Friday, October 29, 2010

అమెరికా ప్రయాణము లో నా ఎడ్వెంచర్ * * * * *

మొదటిసారిగా అమెరికా వెళ్ళటము * * * ఎప్పుడో ఓ సారి విమానమెక్కి హైదరాబాద్ నుంచి కలకత్తా వెళ్ళానే గాని , ఇన్ని సంవత్సరాల తరువాత , ఒక్క దానినే , గ్లోబ్ కు అవతలి వైపున వున్న అమెరికాకి , విమాన మెక్కి అన్ని గంటలు ప్రయాణము చేయటమే !!! తలుచుకుంటే గుండె గుభిల్లు మంటోంది . కాని అమ్మమ్మా అంటూ వచ్చే చిట్టి తల్లి కోసం వెళ్ళక తప్పదు . . . అందరూ అమెరికా వెళుతున్నావు అని గొప్పగా అంటున్నారే కాని గుండె గుబ గుబ * * * * * వీసా కష్టం మీద దొరికింది ! వెళ్ళను అన్లేను . . . ఇక్కడైతే లేబర్ రూం లో లక్ష్మి వుంటుంది , పెద్ద దిక్కు అత్తయ్యగారున్నారు . . . హాస్పిటల్ లో డ్యూటీ చేసేందుకు ఎందరో వున్నారు . . . ముఖ్యం గా భారం ఆయనగారి మీద వేసేసి నిశ్చింత గా వుండొచ్చు . . . . అక్కడ అంతా కొత్త . . . ప్రదేశము , దేశము , వాతావరణము , అల్లుడూ . . . అన్ని ఎలా సంభాళించుకుంటానో ఏమో ????? మేకపోతు ఘాంభీర్యము తో విమానమెక్కాను . . . ఎక్కేముందు , మావారు వాళ్ళ ఫ్రెండ్ కొడుకు అని , నేను వెళ్ళే విమానము లో నే న్యూయార్క్ వరకూ వస్తాడనీ , పరిచయము చేశారు . అమ్మయ్య గుడ్డిలో మెల్ల . . . ఆ అబ్బాయిదీ నా పక్క సీటే . నాకు కిటికీ పక్క సీట్ వచ్చింది . . . రామచంద్రా . . . కిటికీ పక్కన ఎలా కూర్చునేది ????? గాలికి తలుపు తెరుచుకొని , ఇంత ఎత్తు నుంచి కిందపడిపోతే . . . దేవుడా . . . రాముడా . . . ఎన్ని కష్టాలు పెట్టావురా తండ్రీ . . అని దిక్కులు చూస్తూ నిలబడ్డాను . ఇంతలో ఓ అమ్మాయి ఎక్స్ క్యూజ్ మీ . . . మీ సీట్ లోకి వెళుతారా ఇది నా సీట్ అన్నది . చిన్నగా . . . మొహమాటం గా ప్లీజ్ మీరు కిటికీ పక్కన కూర్చుంటారా ??? నేను ఇటు కూర్చుంటాను అన్నాను . ఆ అమ్మాయి తల్ల కిందులై పోయి . . . బోలెడు హాచర్య పోయి . . . వై నాట్ అంటూ ఆనందం గా కూర్చుంది . హమ్మయ్య పెద్ద ప్రమాదం తప్పింది ( ప్రమాదము కిటికీ లో నుండి పడిపోవటము కాదు . నవ్వకండి నాకా మాత్రం తెలుసు . కాక పోతే మావారు నాకున్న కిటికీ పిచ్చి తెలిసిన వారు కాబట్టి , మొదటిసారి నేను కిటికీ పక్కన కూర్చుంటే అంత ఎత్తు నుండి కిందికి చూస్తే కళ్ళు తిరుగుతాయేమో , ఆయన పక్కన లేక పోతే , మరింత భయపడతానని , కిటికీ పక్కన కూర్చోవద్దని చెప్పారు . ఆయన గారి మాట వినాలి కదా ! ఇప్పుడైతే ఎవరు అరిచి ఘీ పెట్టినా కిటికీ పక్క సీట్ ఏమాత్రం త్యాగం చేయను . కిటికీ లో నుండి , తేలిపోయే మబ్బులను , అప్పుడప్పుడు , మాప్ లోలా కింద కనిపించే భూమిని చూస్తూ ఊహల మబ్బుల్లో తేలిపోయే అవకాశాన్ని ఎంతమాత్రం త్యాగం చేయను గాక చేయను ) అని నిట్టూర్చి , ఆ అమ్మాయి కి బోలెడు థాంకూలు చెప్పి , కిటికీ వైపు , ఆ అమ్మాయి , రెండో వైపు మా వారి ఫ్రెండ్ కొడుకు రెడ్డీ కూర్చోగా సేఫ్ గా మద్య సీట్లో బైటాయించాను . ఇంతలో ఏర్ హోస్టమ్మ కూల్ డ్రింక్ తెచ్చింది , ఊం హూ వద్దు అని తల అడ్డంగా తిప్పేసాను . ఏర్ హోస్టమ్మ విచిత్రం గా చూస్తుండగా , రెడ్డి , తాగండాంటీ కొంచం కూల్ గా వుంటుంది అన్నాడు . పాపం పిల్లాడు చెపుతున్నాడు కదా అని కూల్ డ్రింక్ తీసుకున్నాను . న్యూయార్క్ లో దిగేవరకూ ఇద్దరూ బోలెడు కబుర్లు చెప్పారు . న్యూయార్క్ లో విమానం ఆగింది , అంతే అప్పటి వరకూ ముచ్చట్లాడిన పిల్ల నన్ను నెట్టుకుంటూ గబ గబా దిగేసి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది . రెడ్డి మటుకు నేను ఎలా బయటకు వెళ్ళాలో చెప్పి , నేను మారాలిసిన విమానము ఎక్కేందు కు , ఇంకో టర్మినల్ కు ఎలా వెళ్ళాలో చెప్పి వెళ్ళి పోయాడు . ఆ అబ్బాయి విమానము వేరే చోట అట . చేసేదేముంది , చిన్నగా ముందుకు నడిచాను .

