అమలాపురం లోని తిలక్ గారికి ఇద్దరు అమ్మాయిలు . పెద్దమ్మాయి హేమలత , చిన్నమ్మాయి స్వర్ణలత. ఆయనకి ఇద్దరూ అమ్మాయిలే కొడుకులు లేరు అని అందరూ అనుకున్నా ఆయన మటుకు ఆడపిల్లలైతే మాత్రమేమి ' బంగారు తల్లులు ' అనుకున్నాడు . హేమలతని , సరోజినీనాయుడు అంతటి దానినీ , స్వర్ణలతని ఇందిరాగాంధీ అంతటి దానినీ చేయాలని అనుకున్నాడు . హేమలత కి చదువు మీద శ్రద్ధ వుండేది . బాగా చదువుకునేది . బి. ఏ పాసైనాక ఎం. ఏ చదవటానికి వైజాగ్ లో హాస్టల్ లో వుంచాలా , తమ్ముడి ఇంట్లో వుంచాలా అని అలోచిస్తున్న సమయం లోనే పొద్దున తొమ్మిది గంటలకు ఓ యువకుడు వచ్చాడు . తిలక్ గారి ఎదురుగా నిలబడి ,
" నా పేరు మధుసూధనం . ఎం.బి . బి యస్ పాస్ అయ్యాను . రెండు లక్షల ఆస్తి వుంది .అమ్మా , నాన్నా , అన్న , తమ్ముడు , అక్కా , చెల్లి అంతా వున్నారు . నేను మీ పెద్ద అమ్మాయి హేమలతను పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాను . ఇస్తే మీ అమ్మాయిని ఇవ్వండి . లేకపోతే మీరు లేచి ఆ కుర్చీ ని ఇటివ్వండి ." అన్నాడు .
అప్పటిదాక అతన్నే చూస్తూ అతను చెప్పే మాటలని వింటున్న తిలక గారు ఆశ్చర్యం గా చూసి , " కుర్చీ ఎందుకు నాయనా ? కుర్చీ కి నా కూతురికి కల సంబంధం ఏమిటి " అని అడిగారు .
వెంటనే జేబులోనుంచి మూరెడు నైలాన్ తాడు బయటకు తీసి " మీ అమ్మాయినిచ్చారా సరే . లేదంటే ఇదో ఈతాడు తో ఆ దూలానికి ఉరిపోసుకుంటాను ." అన్నాడు మధు .
హేమలత అంగీకారముతో , సరిగ్గా రెండు నెలల తరువాత అతను అడిగిన కుర్చీ కన్నా మంచివి అరడజను కుర్చీలు , మంచాలు స్టీలు సామాన్లు , బీరువా వగైరా సామాన్ల తో పాటు , తన కూతురిని కూడా ఇచ్చి పెళ్ళి జరిపించేసారు తిలక్ గారు .
హేమలత విషయం ఇలా ఐనా స్వర్ణలతను చదివించాలని గట్టిగా అనుకున్నారు . కాని స్వర్ణకి నవలల మీద వున్న ఇంటరెస్ట్ చదువు మీద లేదు . ఎన్నో సార్లు తండ్రి దగ్గరకు వెళ్ళి ' నాన్నారూ మీరిక సంబధాలు చూడటము మొదలుపెట్టొచ్చండి . నాకిక చదువు మీద ఇంటరెస్ట్ పోయింది ' అని చెప్పాలనుకుంది . కాని సిగ్గు , మొహమాటం అడ్డొచ్చాయి .
'పోనీలే ఆర్నెలల్లో బి. యస్సీ ఐపోతుంది . రిజల్ట్ చూస్తే వాళ్ళకే తెలిసి సంబంధాలు చూడటము మొదలు పెడుతారు ' అనికొని శాంతం వహించింది . కాని వెధవది బోర్ కొడుతోంది . ఆ కాబోయే శ్రీవారు ఎవరో తెలిస్తే ఉత్తరాలు రాసుకోవచ్చు . ఎంచక్కా అతనెప్పుడైనా వస్తే కబుర్లు చెప్పు కోవచ్చు , సినిమాలకు వెళ్ళ వచ్చు . కాని ఎలా తెలిసేట్టు ? ఈ విశాలప్రపంచం లో తన కాబోయే భర్త ఎక్కడున్నాడో ? ఎవరు చెప్తారు ?. . .
