Tuesday, May 29, 2012

చావు తప్పితే చాలు

"47 సంవత్సరాల క్రిందట విడుదలైన ఈ నవల ఆ రోజులలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు .1962 నుంచి 1976 వరకు మూడు సార్లు పునర్ముద్రించబడినది .దాదాపు 15000 కాపీల వరకు అమ్ముడుబోయినాయి ఆ రోజులలోనే . ఈ నవల పుస్తకము వెనుకనున్న క్రింది వాక్యాలు నవల పట్ల ఉత్కంఠతని రెట్టింపు చేసాయి ."

చాలా సీరియస్ గా చదువుతున్నాను . ఇంతలో ఠప్ మని కరెంట్ పోయింది ."చావు తప్పితే చాలు " నవల లింక్ ను కార్తీక్ మూడు రోజుల కిందటే ఇచ్చాడు . అప్పటి నుంచి చదువుదామంటే తీరిక దొరకలేదు .తీరిక దొరికి తీయగానే ఇదీ సంగతి ! అంతటా గాఢాంధకారం . లాప్ టాప్ వెలుతురు తప్ప ఇంకేమీ లేదు . స్ట్రీట్ లైట్స్ కూడా పోయినట్లున్నాయి !చదవనా వద్దా అని కొంచం సేపు ఆలోచించి , చీకట్లో చేసే పనిమటుకు ఏముందిలే అనుకొని మళ్ళీ లాప్ టాప్ లో కి కళ్ళు తిప్పాను .
"భారతి భుజాల మీద ఏదో చేతులు వేసింది .మొహాని కి ఏదో రాసుకుంది ? ఏమిటది ?
మెట్ల మీద ప్రసాద్ చూసిన ఆకారం ఏమిటి ?మనిషి కాదని నిశ్చయం గా ఎందుకన్నాడు ?
వైకుంఠరావు చనిపోయి రెండు రోజులైంది .అతని శవం మేడ మీద కుర్చీలో ఎట్లా వుంది ? ఇంట్లో ఎట్లా తిరుగుతోంది ?
"దూరంగా పొండి, తలుపు దగ్గరికి వెళ్ళకండి " అని అరుస్తూ భారతి , ప్రసాద్ ని , శేఖర్ నీ ఎందుకు వెనక్కి లాగింది ?
ఈ పుస్తకం రాత్రిళ్ళు ముట్టుకోవద్దు .వంటరి గా వున్నప్పుడు చదవద్దు . భయం వేసినప్పుడు అప్పటి కి చదవటం ఆపి కొంత సేపటి తరువాత మళ్ళీ మొదలు పెట్టండి..!"

అక్కడి దాకా చదివాక గుండె టక్ టక్ మని కొట్టుకోసాగింది . ముందుకు చదవనా వద్దా అన్న మీమాంసలో పడ్డాను . ఇంతలో చిన్నగా ఏదో వెలుతురు కనిపించింది . . . . .

ఆ తరువాత . . . ఏదో నీడ లాప్ టాప్ మీద కు వచ్చింది . . . . .

ఆ పైన నా భుజానికి ఏదో మెత్తగా తగిలింది . . . . .

అంతే ఒక్క వుదుటున లేచి కళ్ళు మూసుకొని కెవ్ . . . కెవ్ . . . మని అరిచాను * * * * *
చీకట్లో భయపడతావని ఎమర్జెన్సీ లైట్ తీసుకొని వస్తే ఏమిటా అరుపులు అని మావారు , లాప్ టాప్ కిందపడకుండా పట్టుకుంటూ అన్నారు .

మెల్ల గా వీపు మీద కొట్టు కుంటూ " ఉష్ . . . మీరా " అన్నాను .

" మరెవరనుకున్నావు ? కిందికి వస్తావా ఇక్కడే కూర్చుంటావా ?"

"దయ్యమనుకున్నాను " ( స్వగతం ) " వస్తాను చీకట్లో ఇక్కడేమి చేస్తాను ? " ( పైకి ) అని లాప్ టాప్ క్లోజ్ చేసి కింది కెళ్ళిపోయాను .

నిన్న పగలు ఇహ ఆ నవల చదవకుండా వూరుకోలేక మళ్ళీ ఓపెన్ చేసాను .

చాలా టెన్షన్ గా ప్రాణాలు బిగబట్టుకొని చదువుతున్నాను . . .