ఎలాగో నా లగేజ్ కలెక్ట్ చేసుకున్నాను . చెకౌట్ చేసే చోట ఓ నల్ల ఆఫీసర్ చూస్తేనే చాలా భయం వేసింది , ఎనీ గోల్డ్ అని అడిగాడు . ముందు అతనేమంటున్నాడో అర్ధం కాలేదు . ఇద్దరమూ తిప్పలు పడ్డాక , అర్ధమై , నా చేతికున్న గాజులు తప్ప ఇంకేమీ లేవని ఎలాగో చెప్పి బయట పడ్డాను . ఆ న్యూయార్క్ , విమానాశ్రయం , లాంజ్ లో నిల బడితే కొద్ది క్షణాలు ఏమవుతోందో తెలీలేదు . ఎటు వెళ్ళాలో తోచలేదు . . . తిరణాల లో తప్పిపోయిన పిల్ల పరిస్తితి ఐంది . కనెక్టింగ్ ఫ్లైట్ కు ఎక్కువ సమయము లేదు . పీచు . . . పీచు మంటున్న గుండె తో బయటకు వచ్చాను .ఎటెళ్ళాలని , ఎవరినో అడుగుతే హడావిడి గా ఎదురుగా కనిపిస్తున్న రోడ్ క్రాస్ చేసి , లోపలికి వెళ్ళమని చెప్పి వెళ్ళిపోయాడు . అటూ . . . ఇటూ . . . ఏ వెహికిల్సూ రావటము లేదని నిర్ధారించుకొని , , , చూసి రోడ్ కు అవతలి వైపు పరిగెత్తబోయాను . ఇంతలో ఆంటీ ఆగండి , ఇక్కడ అలా రోడ్ దాటకూడదు అని వినిపించింది . వెనకకి తిరిగి చూస్తే రెడ్డి . ఏమిటీ నువెళ్ళలేదా అని అడిగాను . నా ఫ్లైట్ కు ఇంకా టైముందట . మిమ్మలిని ఫ్లైట్ ఎక్కించి వెళుదామని వచ్చాను అన్నాడు . చెక్ ఇన్ చేయించి అట్లాంటా ఫ్లైట్ కు ఎటెళ్ళాలో చూపించి వెళ్ళాడు . అలా మొదటిసారి అమెరికా కు చేరిన నేను ఇంకెన్ని అడ్వెంచర్స్ చేసానో తెలుసా ?? ఇందులో అడ్వెంచర్ ఏముంది అని పెదవి విరవకండి . . . ఆ క్షణము లో రెడ్డి రాకపోతే పరుగెత్తుకుంటూ రోడ్ దాటుతున్న నన్ను పోలీసులు పట్టుకునే వారని రెడ్డి చెప్పాడు . అప్పుడు నా పరిస్తితి , పడమటిసంద్యారాగం లో విజయశాంతి లా , అదేదో సినిమా లో భానుప్రియ లా అయ్యేది . ఏం చేయాలో , అసలు నన్ను పోలీసులు ఎందుకు పట్టుకున్నారో తెలీని దిక్కుక్కుతోచని , అయోమయ . . . అయ్య బాబోయ్ ఇక నేను చెప్పలేను . అంతే కాదండోయ్ , ఆ తరువాత ప్రయాణాలల్లో మావారు కూడా కొన్ని ఎడ్వెంచర్స్ చేసారు . ఆశ , , దోశ . . అప్పడం . . . అన్ని ఇప్పుడే చెప్పేస్తానేమిటి ??