ఆలోచనలు తెగని స్వర్ణ లేచి బైట బాల్కనీలోకి వెళ్ళింది . తెల్లని చల్లని వెన్నెల్లో మిల మిలా మెరిసిపోతున్నాడు చంద్రుడు . హేమ పెళ్ళైన కోత్తల్లో తను చేసిన చిలిపి పని గుర్తొచ్చింది .
అప్పట్లో మనసును అదుపు లో పెట్టుకోలేక , ఏ దారి తోచక ఉత్తరం రాస్తే బాగుండు అనుకుంది . అషాఢమాసం అక్క పుట్టింట్లోనే వుంది .దానికి బావ ఇచ్చిన లెటర్ పాడ్ లో నుంచి కాగితాలు తస్కరించి ఆ గులాబీ రంగు కాగితాల మీద తన మనోభావాలని వివరం గా రాసింది . చదువుకున్న తరువాత సిగ్గు, బాధ , సంతోషం , దుఖం ముంచుకొచ్చాయి .ఈ ఉత్తరం , ఇంత మంచి ఉత్తరం అందుకోగలిగిన అందగాడు ఎక్కడ వున్నాడో కదా ! చేతులారా చించివేయటానికి మనసు ఒప్పలేదు . ఎవరికి పంపడం ? ఇంట్లో వుంచేసి పెళ్ళికాగానే ఆయనకు ఇవ్వొచ్చు . కానీ అమ్మకు ప్రతి ఆదివారం తన గది సద్దటం అలవాటు . ఇది ఆమె కంట పడిందో నానా రభస చేసేస్తుంది . అందుకని ఎవరికైనా పంపాలని నిశ్చయించుకుంది .
నానారకాలుగా ఆలోచించి ఓ.ఏ.ఆనందరావు అనే పేరు మీద ఏదో ఆడ్ లో కనిపించిన ఓ కంపెనీ మానేజర్ అడ్రెస్ రాసింది . కింద సంతకం తన పేరు ను కొద్దిగా మార్చి ' సోని ' అని రాసి అక్క పెళ్ళిలో మిగిలి పోయిన కునేగా సెంటు ఆ కవరు మీద చల్లి , ' ఓ పంచ భూతములారా . . . ఏ పరమేశ్వరా ! నేను మనోవాక్కాయ కర్మలా నా కాబోయే భర్తను తప్ప మరిఒకరిని స్మరించని పతివ్రతను అగుదునేని నా ఈ ఉత్తరము నా పతిదేవునికి చేరుగాక ' అని విజ్ఞప్తి చేసి పోస్ట్ డబ్బాలో పడేసింది .
ఓ.ఏ. ఆనందరావు మరి ఆ ప్రేమ లేఖను అందుకున్నాడా ? అందుకున్నాక అతని పరిస్తితి ఏమిటి అంటే ఏమిచెప్పమంటారు ? ఆ వుత్తరం కోస్తా తీరప్రాంతమైన నెల్లూరు , ఒంగోలు , తెనాలి , విజయవాడ మీదుగా గంటకు నలభై మైళ్ళ వేగం తో మద్య మద్య ఆగుతూ కేవలం ఆరు రోజులు మాత్రం ప్రయాణం చేసి తీరికగా హైదరాబాదు చేరుకొని బలహీనమైపోయిన సెంటు వాసనతో ఓరుగంటి ఆనందరావు గారి చేతుల్లో వాలి అతని హృదయం లో కేందీకృతమైపోయింది .
పాపం . . . ఆనందరావు ! ఏ పాపమూ ఎరుగని ఆనందరావు పరమ శోత్రీయ కుటుంబం లో పుట్టిన పరంధామయ్య గారి కుమారుడు . సాక్షాత్తు శ్రీ రామ చంద్రుడిలాగ పితృవాక్య పరిపాలకుడు . తండ్రి నిర్ణయించిన బుద్దిమంతురాలిని పెళ్ళి చేసుకొని ఏ చీకూ చింతా లేకుండా హాయిగా కాలం గడుపుదాము అనుకుంటూ వుండగా ' సోనీ ' రాసిన ఉత్తరం పెను తుఫానులా చుట్టేసింది . అనుక్షణం సోనీ కోసం వెతికి వెతికి వేసారిపోతున్నాడు . రోడ్డుమీద పోయే ప్రతి ఆడపిల్లనూ పరీక్షగా చూసి కనీసం పదిమందినైనా పలకరించబోయి చివాట్లు తిన్నాడు . మరీ ఒకమ్మాయి చెంప పగలగొట్టబోతే ఎలాగో తప్పిచుకొని బయట పడ్డాడు .
