Monday, July 25, 2011

ఈ రోజు నా షష్ఠి పూర్తి :)))))ఈ రోజు నా షష్ఠిపూర్తి :) అంటే ఈ నాటి తో నాకు అరవై ఏళ్ళు పూర్తవుతాయన్నమాట ! అంటే నేను పుట్టి ఈవాల్టికి అరవై ఏళ్ళు ఐందన్నమాట :) స్చప్ . . . . . ఏమిటో నిన్ననో మొన్ననో నేగా అమ్మ వెన్నెల్లో కూర్చొపెట్టి కథలు చెపుతూ అన్నం పెట్టింది .
ములుగులో చింతచెట్టు కింద కూర్చొని ఆడుకుంటూ వుంటే కృష్ణవేణి అత్తయ్య తీసుకెళ్ళి వాళ్ళ సమితి ఆఫీసులో " భలే తాత మన బాపూజీ " పాడించిందీ కదూ ! ఆ పాట విని ముద్దు ముద్దుగా భలే పాడుతున్నవూ అని భద్రమత్తయ్య వాళ్ళ స్కూల్ లో " అమ్మా నొప్పులే అమ్మమ్మా నొప్పులే " డాన్స్ చేయింది జ్ఞాపకమే గా !
బూర్గుంపాడ్ లో రోజూ తెల్లవారు ఝాముననే , అమ్మ తో కలిసి గోదావరి వడ్డుకు పెసరచేల మద్య నుంచి వెళ్ళిన దీ జ్ఞాపకమే !
మానుకోటలో ప్రైమరీ స్కూల్ లో చేర్చటాని కి నాన్నగారు , తీసుకెళితే , వాళ్ళు మాథ్స్ టెస్ట్ పెట్టి , " మీ అమ్మాయి కి లెక్కల్లో 100 మార్క్స్ వచ్చాయండి . చాలా తెలివిగలది అని మెచ్చుకుంటూనే 6థ్ క్లాస్ లో చేర్చుకోవటానికి వయసు తక్కువ అందుకని 5 థ్ క్లాస్ లో చేర్చుకుంటాము అని హెడ్ మాస్టర్ అన్నప్పుడు ,నేను 6థ్ క్లాస్ లో చేరుతాను అని ఎంత గోలపెట్టానో మర్చిపోయానా ? లేదే ! వయసు తక్కువ అని ఐదో క్లాస్ లో చేర్చినా , యస్. యస్. యల్ . సి కి వచ్చేసరికి ఆ వయసూ తక్కువై రిజల్ట్స్ కోసం నల్లగొండ , హైదరాబాద్ చుట్టూ నాన్నగారిని ఎంత తిప్పించుకొని ఇచ్చారని :)

పి.యు.సి అవుతూనే అనుకోకుండా పెళ్ళైపోయి పూల తో అలంకరించిన పడవంత పూల రధం (కారు ) లో ఊరేగింపుగా అత్తవారింట అడుగుపెట్టినదీ జ్ఞాపకమే . ఆ పైన రెండేళ్ళకే బుజ్జి బుజ్జి చేతులూ , కాళ్ళూ ఆడించుకుంటూ , కళ్ళు విప్పార్చుకొని అమాయకంగా చూస్తూ , నన్ను అమ్మను చేసి నా వడిలోకి చేరిన అమ్మాయి రాకా గుర్తే . అక్కేనా నేనూ వున్నానంటూ ముద్దుగా వచ్చిన అబ్బాయి రాకా గుర్తే :) నాదీ అంటూ నేను సంపాదించుకున్న ఆస్తి వారిద్దరేగా !
వాళ్ళింకా పసిపిల్లలు కారు పెద్దవాళ్ళైయ్యారు సుమా అంటూ , నాకు అత్తగారి ప్రమోషన్ ఇచ్చిన అల్లుడూ , కోడలూ వచ్చి ఎన్నళైందమ్మా ! ఈ మద్యేగా :) అమ్మమ్మా , బామ్మా అంటూ బుజ్జి బుజ్జి మనవరాళ్ళూ మనవళ్ళు వచ్చీ ఎంతోకాలం కాలేదు మరి :)
అభిమానించిన అత్తయ్యగారు , మామయ్యగారు కనుమరుగైన గుండె భారం ఇంకా తీరనే లేదు :(
మీకు మీ పెద్ద అమ్మాయంటేనే ఎక్కువ ప్రేమండీ అని అల్లుడు వేళాకోళాం ఆడుతుంటే మురిపంగా ముసి ముసి నవ్వులు నవ్వుతూనే వెళ్ళిపోయిన నాన్నగారి కోసం కనుల తడి ఆరనే లేదు :(
అన్నీ నిన్నా మొన్నానే ఐనట్లుగా వున్నాయి . ఇంకా ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు ఇంత ఫ్రెష్ గా వుంటే అప్పుడే అరవైళ్ళే గడిచిపోవటమేమిటి ? నమ్మకం కుదరటం లేదు :) కానీ నమ్మక తప్పదు . ఇది కాదనలేని కాలం లెక్క మరి :)
ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన ఆ దేవదేవునికి సర్వదా కృతజ్ఞురాలిని . అడగకనే అన్నీ ఇచ్చాడు . అందుకే ఓకోరిక కోరాలని వుంది . మరి నా ఈ కోరిక తీర్చే భారం ఆ దేవదేవునిదే !!!!!
పైన వున్న ఫొటోలో నేను ఎత్తుకున్నది నన్నే :) అది నా ఫస్ట్ బర్త్ డే ది . నాకు కొత్త ఫ్రాక్ కుట్టింది మా అమ్మే . చక్కగా కొత్త గౌను కుట్టి వేసి , దొడ్లో పూసిన సన్నజాజిపూలను తెంపి దండకట్టి నా మెడలో వేసిందిట మా అమ్మ . అంత ముచ్చటగా తయారు చేస్తే చక్కగా వుంచుకొవచ్చుగా ! అబ్బే . . . ఆ దండను లాగి తెంపి పారేసానట :)
పుట్టిన రోజున చిన్నపిల్లలు ఏమనిపాడుకుంటారు ?
" హాపీ బర్త్ డే టు మి " :)))))