" ఎక్కడో కరకరమని చప్పుడైనట్లు అనిపించి మగత నిద్ర లోంచి మేల్కొంది , కిటికీ రెక్కలు తెరిచి వున్నాయి.బయట బాగా చీకటి గా వుండటం వల్ల ఏమీ కనిపించటం లేదు .కళ్ళు మూసుకొని దుప్పటి మెడవరకూ కప్పుకుంది .. . . . . . . .
తను కదిలినా ఏ కొంచం శబ్ధం చేసినా ఆ చప్పుడు ఆగిపోతొంది .భారతి అడుగులో అడుగువేసుకుంటూ శబ్ధం వస్తున్నవైపు వెళ్ళింది . పెద్ద బీరువాలో నుంచి వస్తున్నాయి చప్పుళ్ళు.భారతి జాగ్రత్త గా విని తనలో తను నవ్వుకుంది .ఎలుకలైవుంటాయి .బీరువా లో చేరి గొడవ చేస్తున్నాయి .బీరువా తలుపుకు వున్న పిడి పట్టుకొని లాగింది .తలుపు తెరుచుకోలేదు . మళ్ళీ లాగింది .

పూర్తిగా చీకటిగా లేదు , కాని స్పష్టంగా కనిపించే వెలుగు లేదు గదిలో .బీరువా తలుపు తెరుచుకుంది .బీరువాలోంచి ఏదో వచ్చి మీద పడ్డది - చిన్నది కాదు - ఎలుక కాదు - పిల్లి కాదు .తన కన్న పొడుగ్గా వుంది . భారతి గుండె ఆగి పోయినంత పనైంది .నోట మాట రాలేదు .అరవటానికి వీల్లే కుండా గొంతు పూడుక పోయింది . . . "

"మాలా. . . "

"అబ్బ ఎందుకంత గావుకేక పెట్టారు . దడుచుకున్నాను . ఊహ్ . . . "

" గావుకేక ఎక్కడ పెట్టాను ? చిన్నగానే పిలిచానుకదా !"

" ఇంతకీ ఎందుకు పిలిచారు ?"

" జగన్ ను జైల్ కు తీసుకెళుతున్నారు . చూస్తావని పిలిచాను ."

మరి జగన్ నూ చూడాలి . భారతి గతేమయ్యిందో చదవాలి ! లాప్ టాప్ తో డ్రాయింగ్ రూం లో సెటిలై , ఓ కంట జగన్ నూ , ఓ కంట భారతినీ చూస్తున్నాను :)

"పద్మ నిద్ర లోనుంచి చటుక్కున లేచి , కళ్ళు పెద్దవి చేసి చీకట్లోకి తీక్షణం గా చూసింది . ఏమీ కనిపించలేదు .తలుపు పక్కన దీపం స్విచ్ వుంది . స్విచ్ నొక్క గానే క్లిక్ మన్న శబ్ధం వినిపించిందిగాని దీపం వెలుగ లేదు .పద్మ కి భయం వేసింది దీపం ఎందుకు వెలగ లేదు !"

* * * * * * * * * * * * * * * * * * * * *

"టార్చ్ వెలుగులో అతనికి కనిపించిన ఆకారం భయంకరం గా వుంది . ఆ టార్చ్ వెలుగు తప్ప ఇంకే వెలుగూ లేదు .అక్కడ వలయాకారం లో టార్చ్ వెలుగు అతని మీద పడుతోంది .దాదాపు ఏడడుగుల పొడుగు , రెండు చేతులూ పేకెత్తి పెట్టాడు . చేతులకు వేళ్ళు లేవు . మొండి చేతులు .తల వుంది కాని మొహం లేదు .మెడ వరకు నల్లని గుబురు జుట్టు .ఆ జుట్టు లోనుంచి రెండు కళ్ళు . వాటి చుట్టూ వలయాకారం లో మెరుస్తున్న గీతలను బట్టి అవి కళ్ళని తెలుస్తోంది . పెద్ద కడుపు .వెలుగు కాళ్ళ వరకూ పడటం లేనందువలన కాళ్ళు నేల మీద ఆని వున్నదీ లేనిదీ తెలీటం లేదు ."

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

"కెవ్వు మని కేక పెట్టింది భారతి .నల్లగా గడ్డ కట్టిన రక్తం .కళ్ళు కనిపించటం లేదు . ముఖరేకలు కనిపించటం లేదు . ఊపిరి పీల్చటం లేదు . చలనం లేదు .కళ్ళు తెరుచుకొని వున్నాయి కాని వాటిల్లో చూపులేదు . అది శవం . శవం కొయ్యబారిపోయింది . కొయ్యబారిన శవం ఆలింగనం లో తను ఇరుక్కుంది . ఆ శవం ఎవరిది ? . . . . .