అరె ఆగండాగండి , అన్నీ , ఇప్పుడే ఇక్కడే చెప్పను అన్నాను కాని అసలు చెప్పను అనలేదు గా !!! ఇదిగో ఇంకో విశేషం బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ లో రాశాను . అదీ చదివండి మరి . ఇంకొన్ని విశేషాలు మరోసారి .

బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ లో నా అమెరికా ముచ్చట్లు ప్రచురించిన సృజనకు చాలా చాలా థాంకూలు .

Tuesday, October 19, 2010

టాటా వీడుకోలు . . . గుడ్ బై . . . ఇక సెలవు * * *



ఒక పోస్ట్ కోసం , గూగుల్ లో ఫొటో ఏదైనా దొరుకుతుందా అని వెతుకుతున్నాను . ఇంతలో మా అబ్బాయి , అట్లా గూగుల్ నుంచి బ్రౌజ్ చేయకు , వాటికి కాపీ రైట్స్ వుంటాయి . ఎవరైనా అభ్యంతరము చెప్పవచ్చు . అన్నాడు . మరైతే ఎలా ? అని అడుగుతే , మనమే , మనకు కావలసి దానిని ఫొటో తీసుకోవాలి అన్నాడు . అన్నట్లుగానే నాకెప్పుడు అవసరమైనా , తనే ఫొటో తీసి నాకు మేయిల్ చేసేవాడు . చాలావరకు , వీలైంత వరకు ఫొటో లు తీసి ఇచ్చేవాడు . ఓసారి పియస్ యం లక్ష్మి గారు పొగడపూల గురించి వ్రాశారు . అక్కడ ఎవరో పొగడపూలు ఎలా వుంటాయి అని అడిగారు . అది చూస్తే , మా ఇంటి దగ్గరలో వున్న పొగడచెట్టు గుర్తొచ్చింది . మా అబ్బాయి వూళ్ళో లేడు , ఫొటో తీసి ఆవిడకు పంపటము ఎలా అని తెగ ఆలోచించి , చివరకు , మా కోడలు ఇంట్లోనే వున్నదని గుర్తొచ్చి , ఫొటో తీస్తావా అని అడిగాను . పాపం తను చేసుకునే పని ఆపి , బయటకొచ్చి ఫొటో తీసి ఇచ్చింది . అలా మా కోడలి ని కూడా డ్యూటీ ఎక్కించాను ! ఇంతలో మావారి సెల్ తో కూడా ఫొటోలు తీయచ్చు అని తెలిసింది . హాపీగా ఆ సెల్ తో కూడా ఫొటోలు తీసే దానిని . ఇలా మూడు సెల్లులు , ఆరు ఫొటోల తో కాలము గడిచి పోతూ వుండ గా . . . విధి వక్రించింది . మా వారి సెల్ కాస్తా దొంగోడెత్తుకెళ్ళాడు ! మా అబ్బాయికి టూర్ లు , మా కోడలి కి ఆఫీస్ పని ఎక్కవయ్యాయి .