ఆగండాగండి . నేను పొత్తూరి విజయలక్ష్మి గారు రాసిన " ప్రేమలేఖ " ను కాపీ కొట్టటము లేదు . నేను చదివిన ఆ నవల గురించి చెప్తున్నాను అంతే ! అంతలోనే నన్ను కాపీరైటర్ లా చూస్తే ఎలా :))) ఇలాంటి సంఘటనలు ప్రేమలేఖ లో కో కొల్లలు . నవల చదవటము మొదలు పెడితే ఎక్కడా ఆపటమంటూ వుండదు . నాన స్టాప్ ఎక్స్ ప్రెస్ లా ఏకబిగిన చదివేయాల్సిందే ! ఒక్కో పాత్రా ఒకొక్క వెరైటీ బిహేవియర్ కలిగి వుంటాయి . ఆనందరావు నాన్న పరంధామయ్య వున్నాడా ? అబ్బో ఆయ్న ను చూస్తే అందరికీ హడలే ! రిటైర్ అవకముందు హెడ్మాస్టర్ పరంధామయ్య అంటే పంతుళ్ళు , పిల్లలు వణికిపోయేవారు .ఇంట్లో భార్య మాణిక్యాంబ , కొడుకులు , కూతురు , కోడలు , అల్లుడు , పాలేర్లు , పని వాళ్ళు అందరూ వణికిపోయేవారు . ఆయనను ఎదిరించి , ఆయన ఎదుట నిలబడి సమాధానం చెప్పినవాళ్ళు ఇంతమటుకు ఎవరూ లేరు . ఇక ముందు వుంటారన్న భయంలేదు . ఎందుకంటే అరవై ఐదేళ్ళు ఏకచ్చత్రాధిపత్యం గా బండి నడిపించిన పరంధామయ్యకి తన శేష జీవితాన్ని కూడా ఇలాగే గడిపేయగలనన్న ధీమా వుంది . అందుకు తగిన ఆస్తిపాస్తులున్నాయి .
ఆయన భార్య మాణిక్యాంబ పరమ సాద్వీమణి .ఇంకోరెవరైనా ఐతే పరంధామయ్య అరుపులకు గజ గజ వణికిపోయేవారే . కాని ఎప్పటి నుంచొ భర్త తో కాపురం చేస్తున్న ఆమెకు భర్త ధోరణి అలవాటైపోయింది . ఆయనకి ఎవరి మీద కోపం వచ్చినా ఎదుట వున్నవాళ్ళనే తిడుతాడు . అందుకే ఆయన అరుస్తుంటే ఆవిడ ఎవరిమీద కోపమోలే అనుకుంటూ నిమ్మకాయ బద్ద నంజుకొని మజ్జిగన్నం తింటూ తల కూడా ఎత్తదు . అంత కూల్ అన్నమాట !
ఆయన ఏకైక పుత్రిక కామేశ్వరి పట్టుపట్టి మేన మామ తో పెళ్ళి జరిపించుకుందేకాని చాలా అమాయకురాలు . పుట్టింటి పెట్టిపోతలు లేవు అన్న అసంతృప్తి తప్ప ఆమెకు ఇంకేమీ దిగులు లేదు . ఆమె భర్త సూర్యనారాయణమూర్తి గంగిగోవులాంటి వాడు . ఎగ్రికల్చర్ బి . యస్ సి . పాసై వ్యవసాయం చేస్తూ , బంగారం పండిస్తూ , వున్న దాన్ని రెట్టింపు చేసాడు .
పరంధామయ్య పెద్ద కొడుకు భాస్కర్ రావు . ఇంజనీర్ . ఒరిస్సాలో ఉద్యోగరీత్యా వుంటున్నాడు . చక్కటి రూపం . అతి మంచివాడు . కడు సమర్ధుడు . కాకపోతే పేకాట ఆడుతాడు . అది అతని దృష్టి లో వ్యసనం కాదు . అతని భార్య అన్నపూర్ణ . చాలా అమంచిది . చక్కనైనది . పాటలు బాగా పాడుతుంది . కాకపోతే సినిమా పిచ్చి. సినిమా చూసిందంటే టైటిల్స్ దగ్గర నుండి , శుభం వరకూ భర్త కు కథ చెప్పకుండా వుండలేదు ! భాస్కరరావు ఆమెతో ఏమైనా చెప్పాలనుకుంటే " పూర్ణా ! ఓ చిన్నమాట చెప్పాలి . ఇంటర్వెల్ లో గుర్తుచేయ్యి . నీతో కాస్త మాట్లాడాలి " అని పర్మిషన్ తీసుకుంటాడు పాపం !
