చూపులు కలవని శుభవేళా ఎందుకు నీకీ కలవరము, ఎందుకు నీకీ కలవరమూ.
మీరు పొరపడలేదు సరిగ్గానే విన్నారు, చూపులు కలవని
శుభవేళ అని. పెళ్ళికొడుకు, పెళ్ళి కూతురు
జీలకర్ర బెల్లం ఒకరితలపై ఒకరు పెట్టుకున్నాక, వారిద్దరి
మధ్యలోనుంచి తెర తీసేసి ఒకరినొకరు చూసుకోమన్నాడు. చూపులు కలవకపోగా కన్నీళ్ళనూ జలజల
రాల్చేసారు. ఎదుకబ్బా? అదేమిటో పాపం
వారెందుకలా కన్నీరు కార్చారో తెలుసుకుందాం రండి చూపులు కలవని శుభవేళ లో. ఈ కథ 8-5-2015 న గో తెలుగు. కాం అంతర్జాల పత్రికలో పబ్లిష్
అయ్యింది.
అలమారా లిఫ్ట్ అంటే తెలుసా మీకు? అబ్బే ఏమీ లేదండి క్లోజ్డ్ లిఫ్ట్ అన్నమాట. లోపలికి వెళ్ళగానే స్టీల్ తలుపులు మూసుకొని అలమారాలా ఉంటుందని దానికి మన అరుంధతి అలమారా లిఫ్ట్ అని పేరు పెట్టుకుందన్నమాట. గ్రిల్స్ ఉన్న లిఫ్ట్ ఏమో కటకటాల లిఫ్ట్ అన్నమాట అరుంధతికి. ఈ అలమారా లిఫ్ట్ తో అరుంధతి ఎన్ని అగచాట్లు పడిందో వినండి నా ప్రభాతకమలం లో. ఈ కథ యామిని అంతర్జాల పత్రిక లో 5-5-2015 లో పబ్లిష్ అయ్యింది.
మాలిక అంతర్జాలపత్రిక ఎడిటర్ జ్యోతి వలభోజు గారు తండ్రి- కూతుళ్ళ అనుబంధం మీద కథ రాద్దామని మా రచయిత్రుల సమూహం ప్రమదాక్షరిలో ప్రతిపాదించారు. అలా కొందరము రచయిత్రులము తండ్రీకూతురు అనుబంధం మీద కథ వ్రాసాము. అవి వరుసగా మాలిక అంతర్జాల పత్రికలో ప్రచురించారు. ఆ కథలు పత్రిక లో పబ్లిష్ అవుతున్నప్పుడే ప్రముఖ రచయిత్రి శ్రీమతి. మంథా భానుమతి గారు వాటిని విష్లేషించారు.ఆ తరువాత ఆ కథలన్నీ "తండ్రి-తనయ" అనే పేరు తో పుస్తకం గా ప్రింట్ చేయించారు జ్యొతి వలభోజుగారు.
అదో ఆ సంధర్భంగా వ్రాసినదే నా ఈ కథ " చాందిని."ఇది 6-8-2014 లో మాలిక అంతర్జాల పత్రికలో పబ్లిష్ అయ్యింది. కథనూ, నా కథ మీద మంథా భానుమతిగారు చేసిన విష్లేషణనూ చెపుతాను వినండి. విని ఊ కొట్టటం మర్చిపోకండి.
మంథా భానుమతి గారి విశ్లేషణ చదివి, చాందినీ లోకి పదండి. . . . .
విశ్లేషణ- మంథా భానుమతి
కన్నపిల్లలమీద ఎంత ప్రేమ ఉన్నా తమ అలవాట్లను, వ్యసనాలను వదిలించుకోలేరు కొందరు తల్లిదండ్రులు. తల్లులకేం వ్యసనం అనుకుంటాం.. కానీ పిల్లలు పిలుస్తున్నా వినిపించుకోకుండా పుస్తకాలు పట్టుక్కూర్చోడం, ఇంటిపనులని గాలికొదిలి టివీ చూస్తూ కూర్చోడం వంటివన్నీ మానసిక బలహీనతలే.
ఇంక తండ్రుల విషయానికొస్తే, అలవాట్లేంఖర్మ.. వ్యసనాలే కోకొల్లలు. ఒకటో తేదీనాడే జీతం అంతా పేకాటకి అర్పణం చేసి ఇల్లు చేరే వాళ్ళు నాకు నలుగురైదుగురు తెలుసు. ఇంక మందుబాబులు, బియ్యం నిండుకున్నా సిగరెట్ పెట్టెకి తగలేసే వాళ్ళు.. లాటరీ టికెట్ల మోజుతో కోటీశ్వరులవాలనుకే వాళ్ళు, నష్టాలొచ్చినా షేర్లమార్కెట్లో లక్షలు పోగొట్టుకొనేవాళ్ళు ఎంతమందో! పెళ్ళాం, పిల్లలు అలో లక్షణా అని గోలెడుతున్నా వాళ్లకేం పట్టదు.