కాకపోయినా వాళ్ళంతా ఎప్పుడూ బిజీ గా వుంటారు . అన్ని సార్లూ వాళ్ళకు కుదరక పోవచ్చు . ఎలా ????? ఏమి చేయటము ????? అవును గురూజీ ని అడుగుతే పోలే , అనుకొని అసలు ఫోటోలు ఎలా అప్ లోడ్ చేయాలి అని , జ్యోతి గారి ని అడిగాను . కెమేరా తో తీసి చేయాలి అని చెప్పారు . కెమేరాలో అప్ లోడ్ చేయటానికి వీలు వుంటుంది అని ఎలా చేయాలో చెప్పారు . అంతే , మా వారిని , మా అబ్బాయిని నాకో కెమేరా కావాలీ . . . అని షంటటము మొదలు పెట్టాను . ఇప్పుడు నీకు ఇంత అర్జెంట్ గా కెమేరా ఎందుకు అన్నారండీ మావారు . అదికాదండీ , మన టపాలు ఎవరైనా చదవాలంటే చక్కటి ఫొటోలుండాలి కదా ? 10000 రూపాయల కే మంచి కెమేరా వస్తుందిట . మా జ్యోతి గారు కొనుక్కోమన్నారు అన్నాను . 10 000 లేనండీ ఎక్కువకాదు అని కూడా నచ్చచెప్పాను . మా అబ్బాయి కొన్ని రోజులు ఆగు మాతే , ఇప్పుడు నేను తీసిస్తున్నాను కదా అని ఆ ప్రోగ్రాం ను వాయిదా చేసాడు . మరే నాలుగు దేశాలలో , నాలుగు మాల్ స్ ల లో ధర తెలుసుకోకుండా , ఎలా కొంటాడులే అనుకొన్నాను , కాని నా కో కెమేరా కావాలీ . . . అనే నా నసుగుడు మాత్రం ఆపలేదు !

నా గొడవ పడలేక ఓ శుభోదయాన , శుభముహూర్తాన మా అబ్బాయి తన బ్లాక్ బెర్రీ నాకు ఇచ్చేసాడు ! అంతే దాని తో ఎన్ని ఎన్నెన్ని ఫొటోలు తీసానని , అబ్బో చెప్పలేనన్ని . చింతకాయ పచ్చడి , సొరకాయ రసిపీలు , రాజమండ్రి , గోదావరి అందాలు , మా కాలనీ సొగసులు , నల్లటి వాన చినుకులు , కొత్త ఇల్లూ , అబ్బో ఒకటని చెప్పనా ? సంవత్సరము పైగా నాకు నచ్చినవన్నీ , ఎంచక్కా బంధించి ఇచ్చింది . నా టపాలలో చాలావరకు నా బ్లాక్ బెర్రీ తెచ్చిన ఫొటోలే . ఇన్ని రోజులు పని చేసీ . . . చేసీ నా నేస్తం అలసి పోయి , మూగపోయింది . మూతపడుతున్న కనురెప్పలను భారం గా ఎత్తి , నావైపు దీనం గా చూసింది . ఏ డాక్టరూ ఏ ఆపరేషన్ చేసి కనులు తెరిపించలేమన్నారు . . . నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి . స్చప్ . . . నన్ను వీడి వెళ్ళ లేక వెళ్ళ లేక వెళ్ళిపోయిన , నా స్నెహితురాలికి , కన్నీటి తో వీడ్కోలు పలకటము తప్ప నేనేమి చేయగలను ?


ఓ నా స్నేహితురాలా ,
మరువలేని , మధురమైన జ్ఞాపకాల చిత్ర్రాలను చిత్రించి ఇచ్చావు .
నీ ఉపకారమును నేనెన్నడూ మరువలేను . . . . . మరచిపోను ,
ఇకముందు నువ్వు నా టపాలకు సుందరమైన దృశ్యాలను ఇవ్వలేవు అని తలుచుకుంటే నే గుండె భారమై పోతోంది .
నీకేమీ చేయలేకపోయిన ఈ నిస్సహాయురాలిని క్షమించు మిత్రమా !
ఇదే నీకు నా కన్నీటి నివాళి !!!!!!