సో ఇవ్వండీ అందులోని పాత్రలూ వారి స్వభావాలునూ . ఆ (( . . . నవలలో నేను చెప్పినంత చప్పగా వుండవు . చాలా స్ట్రాంగ్ మెంటాలిటీస్ అన్నమాట . ఒక్కో సంఘటన చదువుతూ , అంతేందుకు నవల చదువుతున్నంత సేపూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వాలిసిందే :) ఆ తరువాత కూడా నవ్వుతూ నే వుంటాము . చక్కని హాస్యం తో చాలా బాగుంటుందీ నవల . ఇంకెందుకూ ఆలెశ్యం ? విశాలాంధ్ర లో 80 రూపాయలకు కొనుక్కొని చదివేయండి .
మీ అనుమానం నిజమే . ఈ నవల " శ్రీవారికి ప్రేమలేఖ " అనే పేరు తో వచ్చింది . కాకపోతే కొద్దిగా మార్పులు , ముఖ్యంగా స్వర్ణ ప్రేమలేఖ రాసిన పరిస్తితి వేరుగా వుంటుంది . సినిమా కూడా సూపర్ వుంటుంది . ఎంతైనా జంధ్యాల దర్షకత్వం కదా !
శ్రీవారికి ప్రేమలేఖ ను నా కమ్మటి కలలు లో చూసి నవ్వుకోండి .



9 వ్యాఖ్యలు:
సగం చదవగానే అనిపించిందండీ ఇది శ్రీవారికి ప్రేమలేఖ సినిమా అని అయితే ఈ సినిమా నవల ఆధారంగా తీసారన్నమాట.
మా ఇంట్లో ఎక్కువగా యండమూరి,యద్దనపూడి నవల్స్ వుంటాయి.
ఈ సారి ఎమెస్కో లో తెప్పించుకుంటాము ఈ ప్రేమలేఖ.
అప్పుడెప్పుడో చదివిన నవలని బలే గుర్తు చేసారండీ...
రాజీ,
థాంక్స్ అండి .
శ్రీలలిత గారు ,
చిటుకు ,పుటుకు అంటూ వచ్చిన రెండు కామెంట లలో మీది రెండోది . పబ్లిష్ చేసానండి . పబ్లిష్ ఐంది కూడా . అదేమిటో ఇప్పుడు చూద్దును కదా మీ కామెంట్ పుటుక్కున ఏటో ఎగిరిపోయింది . నిజమండి నేనే పాపమూ ఎరగను . మీరు నమ్మాలి . సరే నండి మీ కామెంట్ కు థాంక్స్ అండి .
malagaru,
baagundi..maa amalapuram kadha antunnaru kadaa chadavaali mari..
మాలకుమార్ గారు శ్రీవారికి ప్రేమలేఖ సినిమా ఈ నవల ఆధారంగా తీసారా .. నాకు పొత్తూరి విజయలక్ష్మి గారి రాసిన కధలలో "అమ్మమ్మ కధలు " ఉంటాయి ........ వాటికి నేను పిచ్చి ఫేన్ ని అన్నమాట ..నాకు చాల చాల ఇష్టం ఆ కధలు ...... ఫుల్ కామెడీ ఆ కధలన్నీ
ఈ సినిమా నాకు ఇష్టమండి. కానీ దానికి ఈ నవల ఆధారం అని నాకు తెలియదు.
సుభద్ర ,
చాలా రోజులకు వచ్చారు .
థాంక్యు .
రంజనీ ,
నాకు ఈ అమ్మమ్మ కథలు తెలీదు . ఈ సారి కొనుక్కొచ్చుకుంటాను . నాకు పొత్తూరి రచనలన్ని ఇష్టం . అన్నీ కామెడీగానే వుంటాయి .
& శిశిర ,
థాంక్ యు .
Post a Comment