"ఇల్లదీ చూసుకోవాలిగా "
నేను చూస్తా అని పూనుకొని రోజూ తిరిగి ఇళ్ళువెతికారు .
చివరికి ఓ ఇల్లు మా అందరికీ నచ్చింది .
" రేపు పంచమి . పాలుపొంగించుకొని మారిపొండి " అన్నారు నాన్న గారు .
" అలాగే . మరి నావెంట అత్తగారిని తీసుకొని పోతాను ." అంది దుర్గ .
"అదా ! అదెందుకొస్తుంది ?" అన్నారు నాన్నగారు అయోమయం గా .
"ఏం వస్తే కోడలింటికి అత్తగారు రాకూడదా ?" అంది దుర్గ .
"అది నీ వెంట వస్తే నేనేమైపోవాలి ?" అడిగారు ఇంకా షాక్ నుంచి తేరుకోకుండానే .
" సాయం గా మీ అబ్బాయిని వుంచుకోండి !"
"వాడా - వాడెందుకు నాకు ?" అడిగారాయన .
" ఏం నెలతిరిగే సరికి ముప్పై వేలు సంపాదించి పెడుతారు .మా అత్తగారెందుకు మీకు ? తిని కూర్చొని తిక్కపనులు చేస్తుంది అని మీరే పొదస్తమానము అంటారుగా . ఆవిడను నాతో పంపించండి ." అంది దుర్గ .
" నువ్వు రమ్మన్నా అది రాదు . నీ ఎత్తులు దానికి తెలుసు . దానిని తీసుకెళ్ళి చాకిరీ చేయించుకోవాలని నీ ప్లాను " అన్నారు నాన్న .
" ఇక్కడ మాత్రం చాకిరీ చేయక తప్పుతోందా నాకు ? దుర్గ తో వెళితే పని చేసినా ఆదరం గా చూస్తుంది . ఎక్కడికైనా తీసుకెళ్ళి తిప్పి చూపిస్తుంది . నే వెళ్తా ." అంది అమ్మ .
హతాశులైపోయారు నాన్నగారు .
"ఏమిట్రా ఇదంతా ? బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడవేం ?" అన్నారు నన్ను చూసి .
నేను చెప్పేది ఏముంది ? అయినా అమ్మా దుర్గా వెళ్ళిపోతే ఈయిన్ని పెట్టుకొని నేనేం చేస్తాను అందుకే " నేనూ దుర్గ తోనే వెళ్తా " అని చెప్పేశాను .
" నువ్వే గంగ లోనైనా దూకు .నీ భార్య నా భార్యని తీసుకుపోతానంటోంది కదా ! అదే నాకు తలనొప్పి " అన్నారాయన .
" బదులుగా నా భర్త ని సాయం వుంచుతానన్నానుగా - ఆయన వుండనంటే నేనేమి చేసేది .ఇప్పుడు నాకేమి బాధ లేదు. మా ఆయనా మా అత్తగారూ నాతో వస్తారుట . ఇక మీ ఇష్టం రేపు పంచమి , పాలు పొంగించుకొని మారిపోతాం !" అంది దుర్గ .
రాజ్యం కోల్పోయిన రాజులా ఢీలా పడిపోయారు నాన్నగారు . "
ఏమిటీ ఈ మామా కోడళ్ళ కొట్లాట మా ఇంటి రామాయణం అనుకుంటున్నారా ? కాదండీ బాబు ఎంతమాత్రం కాదు . అలా అపార్ధాలు చేసుకోకండి . మరేమిటంటారా ? ఇది " పొత్తూరి విజయలక్ష్మి " గారి " మా ఇంటి రామాయణం ." అదిగో మళ్ళీ అపార్ధం * * * ఆవిడింటి రామాయణం కాదండీ , ఆవిడ వ్రాసిన " మా ఇంటి రామాయణం " కథ లోని భాగమన్నమాట ! ఎలా వుంది ? బ్రహ్మాండం బద్దల్స్ కదా :) అసలు ఆ మామా కోడళ్ళు అలా ఎందుకు పోట్లాడుకుంటున్నారు ? పాపం ఆయనొక్కడిని ఇంట్లో వదిలేసి అందరూ వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు ? తెలుసుకోవాలని కుతూహలం గా వుంది కదూ !
ఇంతే నా ,
" మరునాడు సరస్వతి రాగానే , " వంట సరస్వతీ ఇవన్నీ నాకు నువ్వు నేర్పాలి ." అన్నాడు . పదిపేజీలు వున్న జాబితా చూసి నోరావలించిందామె .
" చాలా ఇవన్నీ " అడిగింది సరస్వతి .