* * * * * * * * * * * * * ** * * * * * * * * * * * * * * * * *

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

టి.వి లో టెన్ష పెరిగి పోతోంది .ఇక్కడ నవలలో అంతకన్నా భయంకరం గా టెన్షన్ పెరుగుతోంది . ఎక్కడ గుండె ఆగిపోతుందో అన్నంత టెన్షన్ . . .

ఇంత సస్పెన్స్ లో , ఇంత టెన్షన్ క్రియేట్ చేస్తూ వ్రాయటం ఒక్క కొమ్మూరి సాంబశివరావు కే చెల్లిందేమో ! నేను చదివిన మూడు నవలలూ ఒక దానిని మించి ఒకటి వున్నాయి . . .

మొత్తానికి జగన్ జైల్ దగ్గరకు వచ్చేసాడు .. . కార్ లో నుంచి దిగాడు . . . చిన్న గేట్ లో నుంచి లోపలి కి వెళ్ళాడు . . . గేట్ మూసుకుంది . . . . .

అమ్మ విజయమ్మ , కూతురు , కోడలు ను తీసుకొని దీక్ష మొదలు పెట్టింది . . . తరువాత ఏమి జరిగింది ????? టి. వి చూడుడు . . . .

నవల చదవటం మూ ఐపోయింది . ఈ ముక్కలు ముక్కల కథేమిటి ? అసలు కథేమిటి ? తెలుసుకోవాలని ఆసక్తి వున్నవారు ఇక్కడ చదువుడు .

Tuesday, May 22, 2012

డిటెక్టివ్ యుంగంధర్ అమ్మో మహా ఆక్టివ్



కికికి అని స్కూల్ కొచ్చినప్పటి నుంచి తెగ నవ్వేస్తోంది మా ఫ్రెండ్ స్వప్న . లీజర్ దొరికి నప్పుడు " ఎందుకబ్బా అంత నవ్వుతున్నావు ?" అని అడిగా .
" అది కాదబ్బా , ఈ రోజు మా చిన్నాన్నని మా తాత చెవి పట్టుకున్నాడు . మా నాన్నగారేమో , చదువూ సంద్యా లేకుండా ఆ పిచ్చి పుస్తకాలు చదువుతావురా అని తిట్టారు . "

" ఎందుకబ్బా ? ఏమిటా పిచ్చి పుస్తకాలు ?"

" అవేనే , కాలకూట పాన్ షాప్ లో కట్టి వుంటయ్ చూడు . అవి డిటెక్టివ్ పుస్తకాలంట . చదవకూడదట . మా చిన్నాన్న క్లాస్ పుస్తకం లో పెట్టుకొని చదువుతున్నాడు . మా నాన్నగారు చూసారు . "

ఓహో రోజూ ఇంటికి వెళ్ళేటప్పుడు హనమకొండ చౌరస్తాలో కాలకూట పాన్ షాప్ దగ్గర ఆ పుస్తకాలు తాడు కు కట్టి వుంటాయి చిన్న చిన్న పుస్తకాలు అవి చూస్తునే వుంటాను . అవి ఏమిటో అనుకున్నాను "డిటెక్టివ్ " పుస్తకాలన్నమాట . అవి చదవ కూడదన్నమాట . అవి చదువుతే పెద్దవాళ్ళు కొడతారన్నమాట . ఈ సత్యాలన్నీ మాకు నైంత్ క్లాస్ లో మా ఫ్రెండ్ చిన్నాన్న దెబ్బలు తినటం వల్ల తెలిసాయి . అప్పటి నుంచి కాలకూట పాన్ షాప్ (' కాలకూట 'ఏమిటా ? ఆ పాన్ షాప్ వాడు కలకత్తా పాన్ షాప్ కు 'కే ఏ' దగ్గర 'కే యూ అని రాసుకున్నాడు . వాడీ కీ ఇంగ్లీష్ అంతంత మాత్రమే వచ్చో ఏమో :)) ముందు నుంచి వెళుతున్నప్పుడల్లా ఆ పుస్తకాలను ఆసక్తిగా గమనించే వాళ్ళము .