ఒక కొత్తరకం వ్యసనానికి అలవాటుపడ్డ తండ్రి శ్రీహర్ష. పుట్టిన క్షణంనుంచే కూతుర్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళాలని కలలు కంటాడు. అపురూపంగా పెంచాలనుకుని ఒక్క కూతురే చాలనుకుంటాడు. మొదట్లో ఎంతో సంతోషంగా, కూతురే లోకంగా గడుపుతూ, ఆ పాప ఉన్నతికే అహర్నిశలూ శ్రమించే తండ్రిని మహమ్మారి లాంటి వ్యసనం తగుల్కుంది. రూపాయి ఖర్చు లేకపోయినా అది కూతురి భవిష్యత్తుకి ముప్పు కలిగించేది. అనుకోకుండా భార్య కంట పడిన శ్రీహర్ష తత్తరపాటుతో అరిచి ఆవిడ నోరు మూయిస్తాడు.
కూతుర్ని తీసుకుని ఇల్లు విడిచిపోయిన తల్లి, ఆ సమస్యని పరిష్కరించిన విధానం మనసుకి హత్తుకుంటుంది. అయితే దానికి ఆ తండ్రికూడా మనఃస్ఫూర్తిగా సహకరిస్తాడు. మళ్లీ ఆ ఇంట ఆనందాలు వెల్లి విరుస్తాయి. భయంకరమైన ఊబిలోకి పడాల్సిన తమ చిన్నారి పాపని రక్షించుకుంటారు.
శ్రీమతి కమలా పర్చా గారి కలం నుండి వెలువడిన, తండ్రీ కూతుళ్ళ బంధంలో ఒక కొత్త కోణం చూపించే కథ “చాందినీ”. కమలా పర్చాగారు నాలుగైదు సంవత్సరాలనుండి బ్లాగును నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే మంచి మంచి కథా వస్తువులని తీసుకుని, కథలు రాస్తున్నారు. సులభమైన శైలిలో, పాఠకుల హృదయాలను స్పృశించే నేర్పు ఉన్న రచయిత్రి. వీరి కలం నుండి మరిన్ని కథలు రావాలని ఆశిద్దాం.
శరత్ చంద్ర వ్రాసిన దత్త-ఆ నవల ఆధారం గా తీసిన సినిమా వాగ్ధానం కు నేను వ్రాసిన సమీక్ష. అన్నట్లు మీకు జంతర్ మంతర్ పెట్టె అంటే తెలుసా? దాని విశేషము కూడా ఉందండోయ్ ఇందులో. మరి వినండి, ఊ కొట్టండి. థాంక్ యూ.
ఈ రోజు నేను చెప్పబోయే కథ పేరు "ధీర". ఇదొక ఆర్మీప్రేమ కథ అనుకోండి. దీని మీద నాకూ మా ఏమండీకీ చిన్నపాటి డిస్కషన్ అయ్యింది. ఏమండీ అంటారు "ఇలా ఓ ఆర్మీ ఆఫీసర్ యుద్దం లో చనిపోయాడు, అని వ్రాస్తే ఎవరైనా డిఫెన్స్ లో చేరుతారా? అలా వ్రాయ కూడదు. అసలుకే మనవాళ్ళు చాలామంది మిలిట్రీ లో చేరాలంటేనే భయపడతారు. నీ కథ చదివిన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి డిఫెన్స్ లో చేరేట్టుగా ఉండాలి." అని.
"నిజమే కానీ, ఎంతసేపు ఎవరు మాట్లాడినా సిపాయిల త్యాగం గురించే మాట్లాడుతారు. వారి భార్యల గురించి ఎవరూ మాట్లాడరు. భర్త యుద్దం లోకి వెళితే ఆ ఆఫీసర్ భార్య కాంప్ లో ఉన్న సిపాయిల కుటుంబాలను చూసుకోవటమూ, కుచ్ ఖబర్ ఆయా క్యా దీదీ అంటూ వచ్చే వారిని సముదాయించి పంపటమూ, యుద్దం లో చనిపోయిన సిపాయి భార్యను జాగ్రత్తగా వాళ్ళవాళ్ళకు అప్పగించటము ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. అంతేనా భర్త ఫీల్డ్ పోస్టింగ్ కు వెళితే వంటరిగా పిల్లలతో ఎక్కడో సెపరేటెడ్ ఫామిలీ క్వాటర్ లోనో, లేదా అత్తమామల దగ్గరో ఉండి కుటుంబాన్ని చూసుకోవాలి. మనకు తెలిసిన ఎంత మంది ఆఫీసర్స్ వైవ్స్ భర్త యుద్దం లో చనిపోయినా తమ పిల్లలను మిలిట్రీ లో చేర్పించినవారు లేరు చెప్పండి. మరి ఒక మిలిట్రీ ఆఫీసర్ భార్య ఎదుర్కునే పరిస్తితులు కూడా తెలియాలి కదా" అని ఏమండీనీ ఒప్పించాను. కథకు ఏ పేరు పెట్టాలా అని ఇద్దరమూ తెగ ఆలోచించి, స్వతహాగా పిరికిదే అయినా రాధ పరిస్తితులను ఎదుర్కొని కొడుకును కూడా మిలిట్రీ లో చేర్పించింది కాబట్టి " ధీర" అని పెట్టాము. అదండీ కథ వెనుక కథ.
అన్నట్లు ఈ కథ 60ల దశకం లో మొదలవుతుందండి. ఇక ఇది ఫిబ్రవరీ 2014 – స్వప్న సకుటుంబ సపరివార పత్రిక లో పబ్లిష్ అయ్యింది.