" ఇవి కాక ఇంకా చాలా నేర్చుకోవాలి " అన్నాడు .
" సరేలే పద . " అని కుక్కర్ తీయబోతే వారించాడు .
" అలా కాదు నాకు చెప్పు నేను చేస్తా " అన్నాడు .
" సరే ముందు బియ్యం , కందిపప్పు పట్టుకురా !" అంది కుర్చీలో కూర్చొని. బియ్యం తెచ్చి ఇచ్చి కందిపప్పు కోసం వెళ్ళిన వాడు అక్కడే వుండిపోయాడు .
"ఏం చేస్తున్నావ్ ప్రసాదరావ్ ?" అంది సరస్వతి .
"పప్పుకోసం వెతుకుతున్నా " అన్నాడు . వెళ్ళి చూస్తే స్టీల్ డబ్బాలన్నీ దించి మూతలు తీసిపెట్టి వున్నాయి . ఇంకా డబ్బాలు దించుతుంటే అడ్డుపడింది .
"ఇదిగో ఇక్కడే వుందిగా కందిపెప్పు ." అంది .
"ఏదీ ? ఎక్కడా ? " కళ్ళజోడు సర్ద్దుకుంటూ అడిగాడు .
"ఇదిగో , ఇక్కడా " అంది సరస్వతి .
" ఓ వండక ముందు ముద్దపప్పు ఇట్లా బద్దలుగా వుంటుందా ? నేనింకా ముద్దపప్పు డబ్బాలో కూడా పప్పు లాగే వుంటుందేమో అని వెతుకుతున్నా " అన్నాడు .
తల బాదుకుంది . " చంపావుపో , వండక ముందు పప్పెలా వుంటుందో తెలియనివాడివి నువ్వు వంటేం నేర్చుకుంటావు ప్రసాదరావ్ ?" అంది దీనంగా ."
ఈ ముద్దపప్పు ఎవరు ? ముద్దపప్పు వండేందుకు ఎందుకు తంటాలు పడుతున్నాడో తెలుసు కోవాలంటే "ప్రసాదరావూ - వంట సరస్వతి " చదవాలిసిందే :)
ఇంతేనా అంటే ఇంతేకాదు . ఇంకా వున్నాయి .
" శశికళ కాఫీలు తెచ్చింది . ఇద్దరికీ ఇచ్చింది .
కాఫీ తాగుతుండగా టెలిఫోన్ మోగింది . అదిరిపడి కాఫీ మీద పోసుకున్నాడు ఆనందరావు . " మళ్ళీ ఫోన్ వచ్చింది . ఏ అప్పులవాడో " అన్నాడు దీనం గా .
భర్త వంక దీనంగా చూసి ఫోన్ తీసింది శశికళ .
ఈ అప్పులవాళ్ళ గోల ఏమిటీ ? ఇతను ఇంతగా బెదిరిపోవటమేమిటి ? అన్ని ప్రశ్నలే కదా ? ఆ ప్రశ్నలకి సమాధానాలు "అప్పిచ్చువాడు - వైద్యుడు " లో మాత్రమే దొరుకుతాయి .
ఇంతేనా అంటె ,
ఇంకా జీవితము లో మార్పు త్రిల్లూ వుండాలని భార్య ఎవరినైనా ప్రేమిస్తే , సహృదయం తో భార్యను క్షమించాలని వుబలాట పడి , భార్య ఎవరినీ ప్రేమించలేదని నిరుత్సాహ పడే విశ్వం గురించి "తిక్క కుదిరింది " లో ,
పాపం లక్షణం గా చదువుకొని సుమారైన ఉద్యోగాలు చేసుకుంటూ దర్జాగా బతికిన వాళ్ళు , బొచ్చెలూ , కడవలూ వగైరా పరికరాలు అందుకొని , సతీ సమేతం గా తమ దీనస్తితికి తామే జాలిపడుతూ మేస్త్రీ యాదగిరి తో చివాట్లు తినే పరిస్తితి ఎందుకు కలిగిందీ అంటే నేనేమి చెప్పగలను ? "ఇల్లుకట్టి చూడు " చదివితే తెలుస్తుంది .
చక్కని చుక్కలాంటి అమ్మాయి రాధ . సలక్షణమైన సంబంధం చూసి పెళ్ళి చేసుకోమంటే నాకు పెళ్ళి వద్దు సినిమాల్లో నటిస్తా అనంటుంది . తండ్రి వొప్పుకోకపోతే , పెళ్ళికొడుక్కు నువ్వంటే నాకు ఇష్టము లేదని చెపితే పెళ్ళి తప్పిస్తాడేమో అనుకుంటే "నాకు ఈ పెళ్ళంటే చచ్చేంత ఇష్ట మోర్రో " అని పట్టు బట్టి రాధను పెళ్ళి చేసుకున్నాడు కుర్రడాక్టర్ వంశీ . పాపం రాధ కోరికో అంటారా ఆ((( . . .ఏమైందో "తీరని కోరిక " చదువుతే తెలుస్తుందిగా !