ఆర్కే లైబ్రరీ లో చేరినప్పుడు ఓ పక్కగా డిటెక్టివ్ బుక్స్ అన్నీ పెట్టి వుండేవి . వాటిని దొంగ చూపులు చూసేదానిని కాని తీసుకొని చదివే ధైర్యం ఎప్పుడూ చేయలేదు , ఎందుకంటే అవి చదువుతే పెద్దవాళ్ళు కొడతారని మనసులో భయం వల్ల . కాని అప్పటికి నేనూ పెద్దదానినే అన్న సంగతి గుర్తులేదు :) ఆ మద్య కౌముది లో నంబర్ 888 కొమ్మూరి సాంబశివరావు నవల సీరియల్ గా రావటం చూసి, చదవాలనిపించి ఎందుకైనా మంచిదని మావారి తో , ఏమండీ నేను డిటెక్టివ్ నవల చదువుదామనుకుంటున్నాను చదవనా అని అడిగాను . ఆయన నా వైపు విచిత్రం గా చూసి చదువూ నన్నెందుకడుగుతున్నావు ? నీ ఇష్టం ఏమైనా చదువు అన్నారు :) అంతే ఆ సీరియలైపోయేదాకా మహా ఇంటెరెస్టింగా చదివాను . అంతే ' డిటెక్టివ్ యుగంధర్ ' కు ఫానయ్యాను . వెంటనే ఆర్కే లైబ్రరీ కి వెళ్ళి కొమ్మూరి సాంబశివ రావు డిటెక్టివ్స్ కావాలి అని అడుగుతే రషీద్ ' అయ్యో సారీ మేడం ఈ మద్యనే ఎవరూ చదవటం లేదని అన్నీ తీసేసాను " అని చావు కబురు చల్లాగా చెప్పాడు . ఎవరెవరికిచ్చాడో కూడా గుర్తులేదట . హూం . . . ఆ తరువాత ఎంత వెతికానో ! కోటీ వెళ్ళి సెకండ్ హాండ్ బుక్ షాప్స్ లలో కూడా వెతికాను .ఎవరి దగ్గర పుస్తకాలు వుంటాయని అనుమానం వుందో వారందరినీ అడిగాను . మా జయ ఎక్కువగా బుక్స్ షాప్స్ కు వెళుతూ వుంటుందని తననీ ఆ పని మీదే పెట్టాను . ఇప్పుడు నాకూ ఆ బుక్స్ చదవాలని పిచ్చి ఎక్కించావు . ఎక్కడా అవి దొరకటం లేదు అని అంటూవుంటుంది . చివరకు ఇదో మల్లాది వెంకట కృష్ణమూర్తి , కొమ్మురి సాంబశివరావు నవల " ప్రాక్టికల్ జోకర్ " ఆధారం గా రాసిన నవల కొని తెచ్చింది . జనవరి లో కౌముది లో కొమ్మూరి సాంబశివరావు నవల "చీకటి కి వేయి కళ్ళు " మొదలైంది . ఇది చదువుతున్నాను కాని ఎంతైనా ఆ పసుపు రంగు కాగితాలు , రంగు రంగుల అట్టలు వున్న చిన్ని చిన్ని పుస్తకాలు చదవాలి అన్న కోరిక మాత్రం తీరే దారి కనిపించటం లేదు . ఇట్స్ టూ లేట్ :(

కొమ్మూరి శైలి ఎంతో సరళం గా సులభం గా వుటుంది . పుస్తకం చదవటం మొదలు పెడితే మధ్యలో ఆపటం కష్టం .ముందు ఏమి జరుగు తుందా అనే ఉత్కంట తో సాగుతుంది . అసలు యుగంధర్ హంతకుడి ని పట్టుకునే దాకా చిత్ర , విచిత్ర మైనా మలుపులతోఎ సాగిపోతుంది . ఇక సీరియల్ గా వస్తుంటే చెప్పేదేముంది , నెక్స్ట్ మంత్ ఎప్పుడొస్తుందా , కౌముది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆరాటమే . తరువాతది చదివే దాకా టెన్షనే :)

