి, సరిగ్గా పెట్టి, తన సీట్ లో కూర్చుని, ఇక వెళ్ళమన్నట్లు చూసాడు. మౌనంగా బాస్ ఇచ్చిన పనిష్మెంట్ కు సాకేత్ మొహం అవమాన భారంతో కందిపోయింది.
కాస్త మూడ్ ఆఫ్ గానే పని చేసుకొని, ఇంటికి వచ్చేసరికి మహతి కనిపించలేదు. ఎక్కడ ఉందా అని మహతి కోసం చూసాడు. పక్క గదిలో ఎవరితోనో సెల్ లో మాట్లాడుతూ కనిపించింది. అటు వైపు నడిచాడు.
అవతల ఎవరో ఏమడిగారో కానీ…
"పొద్దున అయిందింటికి లేవటం, క్రాస్ కంట్రీనో, మార్చ్ ఫాస్ట్ నో ఏదో ఉందని డ్రెస్ వేసుకొని అయిదు నలభై కల్లా వెళ్ళిపోవటం. ఏడుకల్లా వచ్చి హడావిడిగా బ్రేక్ ఫాస్ట్ అవీ ముగించుకొని యూనీఫాం వేసుకొని ఆఫీస్ కు వెళ్ళటమూ, ఒకటిన్నరకు వచ్చి లంచ్ చేసి, షార్ట్స్ వేసుకొని పడుకొని రెస్ట్ తీసుకొని మూడుకల్లా లేచి, పి.టీ డ్రెస్ వేసుకొని గేంస్ కు వెళ్ళటమూ. అయ్యిందా సాయంకాలం కాగానే ఒక రోజు మెస్ లో పార్టీ అని ఫార్మల్ డ్రెస్ తో, ఒక రోజు బడాఖానా అని నార్మల్ డ్రెస్ తో వెళుతారు. ఇక రాత్రి సరే సరి నైట్ డ్రెస్ తప్పని సరి కదా! అన్నట్లు యూనీఫాంస్ అన్నీ రకరకాల గ్రీనిష్ షేడ్స్ అనుకో! ఇలా పొద్దున అయిదింటి నుంచి రాత్రి పదింటి వరకూ పెళ్ళింట్లో అమ్మాయిలు డ్రెస్ లు మార్చినట్లు రోజంతా మారుస్తూనే ఉంటారు. డ్రస్ ల తో పాటు నగలు మార్చినట్లు, కాప్, బెల్ట్, షూస్ అవీ మారుస్తూనే ఉంటారు. ఇంకా క్రాస్ కంట్రీ కి వెళ్ళినప్పుడు, జుంబారే జుంబా అని డాన్స్ చేసే అడవిరాముడులా టొపీకీ ఆకులు కూడా పెట్టుకుంటారు. అంతేనా డ్రెస్ మార్చినప్పుడల్లా గరమాగరం చాయ్, స్నాక్స్ ఉండాల్సిందే! ఒక్కోసారి ఇన్ని డ్రెస్ లు మార్చి ఆఫీస్ లో ఏం పనిచేస్తారాని అనుమానం కూడా వస్తుందనుకో. అన్నట్లు ఈ రోజు ఆర్డర్లీ రాకపోతే యూనీఫాం మీద తళతళా మెరుసుతున్న స్టార్స్ నేనే పెట్టాను. ఏమిటోనే పెళ్ళయితే జీవితం రంగుల హరివిల్లు అవుతుందనుకున్నాను కానీ ఆకుపచ్చరంగులో మునిగిపోతాననుకోలేదు. ఇంక నేనూ ఆకుపచ్చ అద్దాలలంగా కట్టి జుంబారే అని డాన్స్ చేయటం నేర్చుకోవాలి. భలే సరదాగా ఉంటుంది కదా" అని కిలకిలా నవ్వుతూ తలెత్తిన మహతి తననే చూస్తున్న సాకేత్ ను చూసి కాస్త బెదిరి, మళ్ళీ మాట్లాడుతానే అని పెట్టేసింది.
ఆ మాటలు విన్న సాకేత్ కు ముందే కాస్త మూడ్ ఆఫ్ లో ఉన్నాడేమో వళ్ళు మండిపోయింది. అంతలోనే గొప్పలు చెప్పుకుంటోందిలే పిచ్చిమేళం అని కాస్త మురిపెంగా అనుకొని, నవ్వు, కోపం, ఉక్రొషంతో మహతి దగ్గరకు వచ్చి, చెవి పట్టుకొని "ఏయ్ తింగిరి బుచ్చీ నేను ఆఫీస్ లో ఏ పనీ చేయకుండా అమ్మాయిల్లా డ్రెస్ లు మార్చుకుంటూ ఎంజాయ్ చేసేవాడిలా కనిపిస్తున్నానా? హన్నా ఎంత ధైర్యం! నీ మూలంగా ఈరోజు మా బాస్ పనిష్మెంట్ ఇచ్చాడు తెలుసా?" అన్నాడు.
"అమ్మో ఎందుకు?" కళ్ళు పెద్దవిగా చేసి, గుండెల మీద చేయి వేసుకొని భయంభయంగా అడిగింది.
"ఏముంది? స్టార్స్ తలకిందులుగా పెట్టావు. ఇప్పుడు నీకు పనిష్మెంట్ తప్పదు. తీయ్ వంద గుంజీళ్ళు " అన్నాడు.
"అమ్మో గుంజీళ్ళా! రేపు ఆర్డర్లీ దగ్గర సరిగ్గా నేర్చుకుంటాను సాకేత్. గుంజీళ్ళు వద్దు" దీనంగా అంది మహతి.
"అయితే రేపటి నుంచి ఆర్డర్లీ దగ్గర ట్యూషన్ అన్నమాట. వెరీ గుడ్. ఏమిటీ నేను అడవిరాముడులా ఉన్నానా? నువ్వూ అడవిపోరిలా తయ్యారయ్యి నాతో జుంబారే డాన్స్ చేస్తావా? భలే భలే" అహ్హా అహ్హా ఒహ్హొహ్హో అని బిగ్గరగా నవ్వుతున్న సాకేత్ ను చూసి, బెదురుపోయి, సాకేత్ చేయి ఒకటి తన నడుము చుట్టూ వేసి. ఇంకో చేత్తో సాకేత్ కుడి చేయి పట్టుకొని డాన్స్ చేస్తూ "అడవిరాముడు కాదు. నా సాకేతరాముడూ, గ్రీన్ వీరుడూ, నా రాకుమారుడు” అంది తనూ నవ్వుతూ.
మహతి తో అడుగులు కలుపుతూ "అడవిమాలోకంకు ఉషారొచ్చిందే" గమ్మత్తుగా అన్నాడు సాకేత్.
"అడవిలోకి వచ్చిన ఆర్మీ ఆఫీసర్ భార్యను కదా" అన్న మహతిని అపురూపంగా దగ్గరికి తీసుకున్నాడు సాకేత్.
Subscribe to:
Posts (Atom)