హైద్రాబాద్ నుంచి శ్రీకాకుళం , శ్రీకాకుళం నుంచి నుంచి విజయనగరమూ తిరగటమెందుకు ? ఇద్దరమూ హైదరాబాద్ లోనే వున్నాము కదా ఇద్దరమూ ఇక్కడే కలుసుకొని మాట్లాడుకుందామని పెళ్ళి కూతురు పద్మ ను వొప్పిస్తాడు పెళ్ళికొడుకు డాక్టర్ . కల్యాణ చక్రవర్తి .పెళ్ళి చూపుల కోసం ఇందిరాపార్క్ కు వచ్చిన పద్మకు పెళ్ళికొడుకు , ఇన్సర్ట్ సగము బయటకు వచ్చి , జుట్టు చెదిరిపోయి , చంకలో రెండేళ్ళ పిల్లాడు , ఇంకో చేతిలో బాగు తో దర్శన మిస్తే . . . హా హ హ హ . . . హమ్మ హమ్మ . . . కొంచమాగండి బాబూ నవ్వీ నవ్వీ నా పొట్ట చెక్కలైపోతొంది :) ఇహ నేను చెప్పలేనండీ బాబు . మీరే చదువుకోండి . ఎక్కడా . . . అని ధీర్గం తీయకండి , చెప్తున్నా ,,, చెప్తున్నా ,,,
హాస్య రచనలు చేయటము లో చేయి తిరిగిన రచయిత్రి "పొత్తూరి విజయలక్ష్మి " గారి , " మా ఇంటి రామాయణం " ( హాస్య కథల సంపుటి ) అర్జెంట్ గా విశాలాంద్ర నుంచి 80 రూపాయలకు కొనుక్కొచ్చుకొని చదివేయండి . ఇంతే నా ఇంతేనా అనకుండా అందులో మొత్తం 14 కథలు వున్నాయి . అయ్యో ఇన్నేనా ఇంకొన్ని కథలు ఇందులో రాస్తే ఆ రచయిత్రి సొమ్మేం పోయిందిట అనిపించకపోతే నన్నడగండి . పుస్తకం కాదు . చదివి వాపసు ఇస్తానంటే ఇస్తాను కాని , మీరు తిరిగి ఇస్తారన్న నమ్మకం నాకేమాత్రం లేదు . " అయ్యో మాలా గారూ , మా చంటాడు చింపేసాడండి ." అని అబద్దం ఆడి ఇనప్పెట్టిలో దాచేసుకుంటారు . అందుకని ఇవ్వను . ఆ ఆశ పెట్టుకొకుండా మీరే కొనుక్కొచ్చుకొని చదివేసి మనసారా నవ్వేసుకోండి . నాకు తెలుసు మీరూ ఆ పుస్తకం ఎవరికీ ఇవ్వరు :)



18 వ్యాఖ్యలు:
మొన్న శనివారంనాడే ఈ పుస్తకం కొన్నా. ఇంకా చదవడం మొదలుపెట్టలేదు. మీరు కాస్త రుచి చూపించారు, నేను మొత్తం పదార్ధాలన్నిటినీ అస్వాదించేస్తా!!! :-)
మా ఇంట్లో చంటాడూ లేదు, ఇనప్పెట్టా లేదు. మాల గారూ, నాకు ఈ పుస్తకం కాస్త అరువివ్వరూ? ప్లీజ్?
పుస్తక పరిచయం చాలా బాగుంది.
మాలగారూ మీకిది న్యాయమా? కథల్లోంచి కొన్ని డైలోగులని ఎంచుకుని రాసి “ అయితే మీరు చదివితే సరిపోతుంది కదా” అని మమ్మల్ని ఊరించడం మీకు న్యాయంగా ఉందా? తెలుగు పుస్తకాలు అందుబాటులో లేని నాలాంటివాళ్ళకోసం కొంత కాకపోతే కొంతైనా కథని రాయొచ్చు కదా! అయినాకానీ ఈ తునకలు బాగున్నాయి ఊరిస్తూ. ఎలాగైనా సరే వీటిని తెప్పించుకుని మరీ చదువుతాను ఉండండి.