Thursday, October 7, 2010

ఆయన మట్టి తింటున్నాడు * * * * *

ఆయన మట్టి తింటున్నాడు * * * * * నేను 10త్ చదువుతున్నప్పుడు, మా క్లాస్ కు, కాకినాడ నుండి, ఓ కొత్తమ్మాయి వచ్చింది. సారు నా పక్కనే కూర్చో బెట్టారు. అలవాటు ప్రకారము నీ పేరేమిటబ్బా అని అడిగాను. పద్మజ అని చెప్పి, “మీ పేరేమిటండీ?” అని అడిగింది. “అదేమిటీ నన్ను మీరు అంటున్నావు” అని అడిగాను. అప్పటికే అమ్మాయిలందరూ నా బెంచ్ దగ్గర చేరి, కుతూహలంగా కొత్తమ్మాయి ని చూస్తున్నారు. ఆ అమ్మాయి గీరగా అందరినీ చూస్తూ, “ఇక్కడ వాళ్ళందరూ అబ్బా , నువ్వు , రావే, పోవే అని వే అంటూ మాట్లాడుతారు. మా వైపు అలా మాట్లాడమండి. ఎవరి తోనైనా మర్యాదగా మీరు, అండి అనే మాట్లాడుతామండి. ఐనా అలా మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతారండి?” అని అడిగింది. ఇదేమిటి ఈ పోరి ఇలా మాట్లాడుతొంది అని అందరమూ చెవులు కొరుక్కున్నాము . ఎవరూ పద్మజ తో స్నేహము గా కూడా వుండలేదు. అవును మరి మమ్మలిని మర్యాద లేనివాళ్ళు అన్న అమ్మాయి తో ఎలా మాట్లాడుతాము? కాని మేమూ మర్యాద కలవాళ్ళమే అని తెలుపుకోవటానికి తనతో అందరమూ “పద్మజ గారండీ” అనే మాట్లాడే వాళ్ళము . అంతే కాదు మా సంస్కారము తెలుపుకోవటానికి, ప్రయత్నము మీద ఓ నెల తిరిగేసరికి మాలో మేము కూడా మీరు, అండి అనే స్టేజ్ కి వచ్చేసాము. మా క్లాస్ లో శకుంతల అందరికన్నా పెద్దది . ఏదో పెళ్ళి చదువు చదువుతోంది. అమ్మాయిలను, అబ్బాయిల ను అందరినీ దబాయించి తన నోట్స్ లు రాయించేది. హోంవర్క్ చేయించేది. అందరిలోకీ రాంబాబు ను మరీ దబాయించి పారేసేది . రాంబాబు కూ ఏమీ అనలేని పరిస్తితి . వాడు సారీ, రాంబాబుగారు, శకుంతల ఇంటి పక్కనే వుండే వారు. ఆయనగారి చిన్నప్పటి నుండీ శకుంతలా వాళ్ళింట్లోనే అక్కా అక్కా అంటూ పెరిగాడు. ఓ రోజు శకుంతల “రాంబాబు గారండీ ఈ నోట్స్ రాసి పెట్టండీ” అంది. అంతే రాంబాబు అయోమయం ఐపోయాడు.” ఏంటక్కా ఏమన్నావు?” అని అడిగాడు." అదేనండి అలా నువ్వు అనకూడదు. మీరేమన్నారు అక్కగారండీ అనాలి” అని రాంబాబును ఎడ్యుకేట్ చేసింది. అంతే రాంబాబు గారు తల్లకిందులైపోయి, బెంచీల మీద గెంతి కాసేపు పిచ్చి చేష్టలుచేసారు. రాంబాబు ఒక్కడే కాదు, మా క్లాస్ అబ్బాయిలందరూ ఈ పరిణామానికి తట్టుకోలేక పోయారు. మా శకుంతలక్క ఎవరు నువ్వు అన్నా వూరుకునేది కాదు . మెల్లి మెల్లి