Tuesday, March 1, 2016

ఇస్మైల్ ప్లీజ్!



మొన్నోరోజు పెళ్ళికి వెళ్దామని బయిలు దేరాము.దారిలో మావారు ఫొటో స్టూడియో దగ్గర ఆపారు.ఎందుకండీ అంటే నా పాస్పోర్ట్ ఫొటోలు లేవు తీసుకోవాలి అన్నారు. ఓహో అనుకున్నాను.నేను కార్ లోనే కూర్చుందామనుకున్నాను. నువ్వూ రా అన్నారు.ఎందుకండీ అంటే చెప్తాగా అన్నారు.పాపం వంటరిగా వెళ్ళటానికి భయపడుతున్నారేమో ,సాయం కావాలేమో అనుకొని వెళ్ళాను.ఆయన ఫొటో షెషన్ లోపల జరుగుతుండగా నేను బయట స్టూడియో లో ఫొటోస్ చూస్తూ వున్నాను.ఇంతలో నన్నూ పిలిచారు.ఏమిటా అనుకున్నాను.
"మనిద్దరం ఫొటో తీసుకొని చాలా రోజులైంది కదా ఫొటో తీసుకుందాము."అన్నారు.
"అదేమిటీ అప్పుడూ ఇప్పుడూ చాలానే దిగుతున్నాము కదా ?"అడిగాను.
"కాదులే స్టూడియో లో తీసుకోక చాలా ఏళ్ళైంది.ఇతను బాగా తీస్తాడు రా ."అన్నారు.అవునవును మా ఆస్తాన ఫొటోగ్రాఫెర్ కదా,రెన్నెళ్ళకోసారి మా పాస్పోర్ట్ ఫొటోలు తీస్తుంటాడు.ఇంక కాదనేదేముంది?
ఇహ మొదలైంది మా ఫొటో షెషన్!
మాలా కళ్ళజోడు పెట్టుకో అన్నారండి మావారు.
ఎందుకూ అడిగాను.
"పెద్దరికంగా ఉంటాము.పైగా నువ్వు రచయిత్రిలా కనిపిస్తావు."
వద్దండీ అని గొణిగాను కాని నా మాట చెల్లలేదు. కళ్ళజోడు చేరింది. రెండు మూడు సీనరీలు చూసాక రిసార్ట్ సీనరీ రెండు కుందేళ్ళు, రెండు జింకలూ, రెండు హంసలూ చేరాయి.పూర్తి పఠాలం తయార్!
"మేడం మీరిటు నులుచోండి.సార్ మీరిటు రావాలి ."ఫొటో గ్రాఫర్ చెప్పాడు.
సరే అతను చెప్పినట్లు నిలుచున్నాము.
ఉమ్హూ అతనికి నచ్చలేదు."ఇట్లా కాదు సార్ ఇటు తిరగండి. మేడం మీరిటు."కాసేపు మమ్మలిని బొంగరాల్లా తిప్పాడు.అబ్బే కుదరలే!
కొంచం దూరం జరిగి , చెమట తుడుచుకొని ( పనిలో పని మేమూ చెమట్లు తుడుచుకున్నాము) 'వి ' లా నిలుచొండి అని ఆర్డర్ వేసాడు.మొత్తానికి అతనికి కావలసినట్లు నిలుచున్నాము!
"సార్ కాస్త నవ్వాలండి."
"కొంచం ఘంభీరంగా రావాలయ్యా .నవ్వుతే బాగుండదేమో!"మావారి అనుమానం.
"పరవాలేదు సార్ కొద్దిగా నవ్వండి .మేడం మీరు చాలా నవ్వుతున్నారు.కాస్త తగ్గించండి."
తగ్గించాను.
"మేడం మీరు పెదాలు బిగించారు.కాస్త ఫ్రీగా నవ్వండి."
ఫ్రీగా ఏమిటిబాబూ డబ్బులు ఇస్తూనే వున్నాముగా గొణుకున్నాను!
"మేడం మరీ అంతలా నవ్వొద్దండి."
"సరిగ్గా నవ్వలేవూ "మూతి కదలకుండా మావారి హుంకరిపు.మరే మూతి కదులుతే నవ్వు పోతుందిగా!
నానా చిత్రహింసల తరువాత ఫొటొ క్లిక్ మంది. ఖుటోగ్రాఫరూ , మేమూ మళ్ళీ చెమట్లు తుడుచుకున్నాము.

ఎలా ఉంది మా ఖుఠో?