నాదీ కృష్ణప్రియ గారి మాటేనండీ... మా ఇంట్లో ఇనప్పట్టీ లేదూ చంటాడూలేడు.. కనుక కాస్త మీ పుస్తకం అప్పిప్పిస్తారా ప్లీజ్ :) పరిచయం బ్రహ్మాండంగా ఉందండీ :)
పొత్తూరి కథలు
మెత్తగా మన మనసును అలరిస్తే
కొత్తగా కనిపించే లోకం
వత్తుగా మల్లెలు చల్లుతుంటే
విత్తుగా మనలో చేరిన హాసం
ఎత్తుగా శాఖలను పెంచితే
గుత్తులుగా విరిసిన పున్నాగలు
మత్తుగా కలల్లో తిప్పితే
చిత్తైపోయిన ఖేదం
కొత్తూరికి పారిపోతుంటే
విజయలక్ష్మికి "జయహో"
అని జయం పలకడం తప్ప
ఆమెకి మనం ఏమివ్వగలం...?
రవికిరణ్ గారు ,
ఈ పాటికి పుస్తక్మ్ మొత్తం చదివేసే వుంటారు కదా !
మీ వాఖ్యకు థాంక్స్ అండి .
&క్రిష్ణప్రియ గారు ,
మీ ఇంట్లో చంటాడు లేడనుకోండి . చంటిది వుంది కదా :)
మీకు నా పోస్ట్ నచ్చినందుకు థాంక్స్ అండి .
క్రిష్ణవేణి గారు ,
మీకు ఈ నవల దొరకదని దిగులు పడకండి . ఇదేకాదు మీకే నవల కావాలన్నా కొని పంపిస్తానండి . విశాలాంద్ర మా ఇంటి వెనుకే వుంది . నేను కోటీ దాకా వెళ్ళి ఇబ్బంది పడుతున్నానని ఈ మద్య మా ఇంటి వెనుకే ఓ బ్రాంచ్ పెట్టారు .
&వేణూ శ్రీకాంత్ ,
మీ ఇంట్లో చంటాడు రావటం ఎంతసేపండీ బాబు . ఐనా అరువేగా అడిగారు . అచ్చంగా ఇవ్వలేను కాని అరువిస్తానులెండి .నా పరిచయం మీకు నచ్చినందుకు థాంక్స్ అండి .
శ్రీలలిత గారు ,
మీ కవిత చాలా చాలా బాగుందండి .
చక్కటి కవిత తో వాఖ్య రాసినందుకు ధన్యవాదాలండి .
బాగు౦ది :)
ఇది 'చంద్రహారం' తర్వాత ఈమధ్యనే వచ్చినట్టుంది.. లాభం లేదు, పుస్తకాల షాపు మీద దాడి చేయాలి.. పరిచయం మాత్రం బ్రహ్మాండం... అన్నట్టు కందిపప్పు లాంటి ఐడియాలు విజయలక్ష్మి గారికి మాత్రమే వస్తాయేమో కదండీ..
చాలా బాగుందంది మీరు పరిచయం చేసిన విధానం.
మౌళి గారు ,
థాంక్స్ అండి .
& మురళి గరు ,
అవునండి . ఆవిడ రచనల ఐడియాసే వేరండి . పెళ్ళికొడుకు చంక లో పిల్లాడి తో ప్ర్త్యక్షమవటము ఎక్కడైనా విన్నామా ? గుర్తొస్తే చాలు నవ్వు వచ్చేస్తుంది .
థాంక్స్ అండి .
& శిశిరా ,
నేను చేసిన పరిచయము మీకు నచ్చినందుకు థాంక్స్ అండి .
chaalaa baagaa vraasaarandi... keep it up.........
చదివి వాపసు ఇస్తానంటే ఇస్తాను.......
మాలా గారు మీరు మాట మీద నిలబడతారట కదా ? చదివి ఇస్తాను ఆ బుక్ ఇస్తారా ?
బుద్దా మురళి గారు ,
మాట నా 60 కేజీల బరువును ఆపగలదంటారాండి :)
రుక్మిణిగారు ,
థాంక్స్ అండి .
ప్రస్తుతం మా చంటిది మా ఇంట్లో లేదండీ కాస్త అరువివ్వండి...నిజ్జంగా తిరిగిచ్చేస్తాను...వొట్టు...అమ్మ తోడు...భలే వూరించి వదిలేసారు...సినిమా(మంచి) trailer లాగా
మాలా కుమార్ గారూ ఈ పుస్తకం వెంటనే తెప్పించేసుకోవాలని ఉంది...
స్పురిత గారు ,
అలాగే నండి ఇస్తాను . మరి మా ఇంటికొచ్చేయండి .
జ్యోతిర్మయి గారు ,
తెప్పించేసుకోండి మరి :)
Post a Comment