గా కాకినాడ అమ్మాయి పుణ్యమా అని , అందరూ గౌరవంగా మాట్లాడటము నేర్చుకున్నారు . ' రా, 'వే' లాంటి పదాలు బొత్తిగా కనిపించకుండా పోయాయి. ఇదంతా చూసి మా సార్ లు ఝాటర్ ఢమాల్! ఆతరువాత , పద్మా నేనూబెస్ట్ ఫ్రెండ్స్ మి అయ్యాము. తన మూలం గానే ఇప్పటికీ ఎంత చిన్నవాళ్ళైనా మొదటి పరిచయములో నువ్వు అనలేను. నాకు అలా 10త్ నుండే చిన్నా పెద్దా అందరినీ మీరు అనటము అలావాటైందా, మా పిల్లలకు, మా మనవరాళ్ళకు, ఎదుటివారిని అలా గౌరవించి మాట్లాడటము నేర్పటము లో నాకేమీ ఇబ్బందులు ఎదురుకాలేదు. కాకపోతే చాలా ఏళ్ళు మా అబ్బాయి , 'మాలా మమ్మీ ' , 'ఏమండి డాడీ 'అని పిలిచేవాడు. విన్నవాళ్ళు నీకెంత మంది మమ్మీలూ, డాడీలున్నారురా అని వెక్కిరించేవారు. పైగా వాడితో పాటు వాడి ఫ్రెండ్స్ అందరూ మాలా మమ్మీ, ఏమండీ డాడీ అని పిలుస్తుంటే మానిపించలేక తల ప్రాణం తోకకొచ్చింది. వాడు మటుకూ ఇప్పటికీ అప్పుడప్పుడూ ముద్దుగా మాలా మమ్మీ, ఏమండీ డాడీ అనే అంటాడు! కాని మా బుడుగులున్నారు చూశారూ వాళ్ళతోటే బోలెడు తిప్పలు! మా విక్కీ కి సంవత్సరము లోపలే మాట్లాడటము వచ్చేసింది. (రోజంతా నువ్వు వాడిని వాగిస్తావు అందుకే అన్ని మాట్లొచ్చాయి అని మా అమ్మాయి అనేది.) ఓరోజు నేను ఏదో పని లో వున్నప్పుడు “అమ్మమ్మా వాడు నన్ను తీసుకెళుతాడట” అన్నాడు. “ఎవడ్రా వాడు” అన్నాను నేను. వెంటనే పక్కనుంచి “నేనాంటీ “ అన్నాడు మా అల్లుడు. వెంటనే నాలిక్కరుచుకొని, తల కొట్టుకొని, మా అల్లుడి కి బోలెడు సారీ లు చెప్పాను. మా అల్లుడుగారు ఏమనుకున్నారో అని చాలా రోజులు తెగ ఫీలైపోయాను. ఆ తరువాత విక్కీ కి, అలా పెద్దవాళ్ళను వాడు అనకూడదు అని చెప్పాను. మరేమనాలి అన్నాడు. “డాడీ తీసుకెళుతానన్నారు” అనాలి అని చెప్పాను. అలాగే అని బుర్ర వూపాడు . “అమ్మమ్మా డాడీ చూడు నన్ను బయటకు తీసుకెళ్ళరట” అని ఓసారి కంప్లైంట్ చేశాడు. డాడీ ఎక్కడున్నారు రా అంటే మా ఏమండీని చూపించాడు. ఆయన తాత కదరా అంటే, నువ్వు పెద్దవాళ్ళ గురించి చెప్పేటప్పుడు డాడీ అని చెప్పమన్నావు కదా అన్నాడు . ఉష్ . . . రామచంద్రా ఏం చెప్పను ఈ పిల్లాడి కి? ఏం తోచలేదు. వదిలేసాను! విక్కీ స్కూల్ కు వెళ్ళటము మొదలు పెట్టాక కొత్త ప్రాబ్లంస్ వచ్చాయి. స్కూల్ లో ఎవరినో చూపించి పనమ్మాయి లక్ష్మి తో వాడు అంటూ ఏదో చెప్పాడుట. అతనేమో లక్ష్మిని , విక్కీ ని గుర్రున చూశాడట. అలా రెండు మూడు సార్లు అయ్యాక, లక్ష్మి విక్కి బాబూ అలా వాడూ వీడూ అనకూడదు. ఆయన అనాలి అని కష్టపడి నేర్పించింది. మొత్తానికి మా విక్కీకి ఎదుటి వాళ్ళను గౌరవం గా సంభోదించటము వచ్చింది ఎంత అంటే "అమ్మమ్మా బిచ్చగాడుగారు వచ్చారు అన్నం పెడదామా?"