కొమ్మూరి సృష్టించిన 'యుగంధర్ ' పాత్ర చాలా విశిష్టమైంది.ఆరడుగుల మూడంగుళాల పొడుగు , బలిష్టమైన శరీరం , విశాలమైన నుదురు ,కోలగా వున్న మొహం ,కండలు తిరిగిన చేతులు ,తీక్షణం గా వున్న కళ్ళు , నల్లని దట్టమైన కనుబొమలతో క్లైంట్స్ కు ధైర్యం కలిగించేలా , శత్రువులకు గుండెలదిరేలా , శత్రువులకు సిమ్హ స్వప్నం లా వుంటాడు యుగంధర్ . ఆయన అసిస్టెంట్ రాజు కూడా ఆయన తెలివితేటలకు ఏమీ తీసిపోడు .దేశం కు శత్రు గూఢాచారు లతో ఏదైనా ఆపద వాటిల్లుతుంది అనుకుంటే ప్రైం మినిస్టర్ , హోం మినిష్టర్ లు ప్రత్యేక అధికారాల తో ఆయనకే కేసును అప్పగిస్తారు .ఏదైనా కేసు చేపడితే తన ధైర్యం తో , తెలివితేటలతో దానిని చేదించి కాని వూరుకోడు యుగంధర్ . అంతటి ప్రతిభాశాలి .

భాస్కరరావు కుటుంబ సభ్యుల మీద రకరకాల ప్రాక్టికల్ జోక్స్ వేసి ఎవరో బాధ పెడుతున్నారు . ఆ బాధలు భరించలేక అతడిని పట్టుకోమని డిటెక్టివ్ యుగంధర్ ను కోరాడు భాస్కరరావు . అతని ని ఎలా పట్టుకుంటారు అన్నదే " ప్రాక్టికల్ జోకర్ " నవల . ఆ ప్రాక్టికల్ జోక్స్ ఏమిటి , యుగంధర్ ఆ ప్రాక్టికల్ జోకర్ ను ఎలా పట్టు కున్నాడు అన్నది ఆ నవల . ఆ కథ నేను చెబితే సస్పెన్స్ ఏముంటుంది ? చదివి తెలుసుకోవలసిందే :)

Thursday, May 10, 2012

బుజ్జిగాడు పాస్ అయ్యాడా :)))))



నిన్న వీడి ని " నా ప్రపంచం " లో చూసి నప్పటి నుంచి వాడి కి బేద్ద ఫాన్ ను ఫాన్ కాదు . . . కాదు . . . ఏ.సి ని అయ్యాను . యస్ జే గారు ఈ బుజ్జిగాడి మీద ప్రేమ తో మాటి మాటి కీ మీ ఇంట్లోకి తొంగిచూస్తూ వుంటే బాగోదనుకొని , వాడిని మా ఇంటి కి తెచ్చేసు కున్నాను .మిమ్మలిని అడగలేదని ఏమనుకోకండి ప్లీజ్ :)

వాడిని మా ఇంటికే కాదు , మా ప్రమదావనం కు కూడా తీసుకెళ్ళాను . ఫేస్ బుక్ లో కూడా పెట్టాను :) అందరూ వాడిని చూసి తెగ ముచ్చటపడిపోతున్నారు .

ఇంకా ఈ బుజ్జిగాడు ఎక్కడైనా వున్నాడా అని గూగులమ్మని అడిగితే ఇదో ఇక్కడ కూడా వున్నాడు అంటూ ఈ చోటు చూపించింది .

నిద్ర లో , మెలుకువలో నన్ను తెగ వేటాడేస్తున్నాడు . ఎప్పుడూ వాడిని చూడటమే :)అసలు ఆ బుడుగ్గాడి కళ్ళల్లో టెన్షన్ చూడండి . నోట్లో వేళ్ళేసుకొని , ఆ వేళ్ళను ను అదిమి పెట్టి కళ్ళు పెద్దవిగా చేసి ఎంత ముద్దుగా పేపర్ లోకి చూస్తున్నాడో . ఆ ముక్కెంత ఉబ్బించాడో పిడుగ్గాడు:) అలా చూస్తూ వుంటే అమాంతం ఎత్తుకొని , ఆబూరె బుగ్గల మీదా , కళ్ళ మీదా , ముక్కు మీదా ముద్దుల వర్షం కురిపించేయాలనిపిస్తోంది నాకైతే :) చిన్ని వెధవ ఎంత ముద్దొచ్చేస్తున్నాడో !

వేలడంత లేడు పొట్టెగాడు , రిజల్ట్ అంటే మరీ అంత టెన్షనా :) ఐనా ఆటెన్షన్ ఎందుకంటారు ? వాడు పాసైనాడా లేదా అనా ? లేక వాడి గర్ల్ ఫ్రెండ్ పాసైందా లేదా అనా ? ఇంతకీ ఈ మురిపాల బుడుగ్గాడు పాసయ్యాడా :)