అనేంత! "పాపం పనిమనిషిగారొక్కరే గిన్నెలు ఉతుకుతున్నారు (గాభరా పడకండి తోమటం, ఉతకటం, ఊడవటం కు చాలా రోజులు తేడా తెలీలేదు మా పిల్లలందరికీ పాపం), నేను హెల్ప్ చేయనా" అనేది మా మనవరాలు! అంత మర్యాద నేర్చుకున్నారన్నమాట! అమ్మయ్య అనుకున్నాను. ఇహ చిన్నోడు మా అబ్బాయి కొడుకు ఏమో మా ఏమండీని చాలా రోజుల వరకు ఏమండీ అని పిలిచేవాడు. ఏమండీ ఏమిట్రా తాత అనాలి అంటే నువ్వు ఏమండీ అంటావు కదా అనేవాడు . తాత అనాలి అని నేర్పించాక , బామ్మా నీ ఏమండి నిన్ను పిలుస్తున్నాడు అనో , మీ ఏమండి చూడు అనో మా ఏమండీ గురించి చెప్పేవాడు. నవ్వుకోవటము తప్ప ఏంచేయగలను? నేను చెప్పటము ఇంకా ఐపోలేదండీ బాబూ. అసలు కథ ఇప్పుడే మొదలైంది! " అమ్మమ్మా ఆయన మట్టి తింటున్నాడు" మూడేళ్ళ పెద్దోడు, ఏనిమిది నెలల చిన్నోడు గురించి నాకు చెప్పాడు. బుడి బుడి నడకల తో ఎప్పుడు మెట్లు దిగి వెళ్ళాడో మా చిన్న బుడుగ్గాడు బయట, జామ చెట్టు కింద కూర్చొని మట్టి గుప్పిళ్ళ తో తీసుకొని, వళ్ళంతా పులుముకొని, నోట్లో పెట్టుకుంటూ ఆడుకుంటున్నాడు. అలా వాడిని చూస్తే భలే ముద్దొచ్చి ఎత్తుకోగానే, మా దొరవారు నాకూ కాస్త మట్టి పులిమి, ప్రేమగా తినిపించే ప్రయత్నం చేసారు !!! " బామ్మా , ఆయన నా పి .యస్ . బి తీసుకున్నాడు." " కాదు అమ్మమ్మా ఇది నాదే. ఆయన పి. యస్. బి అత్త దాచి పెట్టింది ." "అమ్మమ్మా ఆయన , నాకు లాప్ టాప్ ఇవ్వటము లేదు." " బామ్మా నేను ఆడుకున్నాక ఆయనకు ఇస్తాను." " ఆయనకు నేను కొత్త గేం చూపిస్తానన్నాను అమ్మమ్మా." ఇలా రోజూ మా మనవళ్ళిద్దరు మాట్లాడుకునే పద్దతి. పొరపాటున కూడా వరేయ్ అని కాని, వాడు అని కాని అనరు. ఎంత పద్దతి గా పెంచాను కదా! ఇదండీ సంగతి. మీరెప్పుడైనా వీకెండ్ లో ఏ ఐమాక్స్ థియేటర్ లోనో , ఏ లుంబినీ పార్క్ లోనో , ఓ తొమ్మిదేళ్ళ , ఆరేళ్ళ అబ్బాయిలు ఆయన, ఆయన అని మాట్లాడుకోవటం వింటే మీరు ఝాటర్ ఢమాల్ అవకండి. వాళ్ళిద్దరూ ఖచ్చితం గా నా మనవళ్ళే అని తెలుసుకోండి. మేమెంత మర్యాదగా మాట్లాడుతామో తెలిసిందిగా * * * * * అదన్నమాట సంగతి !!!!!!!!!!